• Home »
  • Other Channels »
  • ఎక్కడి వ్యాపారం అక్కడే: ఢిల్లీ కోసం హోమ్ షాపింగ్ చానల్ దిల్లీ దిల్ సే

ఎక్కడి వ్యాపారం అక్కడే: ఢిల్లీ కోసం హోమ్ షాపింగ్ చానల్ దిల్లీ దిల్ సే

దేశ వ్యాప్తంగా మార్కెటింగ్ పెంచటం కోసం హోమ్ షాపింగ్ చానల్స్ మొదలై ఇప్పుడు ప్రాంతీయ భాషలకూ విస్తరించటం తెలిసిందే. సినీ 21, షాప్ సిజె తెలుగు లాంటి చానల్స్ చూస్తున్నాం. త్వరలో నాప్తోల్ కూడా పూర్తి స్థాయి తెలుగు చానల్ గా రాబోతోంది. అయితే, ఢిల్లీ కి చెందిన ఇన్ స్పైర్ ఇన్ఫ్రాటెక్ అనే సంస్థ కాస్త భిన్నంగా ఆలోచించింది. శాటిలైట్ చానల్స్ ఉండగానే కేబుల్ చానల్స్ విజయవంతమైన పద్ధతిలో కేవలం ఒక  నగరం కోసమే ఒక హోమ్షాపింగ్ చానల్ పెడితే ఎలా ఉంటుందన్నదే ఆ ఆలోచన.

సంస్థ వ్యవస్థాపక డైరెక్టర్ రాజీవ్ గుప్తా వెంటనే ఈ ఆలోచనను అమలులో పెట్టారు. ఢిల్లీ వ్యాపారులకూ, ఢిల్లీ వినియోగదారులకూ అనుసంధానంగా వ్యవహరించటానికి ఈ చానల్ పెడుతున్నట్టు కూడా ప్రకటించారు. ఈ లోకల్ హోమ్ షాపింగ్ చానల్ పేరు “ దిల్లీ దిల్ సే “. నాణ్యమైన ఉత్పత్తులను ప్రదర్శించుకోవటానికి షాపులవాళ్ళకు ఇదొక వేదికలా ఉపయోగపడుతుంది. వినియోగదారులు కూడా ఆన్ లైన్ లో ఆర్డర్ చేయవచ్చు. ఆర్డర్ చేయటం కోసం ఒక యాప్ కూడా విడుదల చేయబోతున్నారు. ఆర్డర్ చేసిన నాలుగ్గంటల్లొనే డెలివరీ ఉంటుందని చెబుతున్నారు.

ఎమ్మెస్వోలు సైతం త్వరలో స్థానిక కేబుల్ చానల్ ద్వారా ఇలాంటి హోమ్ షాపింగ్ పథకాలు ప్రవేశపెట్టి లాభపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్వయంగా అలాంటి చానల్ నడపకపోయినా, మరెవరైనా నడుపుకుంటే కారేజ్ ఫీజు రూపంలో ఆదాయం పెంచుకోవటానికి వీలుంది. స్మార్ట్ ఫోన్ల వాడకం పెరిగిపోయి ఆన్ లైన్ కొనుగోళ్ళకు గిరాకీ పెరుగుతున్న సమయంలో కొత్త కొత్త మార్గాల్లో ఆదాయం పెంచుకునేలా ఈ తరహా కొత్త పద్ధతులు అందుబాటులోకి వస్తున్నాయి.