• Home »
  • BARC »
  • బాహుబలి ప్రసారం ఇక ’మా టీవీ’ వంతు

బాహుబలి ప్రసారం ఇక ’మా టీవీ’ వంతు

మలయాళంలో మళవిల్ మనోరమ చానల్ ఈ నెల 4 న ఆదివారం నాడు బాహుబలి ప్రసారం చేయగా ఇప్పుడు మా టీవీ ఈ నెల 24 శనివారం నాడు ప్రసారం చేయటానికి సిద్ధమవుతోంది. కొంతకాలంగా నెంబర్ వన్ స్థానం కోల్పోయిన మా టీవీ దసరా కార్యక్రమాలలో కలపకుండా ఈ మెగామూవీ ని ప్రత్యేకంగా ప్రసారం చేయటం ద్వారా లబ్ధిపొందాలనే ఆలోచనలో ఉంది.

నిజానికి మలయాళంలో బాహుబలి ప్రసారం ద్వారా ఆ చానల్ కి ఆ స్లాట్ లో అత్యధికంగా రేటింగ్ వచ్చినప్పటికీ, ఆ వారంలోనైనా మలయాళంలో నెంబర్ వన్ చేయలేకపోయింది. అయితే, తెలుగులో మాత్రం చానల్స్ మధ్య రేటింగ్ లో తేడా తక్కువగా ఉండటం వలన ఇలాంటి భారీ చిత్రం తెచ్చే రేటింగ్స్ తో రాంకులు మారిపోతాయని భావిస్తున్నారు.

రేటింగ్స్ సంగతలా ఉంచితే, దసరా, దీపావళి సీజన్ లో ప్రకటనలు భారీగా ఇస్తారు కాబట్టి మార్కెటింగ్ పరంగా లాభదాయకమని ఇప్పటికే టీవీ పరిశ్రమ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇలాంటి బ్లాక్ బస్టర్ సినిమాను ఇంత త్వరగా ప్రసారం చేయటం కూడా తెలుగులో ఒక ప్రయోగమనే చెప్పాలి.