• Home »
  • Entertainment »
  • అక్టోబర్ నుంచి ’మీలో ఎవరు కోటీశ్వరుడు’ సీజన్-3

అక్టోబర్ నుంచి ’మీలో ఎవరు కోటీశ్వరుడు’ సీజన్-3

మీలో ఎవరు కోటీశ్వరుడు మూడో సీజన్ త్వరలో ప్రారంభం కాబోతోంది. మొదటి సీజన్ ఘన విజయం తరువాత ఎక్కువ విరామం లేకుండా రెండో సీజన్ మొదలుపెట్టిన మా టీవీ కాస్త ఆలస్యంగానైనా ఇప్పుడు మూడో సీజన్ మొదలుపెట్టబోతోంది.  రేటింగ్స్ లో నెంబర్ వన్ స్థానానికి అప్పుడప్పుడూ విఘాతం కలుగుతుండటంతో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గతంలో వెంటవెంటనే రెండు సీజన్స్ నడిపినప్పుడు సిని’మా’ అవార్డులను కూడా ఒక సంవత్సరం నిలిపివేసిన సంగతి తెలిసిందే.

మరో రెండు వారాల్లో రిజిస్ట్రేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. అక్టోబర్ మొదటి వారంలో ఈ షూటింగ్ మొదలుపెట్టి చివరి వారం నుంచి ఈ కార్యక్రమం ప్రసారం ప్రారంభం కావచ్చునని తెలుస్తోంది. గతంలో రెండో సీజన్ రిజిస్ట్రేషన్ 2014 అక్టోబర్ 9న ప్రారంభంకాగా సరిగ్గా రెండు నెలలకు డిసెంబర్ 8 న ప్రసారం మొదలైంది. అందుకే ఈ సారి కూడా అక్టోబర్ చివర్లో లేదా నవంబర్ మొదటి వారంలో మొదలయే అవకాశాలున్నాయి.

ప్రసార సమయం కూడా ఇంకా నిర్ణయించుకోలేదని తెలుస్తోంది. మొదటి సీజన్ లో 9 గంటలకు, రెండో సీజన్ లో 9.30 కి ప్రసారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. 9 గంటలకే మొదలుపెట్టటం వలన చిన పట్టణాల ప్రేక్షకులు ఎక్కువమంది చూస్తున్నట్టు తేలినా, 9.30 కి మొదలుపెట్టటం వలన ప్రేక్షకులను 10.30 వరకూ ఉంచగలగటం లాభదాయకంగా కనిపించింది. అందువలన అన్ని అంశాలనూ బేరీజు వేసుకొని, ఇతర చానల్స్ లో కార్యక్రమాలను కూడా దృష్టిలో ఉంచుకొని సమయం నిర్ణయిస్తారని తెలుస్తోంది.