• Home »
  • Circulars »
  • ఎంఐబి హెచ్చరిక: ప్రసార నియమాలు ఉల్లంఘించిన సివిఆర్ ఇంగ్లిష్ క్షమాపణ

ఎంఐబి హెచ్చరిక: ప్రసార నియమాలు ఉల్లంఘించిన సివిఆర్ ఇంగ్లిష్ క్షమాపణ

కలవరపరచే దృశ్యాలను, శవాలను చూపించాల్సి వస్తే అస్పష్టంగా మాత్రమే చూపాలన్న కార్యక్రమ నియమావళిని పాటించని సివిఆర్ ఇంగ్లిష్ న్యూస్ చానల్ ను సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ హెచ్చరించింది. ఇకముందు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికతో కూడిన సలహా ఇస్తూ తీర్పు వెలువరించింది. నిరుడు సివిఆర్ ఇంగ్లిష్ లో ప్రసారమైన రెండు వార్తలను ఎలక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ సెంటర్ మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకురాగా పూర్తి విచారణ జరిపిన మీదట ఈ ఏడాది మే 25న తీర్పు వెలువరించింది. పూర్తి పాఠం మంత్రిత్వశాఖ తన వెబ్ సైట్ లో ఉంచింది.

చిత్తూరు జిల్లా శేషాచలం అడవులలో ఎర్ర చందనం స్మగ్లర్ల కాల్చివేతమీద 2015 ఏప్రిల్ 28న సివిఆర్ ఇంగ్లిష్ న్యూస్ చానల్ ఒక వార్తా కథనాన్ని ప్రసారం చేసింది. అందులో స్మగ్లర్ల మృతదేహాలను చూపించేటప్పుడు కనీస జాగ్రత్తలు పాటించలేదు. అలాంటి ఘోరమైన దృశ్యాలను కనిపించీ కనిపించకుండా మాత్రమే చూపాలన్న నిబంధనను సివిఆర్ ఇంగ్లిష్ విస్మరించింది.

అదే విధంగా 2015 మే21న హైదరాబాద్-ముంబై జాతీయ రహదారి మీద జరిగిన ఒక రోడ్డు ప్రమాదవార్తలో కూడా భీతావహంగా కనిపించే మృతదేహాలను చాలా దగ్గరగా చూపించి నిబంధనలు ఉల్లంఘించినట్టు మంత్రిత్వశాఖ దృష్టికి వచ్చింది. ఇవి రెండూ కేబుల్ టెలివిజన్ నెట్ వర్క్ రూల్స్ కు విరుద్ధమని, చానల్ లైసెన్స్ జారీకి పెట్టే షరతులను ఉల్లంఘించటమేననినిర్థారించిన మంత్రిత్వశాఖ 2015 ఆగస్టు 28న  చానల్ కు షో కాజ్ నోటీస్ పంపింది.

సెప్టెంబర్ 9న చానల్ సమాధానమిస్తూ అసలు ఆ రోజు ఆ సమయానికి అలాంటివార్తనే ప్రసారం చేయలేదని పేర్కొంది. అయితే, మంత్రిత్వశాఖవారి ఎలక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ సెంటర్ దగ్గర ఉన్న వీడియో మాత్రం అదే రోజు ప్రసారమైనట్టు చూపుతోంది. కాకపోతే సమయం విషయంలోనే కొద్దిపాటి తేడా ఉన్నట్టు గుర్తించారు. ఆ సమయం తేడాని ఆధారంగా చేసుకొని సివిఆర్ ఇంగ్లిష్ బుకాయించే ప్రయత్నం చేసింది. ఇక రెండో వార్త విషయంలో మాత్రం పొరపాటు జరిగిందని, ఇకముందు అలా జరగకుండా చూస్తామని హామీ ఇచ్చింది.

సహజన్యాయం అందాలన్న దృష్టితో మంత్రిత్వశాఖ ఈ విషయాన్ని ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ ముందుంచింది.

ఈ ఏడాది జనవరి 21 న సమావేశమైన కమిటీ ఈ రెండు వార్తలను, షో కాజ్ నోటీస్ కు సివిఆర్ ఇంగ్లిష్ ఇచ్చిన సమాధానాన్ని పరిశీలించింది. కమిటీ ఆదేశాలమేరకు చానల్ ప్రతినిధి కమిటీ ఎదుట హాజరైనపుడు మరోమారు వీడియో రికార్డింగ్ చూశారు. కార్యక్రమ నియమావళిని ఎందుకు ఉల్లంఘించారని ప్రశ్నించినప్పుడు ఆ ప్రతినిధి మళ్ళీ లిఖితపూర్వక సమాధానాన్నే దాదాపుగా వల్లెవేశారు. మంత్రిత్వశాఖ పేర్కొన్న సమయానికి ఆ వార్త ప్రసారం  చేయలేదన్న సాంకేతికాంశం మీదనే దృష్టిపెట్టారు.

ఇక రెండో వార్త మాత్రం తమ పొరపాటు వల్లనే జరిగిందని దృశ్యాలను అస్పష్టంగా చూపి ఉండాల్సిందని ఒప్పుకున్నారు. పొరపాటుకు క్షమాపణలు చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటివి మళ్ళీ  జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకుంటామని, కార్యక్రమ నియమావళికి కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు.

చానల్ తప్పు చేసిందని, చానల్ ప్రతినిధి ఆ తప్పును ఒప్పుకుంటూ క్షమాపణ కూడా చెప్పారని, ఈ పరిస్థితుల్లో ఇక ముందు జాగ్రత్తగా ఉండాలంటూ ఒక సలహాపూర్వకమైన లేఖ పంపాలని ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ సిఫార్సు చేసింది. ఇదే విషయం పేర్కొంటూ ఇక ముందు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ  సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఆ ఉత్తర్వులు జారీచేసింది.

మంత్రిత్వశాఖ డైరెక్టర్ నీతి సర్కార్ సంతకంతో వెలువడిన ఈ అడ్వైజరీ చివరి పేరాలో మాత్రం ఇకమీదట ఉల్లంఘనలకు పాల్పడితే  రష్యా టీవీ చానల్ మీద చర్యలు తీసుకుంటామంటూ పేర్కొనటం విశేషం. ఇంతకు ముందు రష్యాటీవీకి ఇచ్చిన అడ్వైజరీని యథాతథంగా కాపీ, పేస్ట్ చేసే క్రమంలో సివిఆర్ ఇంగ్లిష్ అని మార్చటం మరచిపోవటం  వల్లనే ఇలా జరిగిందని సులభంగానే అర్థమవుతుంది.