• Home »
  • Cable »
  • మూడో దశ అగ్రిమెంట్లకు స్పందించిన ఎమ్మెస్వోలు కేవలం 62 మంది మాత్రమే

మూడో దశ అగ్రిమెంట్లకు స్పందించిన ఎమ్మెస్వోలు కేవలం 62 మంది మాత్రమే

మూడోదశ డిజిటైజేషన్ గడువు పూర్తికావటానికి 75 రోజులే మిగిలి ఉండగా పే చానల్స్ తో అగ్రిమెంట్లు చేసుకోవాల్సిన ఎమ్మెస్వోలు మాత్రం పెద్దగా స్పందించటం లేదు. ఇప్పటివరకు కేవలం 62 మంది ఎమ్మెస్వోలు మాత్రమే బ్రాడ్ కాస్టర్లను సంప్రదించినట్టు టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కి పే చానల్స్ అందజేసిన నివేదికలో వెల్లడించాయి. ఈ నత్తనడక పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఎమ్మెస్వోలను వెంటనే ఒప్పందాలు చేసుకోవాలంటూ సర్క్యులర్ పంపింది.

“బ్రాడ్ కాస్టర్లు ట్రాయ్ కి సమర్పించే నివేదికలను బట్టి మూడో దశ డిజిటైజేషన్ జరుగుతున్న ప్రాంతాలలో కేవలం 62 మంది ఎమ్మెస్వోలు మాత్రమే ఇంటర్ కనెక్ట్ అగ్రిమెంట్లకు ముందుకు వచ్చినట్టు తేలింది. ఒకవేళ బ్రాడ్ కాస్టర్లనుంచి స్పందనలేని పక్షంలో ఆ విషయాన్ని వెంటనే ట్రాయ్ కి తెలియజేస్తూ, మంత్రిత్వశాఖకు కూడా కాపీ పంపండి” అంటూ సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఎమ్మెస్వోలకు పంపిన సర్క్యులర్ లో పేర్కొంది. ఇప్పటికే బ్రాడ్ కాస్టర్లకు రాసినా వారి నుంచి పరిమిత గడువులోగా సమాధానం రాలేదనే ఎమ్మెస్వోలు ఆ వివరాలతో వెంటనే ట్రాయ్ ని సంప్రదించాలని సూచించింది.

అయితే, కొంత మంది అటు బ్రాడ్ కాస్టర్లను సంప్రదించకపోవటం, ఇటు ట్రాయ్ కి కూడా తెలియజేయకుండా ఉండిపోతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఏప్రిల్ 6 న ఎమ్మెస్వోలందరికీ మెయిల్స్ పంపినా అందరూ స్పందించకపోవటం పట్ల ఆవేదన వ్యక్తం చేసింది. ట్రాయ్ ని జోక్యం చేసుకోవలసిందిగా కూడా కోరటాన్ని గుర్తు చేసింది. ఎమ్మెస్వోల నుంచి అభ్యర్థన వచ్చిన 60 రోజుల్లోగా ఒప్పందం చేసుకోవాలని బ్రాడ్ కాస్టర్లను కూడా ఆదేశించింది.

అంతకుముందు స్టార్ ఇండియా, మల్టీ స్క్రీన్ మీడియా, టీవీ 18 తమకు 55 అభ్యర్థనలు వచ్చినట్టు ట్రాయ్ కి తెలియజేశాయి. ఇద్దరు ఎమ్మెస్వోలతో వాణిజ్య ఒప్పందాలు పూర్తి కాగా, 11 ఎమ్మెస్వోల దరఖాస్తులు తుది దశ చర్చల్లో ఉన్నాయని పేర్కొన్నాయి. మూడో దశ డిజిటైజేషన్ లో మొత్తం 3 కోట్ల 88 లక్షల ఇళ్లు ఉండగా, డిసెంబర్ 31 గడువును ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. పొడిగించవచ్చుననే అభిప్రాయం ఏదైనా ఉంటే వెంటనే దాన్ని మనసులలోనుంచి తొలగించాలని కూడా మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రెటరీ జయ విస్పష్టంగా ప్రకటించారు.