• Home »
  • Cable »
  • హైకోర్టుల స్టే ఉత్తర్వులతో ఎంఐబి కలవరం: ప్రత్యామ్నాయ మార్గాలమీద మల్లగుల్లాలు

హైకోర్టుల స్టే ఉత్తర్వులతో ఎంఐబి కలవరం: ప్రత్యామ్నాయ మార్గాలమీద మల్లగుల్లాలు

మూడోదశ గడువు పొడిగించే ప్రసక్తే లేదంటూ భీష్మించుకు కూర్చున్న సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు హైకోర్టుల స్టే ఉత్తర్వులు కలవరం కలిగిస్తున్నాయి. తెలంగాణ తో ప్రారంభమైన స్టే ఉత్తర్వుల పరంపర వరుసగా సగానికి పైగా రాష్ట్రాలలోనూ కొనసాగటంతో ఏం చేయాలో ప్రభుత్వానికి పాలుపోవటం లేదు. ప్రాథమికంగా ప్రభుత్వం తప్పిదం కనబడటమే స్టే ఉత్తర్వులు రావటానికి కారణం కావటంతో స్టే ఎత్తివేయించటం ఏమంత సులభం కాదని అధికారులకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది.

తెలంగాణ మొదలుకొని ఆంధ్రప్రదేశ్, అస్సాం, మహారాష్ట్ర, ఒడిశా, సిక్కిం రాష్టాలలో మూడో దశ డిజిటైజేషన్ మీద స్టే ఇస్తూ అనలాగ్ సిగ్నల్స్ ప్రసారానికి అక్కడి హైకోర్టులు అనుమతించాయి. మరోవైపు డిజిటల్ ఎమ్మెస్వోగా లైసెన్స్ ఇవ్వకుండా అనలాగ్ ఆపటం కుదరదంటూ తమిళనాడు ప్రభుత్వం కూడా స్టే తెచ్చుకుంది. ఇంకోవైపు కర్నాటక సహా అనేకరాష్ట్రాలు పిటిషన్లు దాఖలు చేసి ఉత్తర్వులకోసం ఎదురుచూస్తున్నాయి.

న్యాయనిపుణులతో వరుసగా చర్చలు జరుపుతూ ప్రస్తుత పరిస్థితి నుంచి బైటపడేందుకు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ అధికారులు ఈ వారం రోజులుగా మల్లగుల్లాలు పడుతూనే ఉన్నారు. ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేయాలన్న విషయంలో మాత్రం న్యాయనిపుణులందరూ ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. విధానపరమైన నిర్ణయాలమీద స్టే ఇచ్చేటప్పుడు హైకోర్టులు ఆచి తూచి వ్యవహరించాలన్న విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావాలన్నది ఈ న్యాయనిపుణుల సలహా.

ముందుగా ఒక హైకోర్టు తీర్పు మీద సుప్రీంకోర్టులో అప్పీలు చేసి, సంబంధిత కేసులన్నిటినీ ఆయా రాష్ట్రాల హైకోర్టులనుంచి బదలాయింపు కోరాలన్నది సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ వ్యూహం. అయితే, ఇది రిట్ పిటిషన్ రూపంలో ఉంటుందా, లేక అప్పీల్ రూపంలో ఉంటుందా అనేది ఇంకా తేలలేదు. అదే జరిగితే, ఎమ్మెస్వోలు సుప్రీంకోర్టులో న్యాయవాదులను నియమించుకోవటం భారమవుతుంది. నిజానికి ఈ కేసుల వలన డిటిహెచ్ ఆపరేటర్లు, హిత్స్ ఆపరేటర్లు లబ్ధిపొందే అవకాశాలే మెండుగా ఉన్నాయి. అంతిమంగా కేబుల్ ఆపరేటర్ నష్టపోయే ప్రమాదం ఉంది.
డిసెంబర్ 30 న జరిగిన 13వ టాస్క్ ఫోర్స్ సమావేశంలో చెప్పినట్టుగా ఇప్పటివరకు 76 శాతం సెట్ టాప్ బాక్సులు పెట్టారనటానికి తగిన ఆధారాలు మంత్రిత్వశాఖ దగ్గర ఉన్నట్టు చెబుతున్నారు. ఆ విధంగా సెట్ టాప్ బాక్సుల కొరత ఉందన్న వాదనను అడ్డుకోవటానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మరోవైపు ఒక రాష్ట హైకోర్టు స్టే ఇస్తే ఆ ఉత్తర్వులు దేశమంతటికీ వర్తిస్తాయన్న బొంబాయ్ హైకోర్టు వ్యాఖ్యానం చెల్లుబాటవుతుందా లేదా అన్న అంశం మీద కూడా విస్తృతంగా చర్చ జరుగుతోంది.

ప్రభుత్వం ఏ మాత్రం వెనకడుగేసినా ఆ ప్రభావం కేవలం మూడు, నాలుగు దశలమీదనే కాకుండా డిజిటైజేషన్ పూర్తికాని మొదటి దశల్లోని కొన్ని ప్రాంతాలమీద కూడా ఉంటుందని పే చానల్ యాజమాన్యాలు, పంపిణీ సంస్థలు వాదిస్తున్నాయి. అందుకే వేరు వేరు హైకోర్టుల ఆదేశాలు కాకుండా దేశమంతటికె వర్తించేలా సుప్రీంకోర్టునుంచి ఆదేశాలు తీసుకోవటమే మంచిదని బ్రాడ్ కాస్టర్లు, పంపిణీ సంస్థలు ప్రభుత్వానికి సూచిస్తున్నాయి. ఆలస్యమయ్యే కొద్దీ తమ రాబడి పెరుగుదలలోనూ ఆలస్యమవుతుందనేది వారి తాపత్రయం.

ఎమ్మెస్వోలు, కేబుల్ ఆపరేటర్లు మాత్రం స్వదేశీ సెట్ టాప్ బాక్సుల తయారీలో అసాధారణమైన జాప్యం జరుగుతోందని, విపరీతమైన కొరత ఉందని వాదిస్తున్నారు. ఒకరిద్దరు తప్ప ఎవరూ గణనీయమైన సంఖ్యలో సెట్ టాప్ బాక్సులు తయారుచేయటం లేదంటున్నారు. స్టే ఉత్తర్వుల తరువాత మళ్ళీ అనలాగ్ కి వెళ్ళటం సాంకేతికంగా కష్టమేమీ కాకపోయినా లెక్కలపరంగా చాలా ఇబ్బందులున్నాయని మరికొందరు బ్రాడ్ కాస్టర్లు వాదిస్తున్నారు. అయితే, ఇప్పటికే సెట్ టాప్ బాక్స్ కొనుకున్న చందాదారులు మాత్రం తొందరపడ్డామా అనుకునే ప్రమాదం ఉంది.