• Home »
  • Cable »
  • మరో 22 డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్సులు: పొన్నూరు షిర్డీ సాయి నెట్ వర్క్ కు శాశ్వత రిజిస్ట్రేషన్

మరో 22 డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్సులు: పొన్నూరు షిర్డీ సాయి నెట్ వర్క్ కు శాశ్వత రిజిస్ట్రేషన్

మూడో దశ డిజిటైజేషన్ గడువు దగ్గర పడుతున్న కొద్దీ సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్సుల జారీ వేగవంతం చేసింది. ఈ నెలలో రెండు విడతలుగా జాబితాలు విడుదల చేసింది. ఇప్పుడు తాజాగా 22 మందికి లైసెన్సులు ఇవ్వగా అందులో 20 సంస్థలకు తాత్కాలిక లైసెన్సులు, రెండు సంస్థలకు పదేళ్ళపాటు శాశ్వత లైసెన్స్ ఉన్నాయి.

దీంతో ఈ నెల 20 వ తేదీనాటికి తాత్కాలిక లైసెన్సుల సంఖ్య 146 కు, శాశ్వత లైసెన్సుల సంఖ్య 220 కి పెరిగినట్టయింది. అందులో C32 కేబుల్ నెట్, రీచ్ నెట్ కేబుల్ సర్వీసెస్, క్లాసిక్ డిజిటల్ నెట్ వర్క్ సంస్థలకు భారతదేశమంతటా కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు అనుమతి లభించింది.

శాశ్వత లైసెన్స్ లభించిన రెండు సంస్థలలో ఒకటి ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన షిర్డీ సాయి డిజిటల్ నెట్ వర్క్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది మూడు, నాలుగు దశలలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో కార్యకలాపాలు నడుపుకోవటానికి పదేళ్ళపాటు శాశ్వత లైసెన్స్ పొందింది. ఈ మధ్య కాలంలో తాత్కాలిక లైసెన్సులు ఎక్కువగా జారీ అవుతుండగా అన్ని లాంఛనాలు పూర్తి చేసుకొని షిర్డీ సాయి డిజిటల్ శాశ్వత ప్రాతిపదికల లైసెన్స్ సంపాదించుకుంది.

తాత్కాలిక లైసెన్సులు పొందిన 20 సంస్థలలో తిరుపతికి చెందిన కృష్ణతేజ డిజిటల్ నెట్ వర్క్ మున్సిపల్ పట్టణాలన్నిటికీ రిజిస్టర్ చేసుకోగా అంధ్రప్రదేశ్ లో కర్నూలు, అనంతపురం, తెలంగాణలో మహబూబ్ నగర్, కర్బాటకలో బళ్ళారి, రాయచూర్ జిల్లాలకోసం రామ్ నెట్ కామ్ లైసెన్స్ పొందింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ, చత్తీస్ గఢ్, ఆంధ్రప్రదేశ్ కోసం శ్రీ రాజేశ్వరీ కమ్యూనికేషన్స్ సంస్థకు లైసెన్స్ లభించింది.

తమిళనాడుకు చెందిన సన్ కేబుల్ విజన్ , రాగుల్ శాట్ విజన్, దినేశ్ కేబుల్ నెట్ వర్క్స్, వజ్రాస్ డిజిటల్ నెట్ కామ్, శ్రీ వైష్ణవి కమ్యూనికేషన్స్ కూడా తాత్కాలిక లైసెన్సులు పొందిన సంస్థల్లో ఉన్నాయి. ఇలా ఉండగా, కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవుల్లో దక్షిణ అండమాన్, ఉత్తర మధ్య అండమాన్ జిల్లాలకోసం అండమాన్ కేబుల్ నెట్ వర్క్ కి కూడా డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్స్ వచ్చింది.