• Home »
  • Cable/DTH/HITS »
  • చానల్స్ కోసం ఉపగ్రహాల సామర్థ్యంపై బెసిల్ ద్వారా సమాచార సేకరణ

చానల్స్ కోసం ఉపగ్రహాల సామర్థ్యంపై బెసిల్ ద్వారా సమాచార సేకరణ

దేశంలో దాదాపు 900 శాటిలైట్ చానల్స్  ఉండగా సగానికి పైగా చానల్స్ విదేశీ ఉపగ్రహాలు వాడుకోవటం మీద సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ దృష్టి సారించింది. గతంలో తగినంత సామర్థ్యం లేకపోవటం వలన విదేశీ ఉపగ్రహాల వాడకానికి అనుమతించినా ఇప్పుడు ఆ అవసరం లేదు గనుక మళ్ళీ భారత ఉపగ్రహాలకు రప్పించటానికి అనుసరించాల్సిన వ్యూహం మీద తర్జనభర్జన పడుతోంది. అందుకే ఇప్పుడున్న ఉపగ్రహాల సామర్థ్యం, అందులో అందుబాటులో ఉన్న ట్రాన్స్ పాండర్లు, ఫ్రీక్వెన్సీ తదితర సమాచారంతోబాటు విదేశీ ఉపగ్రహాలు వాడుతున్న చానల్స్ వివరాలు, ఆ విదేశీ ఉపగ్రహాల జీవిత గడువు తెలియజేయాలని బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ( బెసిల్) ను కోరింది.

ఈ సమాచారం అత్యవసరమని కూదా సమాచార ప్రసార మంత్రిత్వశా రాసిన లేకలో స్పష్టం చేసింది. డిటిహెచ్, హిట్స్ వేదికలతోబాటుగా బ్రాడ్ కాస్టర్ల సంఘాలైన ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫౌండేషన్, న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్ లను కూడా సంప్రదించి సమగ్రమైన సమాచారం అందించాలని కోరింది. ఈ సమాచారం ఎందుకోసమనే విషయాన్ని మంత్రిత్వశాఖ నిర్దిష్టంగా చెప్పాకపోయినప్పటికీ, వీలైనంత త్వరగా స్వదేశీ ఉపగ్రహాలకు రప్పించటమే ధ్యేయంగా కనబడుతోంది. ఈ మధ్యనే ఇస్రో సమాచారం ఆధారంగా పార్లమెంటులో మంత్రి సైతం స్వదేశీ ఉపగ్రహాల వాడకం మీద పట్టుబట్టటం తెలిసిందే.

బ్రాడ్ కాస్టర్లకు ప్రభుత్వం వినతి

ఒకప్పుడు స్వదేశీ ఉపగ్రహాలు వాడుకుంటూనే చానల్ లైసెన్స్ జారీలో ప్రాధాన్యముంటుందని చెప్పిన ప్రభుత్వం ఆ తరువాత కాలంలో చేతులెత్తేసింది. పెద్ద ఎత్తున ప్రారంభమవుతున్న చానల్స్ సంఖ్యకు దీటుగా ఉపగ్రహాలలో చోటు లేకపోవటంతో విదేశీ ఉపగ్రహాలమీద ఆధారపడటం పెరుగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు  ఇన్ శాట్/ జి శాట్ స్వదేశీ ఉపగ్రహాలలో తగినంత చోటు ఉండటంతో విదేశీ ఉపగ్రహాల ఒప్పందాలు ముగిసిన చానల్ యజమానులు మళ్ళీ స్వదేశీ ఉపగ్రహాలకు తిరిగి రావాలని ప్రభుత్వం కోరుతోంది.

సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ లోక్ సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ మేరకు వెల్లడించారు. భారత ఉపగ్రహాల్లో ఖాళీ ఉన్నప్పుడు తిరిగి భారత ఉపగ్రహాలే వాడుకోవాలన్న నిబంధన ఉన్నదని గుర్తుచేశారు. త్వరలో విదేశీ ట్రాన్స్ పాండర్లతో ఒప్పందాలు పూర్తయ్యేవాళ్ళంతా తిరిగి మన ఇన్ శాట్, జిశాట్ ఉపగ్రహాల ట్రాన్స్ పాండర్లనే వాడుకోవటానికి సిద్ధం కావాలని సూచించారు.

దేశంలో మొత్తం 877 శాటిలైట్ చానల్స్ ఉండగా వాటిలో 586 చానల్స్ విదేశీ ట్రాన్స్ పాండర్లమీదనే ఆధారపడుతూ ఉండటం గమనార్హం. అంటే భారత ఉపగ్రహాలను వాడుకుంటున్న చానల్స్ సంఖ్య 300 లోపే ఉంది. సిబాండ్ కొరత దాదాపుగా తీరినట్టేనని భావిస్తుండగా కె యు బాండ్ కి మాత్రంఇంకా కొరత బాగానే ఉంది. అందుకే సి బాండ్ విషయంలో మళ్ళీ భారత ఉపగ్రహాల వినియోగానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

బ్రాడ్ కాస్టింగ్ సేవలందించే  చానల్స్ కు 1997 నాటి శాట్ కామ్ పాలసీకి అనుగుణంగా ట్రాన్స్ పాండర్ సామర్థ్యం కేటాయిస్తారు. వీటన్నిటికీ సి బాండ్ లో ఇస్తుండగా డిటిహెచ్ కి మాత్రం కెయు బాండ్ లో ఫ్రీక్వెన్సీ అవసరమవుతుంది. ప్రస్తుతం డిటిహెచ్ సంస్థలు మొత్తం 104 ట్రాన్స్ పాండర్లు వాడుకుంటున్నాయి. ఇంకో 68 అందుబాటులోకి వస్తే తప్ప వాటి సమస్య తీరదు. హెచ్ డి చానల్స్ సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో ఈ  సమస్య వస్తోంది.