• Home »
  • Cable TV »
  • డిజిటల్ ఎమ్మెస్వోల కలవరం : సోషల్ మీడియాలో కేబుల్ వార్

డిజిటల్ ఎమ్మెస్వోల కలవరం : సోషల్ మీడియాలో కేబుల్ వార్

డిజిటైజేషన్ పూర్తి కాగానే అంతా సద్దుమణుగుతుందని, ఎమ్మెస్వోల కనెక్షన్లు స్థిరంగా ఉంటాయని, అప్పుడు ఎలాంటి వివాదాలకూ తావుండదని భావించారు. కానీ క్షేత్ర స్థాయిలో అలా లేదు. చిన్న ఎమ్మెస్వోలు ఇప్పటికీ సరైన ప్రత్యామ్నాయం కోసం చూస్తూనే ఉన్నారు. అవసరమైతే కొత్త ఎమ్మెస్వో పరిధిలోకి వెళ్ళటానికి సిద్ధమవుతున్నారు. దీంతో వాళ్ళను కాపాడుకోవటమెలా అన్నది ప్రధానంగా స్థానిక డిజిటల్ ఎమ్మెస్వోలకు సమస్యగా తయారైంది.

ఇప్పటికీ వివాదాలు సాగుతూనే ఉన్నాయనటానికి తాజా ఉదాహరణ NXT Digital మీద సోషల్ మీడియాలో కొంతమంది ముసుగు వీరులు చేస్తున్న పోరాటం. అయితే, ఇన్నాళ్లూ అందరు కార్పొరేట్ ఎమ్మెస్వోల మీద చేసిన ప్రచారానికి భిన్నంగా ఇప్పుడు హిట్స్ మీదనే సాగటానికి కారణమేంటో ఆలోచిస్తే క్షేత్రస్థాయి పరిస్థితి అర్థమవుతుంది.

ఈ ప్రచారానికి కారణాలను విశ్లేషించాలంటే సమస్య మూలాల్లోకి వెళ్ళాలి. డిజిటైజేషన్ లో ఎమ్మెస్వోకు కచ్చితంగా డిజిటలెమ్మెస్వో లైసెన్స్ ఉండాలి. కచ్చితంగా డిజిటల్ హెడ్ ఎండ్ ఉండాలి. అన్ని లక్షణాలతో అర్హమైన హెడ్ ఎండ్ పెట్టుకోవటానికి అయ్యే ఖర్చు కనీసం ఐదు కోట్లు ఉంటుంది. అందువలన ఇప్పటిదాకా కార్పొరేట్ ఎమ్మెస్వోలను బూచిగా చూపించిన కొంతమంది డబ్బున్న స్వతంత్ర ఎమ్మెస్వోలు డిజిటల్ ఎమ్మెస్వోలుగా మిగిలారు. చిన్న ఎమ్మెస్వోలను తమ పరిధిలోకి తెచ్చుకోవటం కోసం నానా తంటాలు పడ్డారు. వీళ్ళు కూడా ఒకవైపు కార్పొరేట్ ఎమ్మెస్వోల బాటలో నడుస్తూనే చిన్న ఎమ్మెస్వోల దగ్గర మాత్రం మనమంతా ఒకటే అనే భావం కల్పించటానికి నానా యాతనలూ పడుతున్నారు.

ఇప్పుడు చిన్న ఎమ్మెస్వోలకు సమస్యలు మొదలయ్యాయి. ఎన్ క్రిప్ట్ చేసిన సిగ్నల్స్ మాత్రమే ఇవ్వాలి కాబట్టి ఆ స్వతంత్ర ఎమ్మెస్వో నుంచి బ్రాడ్ బాండ్ సాయంతో ఫీడ్ తెచ్చుకొని పంపిణీ చేయాలి. అంటే, ఇన్నాళ్ళూ ఒక ఎమ్మెస్వోగా గౌరవం పొందిన వ్యక్తి ఇప్పుడొక ఆపరేటర్ గా మాత్రమే మిగిలిపోతున్నాడు. పైగా, ఎమ్మెస్వోగా చెప్పుకుంటూ తనకొక స్థానం ఉందని రుజువు చేసుకునేలా తనదైన లోకల్ చానల్ ఒకటి ప్రసారం చేసుకునేవాడు.. కానీ ఇప్పుడు అది సాధ్యం కావటం లేదు. ఎమ్మెస్వోనుంచి వచ్చిన ఫీడ్ కు కలుపుకుందామంటే సిగ్నల్ ఎన్ క్రిప్ట్ అయి ఉండాలి కాబట్టి అలా కలుపుకోకూడదని నిబంధనలు చెబుతున్నాయి.

