• Home »
  • Content Code »
  • 3 న్యూస్ చానల్స్ కు ప్రభుత్వం నోటీసులు: ఖండించిన బ్రాడ్ కాస్ట్ ఎడిటర్ల సంఘం

3 న్యూస్ చానల్స్ కు ప్రభుత్వం నోటీసులు: ఖండించిన బ్రాడ్ కాస్ట్ ఎడిటర్ల సంఘం

యాకూబ్ మెమెన్ ఉరిశిక్షకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులను న్యాయవ్యవస్థను ధిక్కరించినట్టు పేర్కొంటూ సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఆజ్ తక్, ఎబిపి న్యూస్, ఎన్డీటీవీ 24X7 న్యూస్ చానల్స్ కు షోకాజ్ నోటీసులిచ్చింది. 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీనిమీద బ్రాడ్ కాస్ట్ ఎడిటర్ల సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వ వైఖరిని ఖండించింది. ఈ విషయంలో కార్యవర్గం సమావేశమై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని నిర్ణయించింది.

ముంబై పేలుళ్ళకేసులో  శిక్షపడిన యాకూబ్ మెమన్ ఉరితీత మీద ఆ చానల్స్ చేసిన ప్రసరాలు రాష్ట్రపతిని, న్యాయవ్యవస్థను తప్పుపట్టేలా ఉన్నాయన్నది ప్రభుత్వం వాదన. అయితే, తీవ్రవాదులమీద దాడులు జరుగుతున్న సమయంలో ప్రసారాలమీద మాత్రమే ప్రభుత్వ ఆంక్షలున్నాయని, అప్పుడు మాత్రమే ప్రభుత్వాధికారుల పత్రికాసమావేశాల వివరాలకు పరిమితం కావాలని ప్రభుత్వం కేబుల్ టీవీ చట్ట సవరణలో పేర్కొన్నదని బ్రాడ్ కాస్ట్ ఎడిటర్లు వాదిస్తున్నారు.

ప్రసారాంశాల విషయానికొస్తే, ఎబిపి న్యూస్, ఆజ్ తక్ అండర్ వరల్డ్ డాన్ చోటా షకీల్ ఫోన్ ఇంటర్వ్యూ ప్రసారం చేశాయి. యాకూబ్ మెమెన్ కు అన్యాయం జరిగిందని ఆ సందర్భంగా చోటా షకీల్ వ్యాఖ్యానించాడు. పైగా, ఈ ఉరిని చట్టబద్ధమైన హత్యగా అభివర్ణించాడు. మరోవైపు  ఎన్డీటీవీ యాకూబ్ మెమెన్ న్యాయవాది ఇంటర్వ్యూను ప్రసారం చేసింది. ఎన్ని దేశాల్లో ఉరి శిక్షను రద్దుచేశారో ఆయన ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. సమాచార, ప్రసార శాఖ ఆజ్ తక్ వారి ఫోన్ ఇన్ సంభాషణకు సంబంధిమ్చిన వీడియో క్లిప్పింగులను ఎలక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ కమిటీ నుంచి సేకరించి దాని ఆధారంగా నోటీసులిచ్చింది.

Aaaj Tak gets MIB Notice

ఆ సంభాషణ ఇలా సాగింది:

చోటా షకీల్ : భారతదేశంలో ఎలా న్యాయం జరుగుతుందో ప్రపంచమంతా చూసింది. ఒకే రోజు నాలుగు క్షమాభిక్ష పిటిషన్లు తిరస్కారానికి గురయ్యాయి. చట్టం ఇలాగే ఉంటుందా? భారతదేశంలో న్యాయవిభాగం అధికారులకు వాళ్ళేం చేశారో తెలియదు. ఒక అమాయకుణ్ణి ఉరితీశారు వాళ్ళు.

 

యాంకర్ : సుప్రీంకోర్టు న్యాయం చేసింది కదా..

చోటా షకీల్ : మాకు కోర్టు మీద నమ్మకం లేదు. ఇది న్యాయం కాదు, ఇది ప్రతీకారం. అతడిమీద పగ తీర్చుకున్నారు.

హింసాత్మక ఘటనలకు దారితీసే విధంగా ఉన్నా, దేశాధ్యక్షుడి నిజాయితీని, న్యాయవ్యవస్థ నిజాయితీని శంకించేలా ఉన్నా అలాంటివి ప్రసారం చేసినప్పుడు చర్యలు తీసుకొవచ్చునని చట్టం నిర్దేశిస్తున్నందువలనే నోటీసులు పంపినట్టు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ అధికారి ఒకరు వెల్లడించారు,