• Home »
  • Cable »
  • విదేశీ పెట్టుబడుల పరిమితి పెంపు వార్తలకు స్పందించిన స్టాక్ మార్కెట్

విదేశీ పెట్టుబడుల పరిమితి పెంపు వార్తలకు స్పందించిన స్టాక్ మార్కెట్

కేబుల్, డిటిహెచ్ సంస్థలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 100 శాతానికి పెంచ వచ్చునన్న వార్తలకు స్టాక్ మార్కెట్ స్పందించింది. ట్రాయ్ చర్చాపత్రం విడుదలచేసి వివిధ వర్గాల అభిప్రాయాలు సేకరించిన మీదట ప్రభుత్వానికి సిఫార్సులు పంపిస్తూ డిటిహెచ్, ఇంటర్నెట్ టీవీ, హిట్స్, టెలిపోర్ట్స్ లో పెట్టుబడులకు పరిమితి పెంచాలని సూచించింది. టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్ ) ఈ మేరకు చేసిన సిఫార్సుకు ప్రభుత్వం ఆమోదముద్ర పడ వచ్చునని ఊహాగానాలు రావటంతో దాని ప్రభావం స్టాక్ మార్కెట్ల మీద కనబడింది.

ప్రస్తుతం డిటిహెచ్, కేబుల్ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితి 74 శాతం ఉండగా దీన్ని 100 శాతానికి పెంచవలసిందిగా ట్రాయ్ సిఫార్సు చేసింది. అదే విధంగా న్యూస్ చానల్స్ లో ఇప్పుడు 26 శాతం మాత్రమే అనుమతిస్తుండగా దీన్ని 49 శాతానికి పెంచాలని కూడా ట్రాయ్ సూచించింది.

ఈ విషయమై ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. అయితే, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోతూ విదేశీపెట్టుబడుల పరిమితిని అర్థరహితం చేస్తున్నదంటూ ఇటీవల సమాచార, ప్రసార శాఖామంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యల ఆధారంగా మార్కెట్లో ఈ మేరకు ఊహాగానాలు మొదలయ్యాయి.

. అయితే, దీనికి ప్రభుత్వ ఆమోదముద్ర పడకపోయినా పిటిఐ వార్తాసంస్థ విడుదలచేసిన ఒక వార్తతో ఒక్కసారిగా మీడియా సంస్థల వాటా ధరల్లో మార్పు కనిపించింది. డిష్ టీవీ షేర్ ధర పెరగటం, మార్కెట్ సలహాదారులు కూడా ఆ పేరు సూచించటం గమనార్హం. అదే విధంగా డెన్ నెట్ వర్క్, సిటీ కేబుల్, హాత్ వే, ఆర్టెల్ కమ్యూనికేషన్స్ కూడా అదే ధోరణి ప్రదర్శించాయి.