దీనికి పరిష్కారమేమిటంటే ఫీడ్ ని ఎమ్మెస్వో దగ్గరికి పంపితే అక్కడ ఎన్ క్రిప్ట్ అయిన తరువాత అన్ని చానల్స్ తో కలిపి మళ్ళీ తన దగ్గరికి వస్తుందని చెబుతున్నారు. అంటే ఫీడ్ తెచ్చుకోవటానికి తోడు పంపటానికి ఇదొక అదనపు ఖర్చు. ఆ డిజిటల్ హెడ్ ఎండ్ పెట్టుకున్న ఎమ్మెస్వోకు కనీసం మూడు, నాలుగు సొంత చానల్స్ ఉంటాయి. ఇంకా ఎవరైనా చానల్ పెట్టుకొని పంపిణీ చేయమంటే వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని వాటినీ ఇస్తుంటాడు. అలాంటప్పుడు తన పరిధిలో ఉండే చిన్న ఎమ్మెస్వోల చానల్స్ ఎన్నని ఇవ్వగలడు. మొత్తం 12 చానల్స్ అనేది ఇప్పుడున్న పరిమితి. అందువలన ఆరేడుగురు చిన్న ఎమ్మెస్వోలు మించితే వాళ్ళ కేబుల్ చానల్స్ ఇవ్వటం కష్టం. ఇదీ స్థానికంగా ఉండే డిజిటల్ ఎమ్మెస్వోలకు ఇప్పుడొచ్చిన పెద్ద చిక్కు.

NXT Digital దగ్గర ఈ సమస్యకు పరిష్కారం ఉండటమే వివాదాలకూ, దుష్ప్రచారాలకూ కారణమవుతోంది. చిన్న ఎమ్మెస్వోలు కూడా ఎమ్మెస్వో లైసెన్స్ తీసుకొని సగటున ఐదారు లక్షలనుంచి పదిహేను లక్షల దాకా పెట్టుబడి పెట్టుకోగలిగితే స్వతంత్రంగా ఉండేందుకు NXT Digital వెసులుబాటు కల్పిస్తోంది. ఎమ్మెస్వో లైసెన్స్ లేకపోయినా తనదైన హెడ్ ఎండ్ పెట్టుకోవటానికీ వీలుంది. తన పరిధిలో ఉండే ప్రేక్షకులు ఎన్ని చానల్స్ కోరుకుంటున్నారనే అంశంఆధారంగా తన పెట్టుబడి స్థాయికి అనుగుణంగా హెడ్ ఎండ్ ధరను నిర్ణయించు కోవచ్చు. తన సొంత చానల్స్ నడుపుకోవచ్చు. నెల నెలా బ్రాడ్ బాండ్ ఖర్చులు భరించాల్సిన అవసరం లేదు. ఇన్ని సౌకర్యాలున్నప్పుడు సహజంగానే చిన్న చిన్న ఎమ్మెస్వోలు NXT Digital వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో స్థానిక డిజిటల్ ఎమ్మెస్వోలు చిన్న ఎమ్మెస్వోలను తమ పరిధిలో నిలబెట్టుకోలేకపోతున్నారు. అలా చేజారిపోతూ ఉంటే ఏం చేయాలో దిక్కు తోచటం లేదు.

నిజానికి సమస్య అంతా టెక్నాలజీతోనే వచ్చి పడింది. మామూలు డిజిటల్ హెడ్ ఎండ్ కి కొన్ని పరిమితులున్నాయి. NXT Digital ఆ పరిమితులకు మించిన పరిజ్ఞానంతో వచ్చింది. చిన్న ఎమ్మెస్వోలకు అది వరం లాంటిది. వాళ్ళ స్వతంత్రతకు అది పెద్ద పీట వేస్తుంది. క్షేత్ర స్థాయిలో ఉండే అవసరాలకు తగిన పాకేజీలున్నాయి. చాలా మందికి ఈ వాస్తవాలు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి. దీన్ని అడ్డుకోవటానికి బలమైన కారణాలేవీ లేవు. కానీ తమ వ్యాపారం దెబ్బతింటున్న దన్న భయంతో కొంతమంది స్థానిక డిజిటల్ ఎమ్మెస్వోలు సోషల్ మీడియాలో ఒక ప్రచారం మొదలుపెట్టారు. ఏదో విధంగా NXT Digital వైపు వెళ్ళకుండా చూడాలన్నదే వాళ్ళ ప్రయత్నం. సోషల్ మీడియాలో పెట్టిన ఈ పోస్ట్ చూడండి:

NXT digital ఈ సం. మార్చినుండి నెలసరి ఛార్జ్ భారీగా పెంచే ఆలోచనలో కంపెనీ…? మాతృసంస్థ హిందూజా గ్రూపు నుండి ఫండ్స్ నిలిపివేత, ఇప్పటికే వందలకోట్ల నష్టాల్లో Nxt digital..ఫేజ్ 1, 2లలో నెలసరి అన్ని ఛానెల్స్ సుమారు 100 ప్యాకేజీ లో ఆపరేటర్ల కు లభిస్తుండగా, అధికాస్త 120-230 కు చేరి ఫేజ్ 3, 4 కూడా అదేవిధంగా పెరిగి 100, 110 వరకు చేరుకుంటుందని భావిస్తున్నారు, అదే జరిగితే ఆపరేటర్ల పరిస్థితి గందరగోళం గా మరబోతుంది.. Nxt digital officials కూడా ఏమి చెప్పలేని స్థితి, ఎందుకంటే గతంలో కూడా పలుమార్లు నెలసరి మొత్తాన్ని ముందస్తు సమాచారం లేకుండానే పెంచిన కంపనీ యాజమాన్యం….

