• Home »
  • Legal Issues »
  • మా టీవీ నెట్ వర్క్ మళ్ళీ చానల్స్ పెట్టటం కుదరదు

మా టీవీ నెట్ వర్క్ మళ్ళీ చానల్స్ పెట్టటం కుదరదు

వ్యాపారాన్ని, బ్రాండ్లను మాత్రమే స్టార్ గ్రూప్ కి అమ్మేసిన మాటీవీ నెట్ వర్క్ ఇప్పుడు సొంతగా చానల్స్ పెట్టుకోవటానికి వీల్లేదని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. హోం శాఖ సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దవటం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచార, ప్రసార శాఖ సహాయమంత్రి రాజవర్ధన్ సింగ్ రాథోడ్ పార్లమెంటుకు తెలియజేశారు. మా టీవీ నెట్ వర్క్ తోబాటు మరో ఏడు సంస్థలకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది.

ఐదు చానల్స్ కు దరఖాస్తు చేసిన మహువా మీడియా, ఒక చానల్ కు దరఖాస్తు చేసిన సాయి ప్రకాశ్ టెలికమ్యూనికేషన్, పాజిటివ్ టెలివిజన్ (ఆరు చానల్స్, రెండు టెలిపోర్టులు ), మా టీవీ నెట్ వర్క్ ( నాలుగు చానల్స్ ), ఎస్టీవీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ ( నాలుగు చానల్స్ తో బాటు ఒక టెలిపోర్ట్), ఇందిరా టెలివిజన్ ( ఒక టెలిపోర్ట్, ఒక చానల్ ), లెమన్ ఎంటర్టైన్మెంట్ ( రెండు చానల్స్ ) ఈ జాబితాలో ఉన్నాయి.

ఈ సంస్థలలో మా టీవీ నెట్ వర్క్ సహా నాలుగు సంస్థలకు షో కాజ్ నోటీసులు జారీ చేశారు. ఆ సంస్థలు ఇచ్చే సమాధానం ఆధారంగా మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకుంటుందని మంత్రి చెప్పారు. మా టీవీ నెట్ వర్క్ ఇప్పటికే సమాధానం ఇవ్వగా ప్రభుత్వం హోంశాఖతో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇవి కాకుండా సన్ టీవీ నెట్ వర్క్ కి చెందిన 33 చానల్స్, రెండు టెలిపోర్టుల విషయంలో కూడా హోం శాఖ గతంలో క్లియరెన్స్ రద్దు చేసింది. దీంతో సన్ నెట్ వర్క్ కోర్టుకు వెళ్ళింది. ఆ వ్యవహారం కోర్టులో తేలాల్సి ఉంది.

మా టీవీ నెట్ వర్క్ కు ఈ ఏడాది ఆగస్టు 5న హోం మంత్రిత్వశాఖ సెక్యూరిటీ క్లియరెన్స్ ను ఉపసంహరించుకున్నట్టు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు తెలియజేసింది. దీంతో అదే నెల 12న సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ మా టీవీ నెట్ వర్క్ కు షో కాజ్ నోటీసు జారీచేసింది. దానికి మా టీవీ నెట్ వర్క్ సమాధానం పంపింది. ఆ సమాధానం మీద నిర్ణయం కోరుతూ సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఈ నెల 7న హోం మంత్రిత్వశాఖకు లేఖ రాసింది. ఇప్పుడు హోం శాఖ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ప్రస్తుత పరిస్థితుల్లో హోం శాఖ ఆ సమాధానంతో సంతృప్తి చెందితే తప్ప మా టీవీ నెట్ వర్క్ సొంతగా చానల్స్ పెట్టుకోవటానికి కుదరదు. అదే సమయంలో బ్రాండ్ తో బాటు ఆస్తులు మాత్రమే కొనుక్కున్న స్టార్ గ్రూప్ కు ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. ఇప్పటికే మా బ్రాండ్లు నాలుగింటినీ తమ సంస్థ పేరుమీదికి స్టార్ గ్రూప్ మార్చుకోగలిగింది. మా టీవీ నెట్ వర్క్ లోని డైరెక్టర్ల విషయంలో మాత్రమే హోంశాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసు ఆధారంగా సన్ నెట్ వర్క్ చానల్స్ కు కూడా క్లియరెన్స్ ఇవ్వకూడదని హోం శాఖ నిర్ణయించటం తెలిసిందే.