• Home »
  • Digitisation »
  • 3వ దశలో 100% సెట్ టాప్ బాక్స్ లు: కేంద్రప్రభుత్వం చెబుతున్న కాకిలెక్కలు

3వ దశలో 100% సెట్ టాప్ బాక్స్ లు: కేంద్రప్రభుత్వం చెబుతున్న కాకిలెక్కలు

కేబుల్ టీవీ డిజిటైజేషన్ లో మొదటి రెండు దశలతో పోల్చినప్పుడు మూడో దశ అత్యంత వివాదాస్పదంగా తయారైంది. కోర్టుకేసులతో కునారిల్లుతూ అంతంతమాత్రంగానే సాగి ఆగిపోయింది. అయినా సరే ప్రభుత్వం మాత్రం నిస్సిగ్గుగా దాదాపు 100 శాతం పూర్తయినట్టు చెబుతోంది. నాలుగు కోట్ల సెట్ టాప్ బాక్సులు పెట్టినట్టి చెబుతూ అంతటితోనే నూరు శాతం పూర్తయినట్టు చెప్పటం చూసి ఎమ్మెస్వోలు నవ్వుకుంటున్నారు.

డిజిటైజేషన్ అమలు మీద ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ మే 30 న జరిపిన 15వ సమావేశంలో సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రెటరీ ఆర్. జయ స్వయంగా ఈ లెక్కలు వెల్లడించారు. అంతకుముందు ఫిబ్రవరి 16న జరిగిన సమావేశంలో 90 శాతం పూర్తయిందనీ చెప్పుకున్నారు.  ఈ పెరుగుదలకు కారణం ఎమ్మెస్వోలు జనవరి1 తరువాత పెట్టిన బాక్సులు 69 లక్షల నుంచి కోటీ 24 లక్షల బాక్సులకు పెరగటమేనని వివరణ ఇచ్చింది.  అయితే, కోర్టు కేసులవలన బాక్సులు పెట్టటం నిదానంగా సాగుతున్నట్టు మాత్రం ఒప్పుకున్నారు. అదే సమయంలో ఈ లెక్కల్లో కొన్ని నాలుగోదశ ప్రాంతల్లోని బాక్సులూ కలిసి ఉండవచ్చునని స్వయంగా ఒప్పుకున్నారు.

ఇంతకీ ప్రభుత్వం వాదనలో నిజమెంత ఉందన్నది అసలు ప్రశ్న. ఆ లెక్కలు రాబట్టటానికి దారి తీసిన పరిస్థితులేమిటో చూస్తే అర్థమవుతుంది. ఒక పట్టణంలో 50 వేల కనెక్షన్లుంటే ఎమ్మెస్వో వెల్లడించే సంఖ్య 40 వేలు దాటదు. ప్రభుత్వం ఈ సంఖ్యనే లెక్కలోకి తీసుకుంది. అదే సమయంలో డిజిటైజేషన్ లో ఎమ్మెస్వో చుట్టుపక్కల మరో 10 వేల బాక్సులు పెడితే వాటిని కూడా లెక్కలోకి తీసుకుంది. అంటే నాలుగోదశ ప్రాంతాల్లో పెట్టిన బాక్సులను సైతం మూడో దశ ఖాతాలో వేసింది. డిటిహెచ్ ఆపరేటర్ల పరిధిలో ఉన్నవారు కొంతకాలంగా స్తబ్దుగా ఉంది మళ్ళీ వాడకం మొదలుపెట్టినా వారు కూడా కొత్త చందాదారుల జాబితాలోకి వచ్చారు.

నాలుగోదశను ప్రోత్సహించటానికి ప్రభుత్వం ఈ లెక్కలు చెబుతున్నదే తప్ప క్షేత్ర స్థాయిలో పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. నాలుగోదశ గడువును యథాతథంగా అమలు చేయటానికి ప్రభుత్వం తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలో భాగమే తప్ప ఇది వాస్తవ పరిస్థితి కానేకాదు. బ్రాడ్ కాస్టర్లకూ, ఎమ్మెస్వోలకూ మధ్యన, ఎమ్మెస్వోలకూ, కేబుల్ ఆపరేటర్లకూ మధ్య న జరగాల్సిన ఒప్పందాల విషయంలోనే స్పష్టత సాధించలేకపోయిన ట్రాయ్ సారధ్యంలో గడువులోగా డిజిటైజేషన్ సాధ్యమని ప్రభుత్వం ఎలా నమ్మగలదు?