• Home »
  • Cable »
  • డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్స్ అంశాన్ని ప్రధానితో మళ్ళీ ప్రస్తావించిన జయలలిత

డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్స్ అంశాన్ని ప్రధానితో మళ్ళీ ప్రస్తావించిన జయలలిత

తమిళనాడు ప్రభుత్వ కేబుల్ పంపిణీ సంస్థ అరసు కేబుల్ టీవీకి డిజిటల్ ఎమ్మెస్వోగా లైసెన్స్ ఇవ్వాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ప్రధానికి విజ్ఞప్తిచేశారు. పాతికవేలమంది ఆపరేటర్లు దీనిమీద ఆధారపడి ఉన్నారని, 62 లక్షలకు పైగా కేబుల్ కనెక్షన్లున్నాయని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. మూడేళ్ళుగా తమ దరఖాస్తు పెండింగ్ లో ఉండటాన్ని ప్రస్తావిస్తూ అప్పట్లో యుపిఏ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే లైసెన్స్ ఇవ్వలేదని ఆరోపించారు. దీనివలన డిజిటైజేషన్ అమలులో తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.  కళానిధి మారన్ ఆధ్వర్యంలోని సుమంగళి కేబుల్ విజన్ కు మేలు చేయటానికే మిగిలిన ఎమ్మెస్వోలకు లైసెన్స్ రాకుండా చేశారని జయలలిత ఆరోపించారు.

రాష్టప్రభుత్వాలు చానల్స్ పెట్టటం గాని చానల్ ప్రసారాలు పంపిణీచేయటం గాని చేపట్టకూడదంటూ ట్రాయ్ చేసిన సిఫార్సులు ప్రస్తుతం మంత్రుల కమిటీ పరిశీలనలో ఉన్నాయి. అయితే, తమిళనాడులో ప్రభుత్వ సంస్థే స్వయంగా కేబుల్ ప్రసారాల పంపిణీ చేపట్టటంతో ఆ సంస్థకు డిజిటల్ ఎమ్మెస్వోగా లైసెన్స్ ఇవ్వటమనే వ్యవహారం పెండింగ్ లో పడింది. ఇప్పటికే నాలుగైదు సార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసిన తమిళనాడు ప్రభుత్వం ఇప్పుడు ప్రధానికే నేరుగా వినతి పత్రం ఇచ్చింది.