ప్రకటనల పరిమితి మీరిన తెలుగు చానల్స్

10+2దేశ వ్యాప్తంగా 112 పే చానల్స్ ప్రకటనల పరిమితిని దాటినట్టు ట్రాయ్ వెల్లడించింది. ఒకవైపు ఈ ప్రకటనల పరిమితి వ్యవహారం కోర్టులో తేలాల్సి ఉండగా మరోవైపు గతంలో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా చానల్స్ ఎంత సేపు ప్రకటనలు ప్రసారం చేశాయో స్వయంగా ట్రాయ్ కి తెలియజేశాయి. ఆ సమాచారం ప్రకారం మొత్తం 112 చానల్స్ గంటకు 12 నిమిషాల పరిమితిని మించిపోయాయి.

జులై- సెప్టెంబర్ మాసాల మధ్య ప్రైమ్ టైమ్ లో ప్రసారం చేసిన ప్రకటనల మీద ట్రాయ్ ఈ నివేదిక వెల్లడించింది. 10 జాతీయ చానల్స్ తో సహా మొత్తం 27 న్యూస్ కూడా 12 నిమిషాల ప్రకటనల పరిమితిని దాటాయి. ఆ విధంగా 139 చానల్స్ ఈ నిబంధనను పాటించలేదని ట్రాయ్ వెల్లడించింది. ఈ విధంగా వరుసగా మూడో సారి ట్రాయ్ నివేదికలు విడుదల చేస్తూ వచ్చింది. ప్రాంతీయ చానల్స్ ఈ జాబితాలో ముందున్నాయి.

మరీ ముఖ్యంగా సన్ టీవీ నెట్ వర్క్ లోని అన్ని చానల్స్ ఈ పరిమితిని దాటిపోయి ఈ జాబితాలో ప్రధానంగా కనబడటం విశేషం. 11 హిందీ జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్, 19 మూవీ చానల్స్, 16 ఇంగ్లీష్ ఎంటర్టైన్మెంట్, ఇన్ఫొటైన్మెంట్ చానల్స్ , తొమ్మిది యూత్ , మ్యూజిక్ చానల్స్ , ఆరు పిల్లల చానల్స్ ఇందులో ఉన్నాయి.

ప్రాంతీయ చానల్స్ 51 ఉండగా వాటిలో 23 సన్ నెట్ వర్క్ చానల్స్ కావటం విశేషం. సన్ గ్రూప్ చానల్స్ పక్కనబెడితే, స్టార్ ఇండియా వారి కన్నడ చానల్ సువర్ణ టీవీ అత్యధికంగా సగటున 15.06 నిమిషాల మేరకు ప్రకటనలు ప్రసారం చేయగా తెలుగు చానల్ మా గోల్డ్ 12.25 నిమిషాలు ప్రసారం చేసింది.

ప్రకటనల ప్రసారంలో పరిమితి మీరిన తెలుగు చానల్స్ జాబితా ఇలా ఉంది: జెమిని మూవీస్ (16.65), జెమిని (16.6), జెమిని కామెడీ(14.47), జెమిని మ్యూజిక్ (13.92), జీ తెలుగు (13.83), మా టీవీ ( 13.74 ), మా మ్యూజిక్ ( 13.27), మా మూవీస్ ( 13.17 ), మా గోల్డ్ (12.25)

తెలుగు ఎంటర్టైన్మెంట్ చానల్స్ సంగతలా ఉంటే, పే ఛానల్ అయిన ఈటీవీ న్యూస్ సగటున 13.22 నిమిషాల ప్రకటనలు ప్రసారం చేసింది.