• Home »
  • Cable »
  • ఫాస్ట్ వే మీద సిబిఐ విచారణకు మాల్వా కేబుల్ ఆపరేటర్ల డిమాండ్

ఫాస్ట్ వే మీద సిబిఐ విచారణకు మాల్వా కేబుల్ ఆపరేటర్ల డిమాండ్

పంజాబ్ లో కేబుల్ మార్కెట్ మీద గుత్తాధిపత్యం సాధించేందుకు అక్కడి కేబుల్ ఆపరేటర్లను వేధిస్తున్నట్టు ఆరోపణలు ఎదుర్కుంటున్న కార్పొరేట్ ఎమ్మెస్వో ఫాస్ట్ వే ఇప్పుడు చిక్కుల్లో పడింది. నిజానికి ఫాస్ట్ వే మొదలైనప్పటినుంచీ అనేకమార్లు న్యాయవ్యవస్థ దృష్టిలో పడుతూనే వచ్చింది. ఇప్పుడు పంజాబ్ లోని మాల్వా ప్రాంత ఆపరేటర్లు పంజాబ్, హర్యానా హైకోర్టును ఆశ్రయించగా, ఫాస్ట్ వే మీద సిబి ఐ విచారణ ఎందుకు జరపకూడదో చెప్పాలంటూ ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సుఖ్ బీర్ బాదల్ కు, పంజాబ్ డిజిపి కి, హోంశాఖ కార్యదర్శికి, ఫాస్ట్ వే ట్రాన్స్ మిషన్ ఎండి కి నోటీసులు జారీచేసింది.

ఫాస్ట్ వే అనైతిక పద్ధతుల ద్వారా వేలాది మంది కేబుల్ ఆపరేటర్లమీద వేధింపులకు పాల్పడుతోందని, మార్కెట్ నుంచి తరిమేసేందుకు ప్రయత్నిస్తోందని ఆపరేటర్లు ఆరోపిస్తున్నారు. చిన్న చిన్న పట్టణాలలో, గ్రామాలలో కేబుల్ వ్యాపారం నడుపుకునే ఆపరేటర్లను వేధించటం మీదఅ సిబి ఐ విచారణ జరిపించాలంటూ హైకోర్టునాశ్రయించేదాకా వచ్చింది.

బఠిండా జిల్లాలోని తల్వాండి సబూ కి చెందిన రజ్వీందర్ సింగ్, మాల్వా ప్రాంతానికి చెందిన మరో పాతికమంది చిన్న ఆపరేటర్లు దాఖలు చేసిన పిటిషన్ మీద జస్టిస్ గుప్తా మొత్తం 11 మంది ప్రతివాదులకు నోటీసులు జారీచేశారు. మాల్వా ప్రాంతం అంటే పంజాబ్ లోని దాదాపు 10 జిల్లాలు ఉంటాయి. బాదల్ ఈ కంపెనీని నడుపుతూ తన మనిషి అయిన గురుదీప్ సింగ్ ద్వారా అరాచకాలకు పాల్పడుతూ పంజాబ్ లో 95% కేబుల్ వ్యాపారాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నాడని పిటిషనర్లు వాదించారు. ఇందుకోసం పోలీసు యంత్రాంగాన్ని కూడా దుర్వినియీగం చేస్తున్నారని ఆరోపించారు.

ఇలా చేయటం ఫాస్ట్ వే కి ఇది మొదటి సారి కాదంటూ ట్రిబ్యూన్ పత్రిక ప్రచురించిన ఒక కథనాన్ని కూడా పిటిషనర్లు హైకోర్టు ముందుంచారు. నిజానికి బఠిండా నుంచి బాదల్ ఎన్నికను సవాలు చేస్తూ ఒక అభ్యర్థి పిటిషన్ దాఖలు చేస్తూ పిటిసి న్యూస్మ్ ఫాస్ట్ వే కేబుల్ ద్వారా ఎన్నికలప్రచారం జరుపుకున్న తీరును కోర్టు దృష్టికి తీసుకురాగా, సమయం మించిపోయిందన్న కారణంగా ఆ పిటిషన్ తిరస్కారానికి గురైంది.