ఒకవైపు ఊహాగానమని పరోక్షంగా ఒప్పుకుంటూనే ఒక అనుమానం, భయం కలగాలనే ఉద్దేశంతో ఈ తరహా ప్రచారం చేస్తున్నారని అర్థమవుతూనే ఉంది. అయితే, ఊగిసలాటలో ఉండి ఇంకా ఎటు వెళ్లాలో ఆలోచిస్తున్నవాళ్ళలో ఒక అనుమానం పుట్టించటమే ఈ ప్రచారంలో ఉన్న అసలు లక్ష్యం. అందుకే NXT Digital ప్రతినిధులు కూడా వెంటనే ఈ ప్రచారాన్ని ఖండిస్తూ ఒక విన్నపాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవాల్సి వచ్చింది.

ప్రియమైన కేబుల్ ఆపరేటర్ మిత్రులకు NXT Digital విన్నపం.

కేబుల్ వ్యాపారంలో పోటీపడలేని కొందరు డిజిటల్ ఎమ్మెస్వోలు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మకండి. చార్జీలు భారీగా పెంచే ఆలోచనలో NXT Digital యాజమాన్యం ఉన్నట్టు తప్పుడు మెసేజ్ లతో ప్రచారం చేయటం ద్వారా అనుమానాలు సృష్టించి, మీరు వెళ్ళకుండా నానాతంటాలు పడుతున్న వారి కుటిల ప్రయత్నాలను గ్రహించండి. వాళ్ళ డిజిటల్ హెడ్ ఎండ్ మీద ఆధారపడి ఫైబర్ ద్వారా ఫీడ్ తీసుకునే చిన్న ఎమ్మెస్వోలు ఇప్పుడు క్రమంగా NXT Digital వైపు వెళుతుండటంతో వణికిపోతున్నవాళ్ళే ఇలాంటి ప్రచారం మొదలు పెట్టినట్టు మీరు ఈ పాటికే గ్రహించి ఉంటారు. ఇలాంటి అబద్ధపు ప్రచారాలు నమ్మకండి. ఈ ప్రచారం మొదలుపెట్టిన వాళ్లమీద చట్టపర్యమైన చర్యలు తీసుకోబోతున్నాం.

మీ

శ్రీకుమార్, రీజినల్ హెడ్ , NXT Digital

తాము ఎవరో చెప్పుకోవటానికి కూడా ధైర్యం చాలని కొందరు ముసుగు వీరులు చేస్తున్న ప్రచారాన్ని NXT Digital సమర్థంగా తిప్పికొట్టింది. ఈ ప్రచారంలో పసలేదంటూ హెచ్చరిక స్వరంతో పెట్టిన ఈ పోస్ట్ కూడా కేబుల్ పరిశ్రమలోని వారందరికీ చేరింది. ఈ రెండూ గమనించినప్పుడు అర్థమయ్యేదేంటంటే మొదటి మేసేజ్ కి కర్త ఎవరో తెలియదు. కేవలం ఒక ఆకాశరామన్న సందేశం అది. పైగా ప్రశ్నార్థకాలతో కొన్ని అనుమానాలను ప్రచారంలో పెట్టటానికి సోషల్ మీడియాను వాడుకుంటున్నట్టు కనబడుతోంది. అదే సమయంలో రెండో మెసేజ్ ఎవరు పంపారో స్పష్టంగా ఉంది. ఇందులో ఎలాంటి అనుమానాలకూ తావులేకుందా సందేశం నిర్దిష్టంగా ఉంది. దీన్ని బట్టి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఏర్పడింది. నిజానికి ఇకముందు NXT Digitalమీద ఏదైనా ప్రతికూల వార్త సోషల్ మీడియాలో వచ్చినా నమ్మలేని పరిస్థితిని మొదటి సందేశం కలిగించినట్టయింది.

ఏమైనప్పటికీ కేబుల్ పరిశ్రమలో ఒక రకమైన వార్ ఇప్పటికీ కొనసాగుతున్నదనే విషయం తేటతెల్లమైంది. ఒకవైపు సెట్ టాప్ బాక్సులు మార్చుకునే వెసులుబాటు కలిగించేందుకు ట్రాయ్ ఎంతగానీ ప్రయత్నిస్తోంది. ఈ దిశలో త్వరలోనే శుభవార్త వింటారన్న సంకేతాలూ అందుతున్నాయి. అదే జరిగితే అటు చందాదారులతోబాటు ఆపరేటర్లకూ, చిన్న ఎమ్మెస్వోలకూ స్వేచ్ఛ లభిస్తుంది. గుత్తాధిపత్యాలకు బ్రేక్ పడుతుంది. ఆరోగ్యకరమైన పోటీలో చందాదారుకు మేలు జరుగుతుంది.