• Home »
  • Content Code »
  • ’మూడేళ్లలో 20 చానల్స్ ప్రసారాల మీద నిషేధం’

’మూడేళ్లలో 20 చానల్స్ ప్రసారాల మీద నిషేధం’

ప్రసారాంశాలలో నిబంధనలు ఉల్లంఘించినందుకు గడిచిన మూడేళ్ల కాలంలో 20 చానల్స్ ప్రసారాల మీద నిషేధం విధించినట్టు సమాచార, ప్రసార శాఖా మంత్రి అరుణ్ జైట్లీ ఈ రోజు లోక్ సభకు తెలియజేశారు. ఉల్లంఘన తీవ్రతను బట్టి నిషేధకాలం 1 రోజు మొదలుకొని 30 రోజుల వరకూ ఉందని చెప్పారు. మరో 66 చానల్స్ కు హెచ్చరికలు జారీచేస్తూ ఆ విషయాన్ని టీవీ తెర మీద స్క్రోల్ రూపంలో నడపాల్సిందిగా ఆదేశించామన్నారు.

టీవీ చానల్స్ ప్రసారాంశాలను ముందుగా సెన్సార్ చేసే అవకాశం లేనందున ఉల్లంఘన గురించి ప్రభుత్వం దృష్టికి వచ్చినప్పుడు మాత్రమే చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.  గత మూడేళ్ళలో నిషేధం ఉత్తర్వులు అందుకున్న చానల్స్ లో ఎస్ ఎస్ టీవీ ( వారం ), ఎంటర్ 10 (1 రోజు), జింగ్ ( 1 రోజు), మనోరంజన్ టీవీ (1 రోజు ), ఎస్ ఎస్ టీవీ ( మరో విడత 1 రోజు, ఎఫ్ టీవీ (10 రోజులు ), మహువా (1 రోజు ),  ఎ ఎక్స్ ఎన్ ( 1రోజు ), మూవీస్ ఓకే (1 రోజు), కామెడీ సెంట్రల్ (10 రోజులు), జూమ్ టీవీ (1 రోజు ), ఎబిఎన్ ఆంధ్ర జ్యోతి (వారం), మనోరంజన్ టీవీ ( రెండో సారి- వారం ), బిగ్ సిబిఎస్ లైవ్ ( 1 రోజు ), యుటివి బిందాస్ (3 రోజులు ), డబ్ల్యుబి (1 రోజు), ఎన్టీవీ (వారం ), సాత్లాన్ న్యూస్ ( 30 రోజులు ), జైహింద్ (1 రోజు ), అల్ జజీరా(5 రోజులు) ఉన్నాయి.

నిషేధపు ఉత్తర్వులందుకున్న చానల్స్ లో ఉన్న  రెండు తెలుగు చానల్స్  వారం పాటు ప్రసారాలు నిలిపివేయాల్సి ఉండగా రెండూ, కోర్టునుంచి స్టే తెచ్చుకొని ఆ ఉత్తర్వులను అమలు చేయలేదు. అందువలన ప్రసారాలు ఆగిపోలేదు. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన ఇది మల్లెల వేళయనీ… అనే కార్యక్రమం మీద, ఎన్టీవీ ప్రసారం చేసిన సినీ కలర్స్ అనే కార్యక్రమం మీద కేంద్ర ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకుంది.