• Home »
  • Other Channels »
  • సభాకార్యక్రమాల ప్రత్యక్షప్రసారానికి మహారాష్ట ప్రభుత్వ చానల్స్

సభాకార్యక్రమాల ప్రత్యక్షప్రసారానికి మహారాష్ట ప్రభుత్వ చానల్స్

పార్లమెంట్ కార్యకలాపాల ప్రసారానికి లోక్ సభ, రాజ్య సభ చానల్స్ ఉన్నట్టే తమ శాసనసభ, శాసనమండలి ప్రత్యక్షప్రసారాలకోసం రెండు సొంత చానల్స్ నడపాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇప్పటివరకూ స్థానికి దూరదర్శన్ చానల్ లో పరిమితంగా ప్రత్యక్షప్రసారం జరుగుతోంది. ఇకమీదట రెండు చానల్స్ లో సభాకార్యకలాపాలు ప్రసారమవుతాయి.

ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో ఈ మేరకు ఒక వార్త ప్రచురితమైంది. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన చానల్స్ 2016 లో కార్యకలాపాలు ప్రారంభిస్తాయి. వచ్చే ఏడాది బడ్జెట్ సమావేశాల ప్రత్యక్ష ప్రసారంతో వీటి ఆవిష్కరణ జరుగుతుంది. వందకోట్ల రూపాయల బడ్జెట్ అంచనాలతో ఈ చానల్స్ ఏర్పాటు  చేపట్టినట్టు మహారాష్ట్ర  ప్రభుత్వ ప్రతినిధి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాలు చట్టసభల కార్యకలాపాలను ప్రత్యక్షప్రసారం చేయటానికి వీలుకల్పిస్తున్నప్పటికీ, సొంతగా చానల్స్ నడపటం మాత్రం మహారాష్ట్రలోనే మొట్టమొదటిసారిగా జరుగుతోంది.

సచివాలయం ఆవరణలోనే స్టుడియో నిర్మాణానికి కూడా స్థలాన్ని గుర్తించారు. శాసనసభ ప్రారంభానికి ముందే పరిమిత సమయం ప్రసారమయ్యేలా కొన్ని కార్యక్రమాలు నిర్మించాలని కూడా నిర్ణయించారు. త్వరలో ఇందుకు అవసరమైన పరికరాల కొనుగోలు ప్రారంభిస్తారు. లైసెన్సింగ్, బాండ్ విడ్త్, టెలిపోర్ట్, లైవ్ లింక్, ఆన్ లైన్ ఎడిటింగ్ సహా వ్యవహారాలన్నీ చూడటానికి బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ ( బెసిల్) ను మహారాష్ట్ర ప్రభుత్వం కన్సల్టెంట్ గా నియమించుకుంది.

శాసనసభ్యులకు, విధానపరిషత్ సభ్యులకు టాబ్లెట్స్ ఇవ్వటం ద్వారా ప్రతిరోజూ ఎజెండా, ఆరోజు వచ్చే ప్రశ్నలు, ఇతర నోటీసులు అందేలా చూడాలని కూడా మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అదే విధంగా, ప్రశ్నోత్తరాల సమయం కోసం  సభ్యులు పంపదలచుకున్న ప్రశ్నలు కూడా ఆన్ లైన్ లో పంపేందుకు, వాటికి ఎక్నాలెడ్జ్ మెంట్ కూడా ఆన్ లైన్ లోనే ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనివలన సభ్యు;లు తమ ప్రశ్న పంపటానికి విధాన సభ దాకా రావాల్సిన అవసరం ఉండదు.