సరిగ్గా 2012 ఎన్నికకు ముందు కూడా హైకోర్టు పంజాబ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేస్తూ సుఖ్ బీర్ 95% కేబుల్ వ్యాపారాన్ని చేజిక్కించుకోవటం మీద వచ్చిన ఆరోపణలకు స్పందించాలని ఆదేశించింది. ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడటంలో నిజానిజాల నిగ్గుతేల్చాలని సూచించింది. నిజానికి నిరుడు టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్ ) జరిపిన ఒక ఓపెన్ హౌస్ మీటింగ్ సందర్భంగా ఆపరేటర్లు ఫాస్ట్ వే అరాచకాలను అడ్డుకునేదాకా సమావేశం జరగనివ్వబోమంటూ ఆపరేటర్లు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగటం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది.

అయినప్పటికీ వేధింపులు కొనసాగటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆపరేటర్లు టెలికామ్ డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ అప్పిల్లేట్ ట్రైబ్యునల్ (టిడిశాట్) ను ఆశ్రయించాల్సి వచ్చింది. ప్రభుత్వం తప్పనిసరి డిజిటైజేషన్ అమలు ప్రారంభించిన తరువాత ఇలాంటి బెదరింపులు, అనైతిక కార్యకలాపాలు మితిమీరిపోయాయి. ఈ ప్రక్రియలో కేబుల్ ఆపరేటర్లమీద ఎమ్మెస్వోకు పూర్తి అధికారాలు కట్టబెట్టటంతో ఆపరేటర్ల పరిస్థితి మరింతగా దిగజారింది. ఎమ్మెస్వోలకు నియంత్రణాధికారాలు సంక్రమించాయి.

ఈ కేసు విచారణకు చేపట్టిన ట్రైబ్యునల్ యథాతథ స్థితి కొనసాగాలని ఆదేశించింది. దీంతో అప్పటినుంచి వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారంటూ పిటిషనర్లు హైకోర్టుకు విన్నవించారు. ఇప్పుడు పిటిషన్ ను ఉపసంహరించుకోవాల్సిందిగా వత్తిడి చేస్తూ బెదరింపులకు పాల్పడుతున్నారని కూడా మాల్వా ప్రాంతపు కేబుల్ ఆపరేటర్ల పోరాట సమితి ఆరోపిస్తోంది. లొంగకపోవటంతో సమితి సభ్యులమీద ఉపముఖ్యమంత్రి తప్పుడు కేసులు బనాయిస్తున్నారన్నారు. సమితి సభ్యుల ప్రాణరక్షణకు సైతం తగిన ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు.

అమృత్ సర్ లో ఈ ఏడాది మార్చి 28 న జరిగిన టిడిశాట్ సెమినార్ సందర్భంగా టిడిశాట్ న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు చూస్తుండగానే అమృత్ సర్ కు చెందిన ఒక కేబుల్ ఆపరేటర్ విషం తాగి ఆత్మహత్య చేసుకోవటం తెలిసిందే. ఫాస్ట్ వే మీద ఫిర్యాదు చేసిన ఆపరేటర్లలో అతడూ ఒకరు. పైగా, సరబ్జిత్ సింగ్ మీద చార్జ్ షీట్ దాఖలైన సిటీ కేబుల్ సెక్స్ కుంభకోణంలో ప్రాసిక్యూషన్ సాక్షి కూడా. ఆ తరువాత అతడి కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లించి ఫాస్ట్ వే అధికారులు కేసును మూయించేశారు. ఆ కుటుంబం ఆ తరువాత నగరం వదిలి వెళ్ళిపోయింది.