• Home »
  • National Channels »
  • ‘ఎపిక్’ చానల్ కోసం టీవీ యాంకర్ అవతారమెత్తిన మహేశ్ భట్

‘ఎపిక్’ చానల్ కోసం టీవీ యాంకర్ అవతారమెత్తిన మహేశ్ భట్

టీవీ రంగం ఎదుగుదలలో రెండు దశాబ్దాల అనుబంధం పెనవేసుకున్న సుప్రసిద్ధ సినీ దర్శకుడు మహేశ్ భట్ ఇప్పుడు ఒక టీవీ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించబోతున్నాడు. వినోదరంగంలో టీవీ అద్భుతమైన పురోగతిని ప్రదర్శిస్తున్నదని చెబుతున్న మహేశ్ భట్ ఎపిక్ చానల్ కోసం ఖ్వాబోం కా సఫర్ అనే సరికొత్త కార్యక్రమానికి యాంకరింగ్ చేస్తున్నాడు.

బాలీవుడ్ స్టుడియోల చరిత్రను వివరిస్తూ, ఆ స్టుడియోలలో షూటింగ్ జరుపుకున్న చిత్రాలను ప్రస్తావిస్తూ మహేశ్ భట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాడు. అక్టోబర్ లో ప్రసారం ప్రారంభం కాబోతున్న ఈ కార్యక్రమంలో తన ముందున్నవారిగురించి మాట్లాడటం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నానంటున్నారు. ఆనాటి కలలబేహారులు ఆ కలల్ని సాకారం చేసుకోవటానికి పడిన తపనను, వినోదరంగపు తొలినాళ్లను గుర్తుచేసుకోవటం ఆనందంగా ఉందంటున్నారు.

రాజ్ కమల్ స్టుడియోస్, ఫిల్మిస్తాన్, ఆర్కే స్టుడియోస్, ఫిల్మాలయ స్టుడియోస్ లాంటి అనేక స్టుడియోల చరిత్ర ఈ ధారావాహికలో ఉంటుంది. ఆ స్టుడియోల రూపకర్తలగురించి చెబుతూ ఈనాటి పరిశ్రమ ఎదుగుదలకు వాళ్ళు భుజాలమీద ఎలా మోశారో భట్ తన కార్యక్రమంలో వివరిస్తారు. ఈ కార్యక్రమం విజయవంతమైతే రెండో సీజన్ కూడా ఉండవచ్చునంటున్నారు.

1995 లో టీవీ మాధ్యమంలో ప్రవేశించిన మహేశ్ భట్ ఎ మౌత్ ఫుల్ ఆఫ్ స్కై, స్వాభిమాన్ అనే రెండు సిరీస్ తోబాటు 1977 లో మరో టీవీ సిరీస్ ” కభీ కభీ ” కి దర్శకత్వం నిర్వహించారు. మానవ హక్కుల ఉల్లంఘనమీద 2001లో సహారా టీవీ నిర్మించిన డాక్యుడ్రామా సిరీస్ ’ హకీకత్ ’ కు కూడా యాంకర్ గా వ్యవహరించారు. ఇటీవలి దాకా సోనీలో ప్రసారమైన దిల్ హీ బాతేం దిల్ హీ జానే కార్యక్రమంలోనూ ఆయన పాలుపంచుకోగా ప్రస్తుతం కలర్స్ లో ప్రసారమవుతున్న ఉడాన్ అనే సామాజిక కార్యక్రమానికి ఆయనే నిర్మాత.