• Home »
  • Cable »
  • కనెక్షన్ కు నెలకు రూ.10 వినోదపు పన్ను: కొచ్చి కేబుల్ ఆపరేటర్ల నిరసన

కనెక్షన్ కు నెలకు రూ.10 వినోదపు పన్ను: కొచ్చి కేబుల్ ఆపరేటర్ల నిరసన

కేరళలోని కొచ్చి నగర పాలక సంస్థ ఒక్కో కేబుల్ కనెక్షన్ మీద రూ. 10 చొప్పున వినోదపు పన్ను వసూలు చేయాలని నిర్ణయించింది. ఆ విధంగా ఏడాదికి రెండు కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని భావిస్తోంది. దీంతో కొచ్చి ఆపరేటర్ల సంఘంతోబాటు కేరళ కేబుల్ టీవీ ఫెడరేషన్ సభ్యులు కూడా కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఒక నగరంలో ఉదాసీనంగా ఉండిపోతే ఇది రాష్ట్ర మంతటా విస్తరించే ప్రమాదముందని భావిస్తున్నారు.

కొచ్చి కేబుల్ టీవీ ఆపరేటర్ల సంఘం ప్రతినిధులు ముఖ్యమంత్రి ఊమెన్ చాందీని, మున్సిపల్ వ్యవహారాల శాఖా మంత్రి మంజలం కుళిని కలిసి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరారు. ఈలోగా కేరళ కేబుల్ టీవీ సమాఖ్య కూడా కొచ్చి మేయర్ కు, డిప్యూటీ మేయర్ కు వినతిపత్రాలు అందజేసింది. పేదవారికి అందే వినోదం మీద పన్ను విధించటం తగదని సమాఖ్య అధ్యక్షుడు ఇ. జయదేవన్ ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు.

ప్రభుత్వం పేద ప్రజలమీద విధించే వినోదపు పన్ను వలన అనివార్యంగా నెలవారీ కేబుల్ బిల్లులు పెరుగుతాయని. అది పరోక్షంగా డిటిహెచ్ ని ప్రోత్సహించటమేనని విమర్శించారు. ఇప్పుడు విధించిన వినోదపు పన్నును ఇతర నగరాలు, పట్టణాలు కూడా అనుసరించే ప్రమాదం ఉందని పేర్కొంటూ నగర పాలక సంస్థ వెంటనే ఉపసంహరించుకోని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉద్ధృతం చేస్తామని జయదేవన్ హెచ్చరించారు