• Home »
  • Cable »
  • టీవీ పర్యవేక్షణ జీవోలు తప్పులతడక: పౌరసమాజాన్ని పట్టించుకోని ప్రభుత్వం

టీవీ పర్యవేక్షణ జీవోలు తప్పులతడక: పౌరసమాజాన్ని పట్టించుకోని ప్రభుత్వం

కేబుల్ టీవీ చట్టం సక్రమంగా అమలు జరిగేట్టు చూడటానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేసింది. సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి  సూచన మేరకు కమిటీలు ఏర్పాటు చేశామని చెప్పుకుంటూ అధికారులతో కమిటీలు ఏర్పాటుచేసింది. కానీ కేంద్రం చెప్పింది వేరు, ఇక్కడ అధికారులు అమలు చేస్తున్నది వేరు. పౌర సమాజం నుంచి తీసుకోవాల్సిన సభ్యుల విషయం ప్రస్తావించకుండానే ఈ కమిటీలు ఏర్పాటు చేయటం వలన కేంద్రప్రభుత్వం ఆశించిన లక్ష్యం దెబ్బతింటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మానిటరింగ్ కమిటీల నియమనిబంధనలతో నిమిత్తం లేకుండానే జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తూ ఈ నెల 21న  జీవోలు జారీచేసింది.

ఈ జీవోలలో చిత్రమేంటంటే, రాష్ట్ర స్థాయి మానిటరింగ్ కమిటీ విధులను యథాతథంగా కాపీ చేసి జిల్లా కమిటీల విధుల కింద కూడా చూపారు. అందువలన జిల్లా కమిటీల విధులలో “ జిల్లా కమిటీల పర్యవేక్షణ, క్రమం తప్పకుండా జిల్లా కమిటీలు సమావేశమయ్యేట్టు చూడటం, జిల్లా కమిటీలకు మార్గదర్శనం చేయటం, జిల్లాల నుంచి సమాచారం తెప్పించి సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు పంపటం, జాతీయ స్థాయి శాటిలైట్ చానల్స్ మీద ఫిర్యాదు చేయటం” అని జీవోలో వచ్చేసింది. నిజానికి జిల్లా కమిటీలు స్థానిక కేబుల్ చానల్స్ వ్యవహారాలు చూసుకోవాలి, ప్రాంతీయ శాటిలైట్ చానల్స్ మీద ఫిర్యాదులు వస్తే అభిప్రాయం జోడించి రాష్ట్ర కమిటీకి పంపాలి. కానీ అధికారులు గుడ్డిగా ఈ జీవో తయారుచేసి జనం మీదికి వదిలేశారు.

నిజానికి 2005 లో మొదటి సారిగా సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ  అన్ని రాష్ట్రాలకూ మానిటరింగ్ కమిటీల ఏర్పాటుమీద మార్గదర్శకాలు జారీచేసింది. వివిధ చానల్స్ లో ప్రసారమయ్యే కార్యక్రమాలను సమీక్షిస్తూ ఆ కార్యక్రమాల మీద వచ్చే ఫిర్యాదులను ప్రాథమికంగా పరిశీలిస్తూ సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖకు ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు వీలుగా ఈ మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించింది. అయితే, రాష్ట్రాలు స్పందించకపోవటంతో తిరిగి 2008 ఫిబ్రవరి 19న స్పష్టమైన  మార్గదర్శక సూత్రాలను రూపొందించి లేఖ రాసింది. రాష్ట్ర స్థాయిలోను, జిల్లా స్థాయిలోను మానిటరింగ్ కమిటీలు ఏర్పాటుచేయాలని, కేబుల్ టీవీ చట్టం సమర్థంగా అమలయ్యేటట్టు చూడాలని కోరింది.

కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం  రాష్ట్రస్థాయి మానిటరింగ్ కమిటీకి సమాచార, పౌరసంబంధాల శాఖ కార్యదర్శి చైర్మన్ గా ఉంటారు.  డిజిపి, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి,  మహిళా శిశు అభివృద్ధి శాఖ కార్యదర్శి  సభ్యులుగా ఉంటారు. మహిళల కోసం పనిచేసే రాష్ట్ర స్థాయి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఒకరిని, ఒక విద్యా రంగ నిపుణుణ్ణి, ఒక మానసిక శాస్త్రవేత్తను, ఒక సామాజిక శాస్త్రవేత్తను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సభ్యులుగా నామినేట్ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వ సమాచార శాఖ డైరెక్టర్ మెంబర్ సెక్రటరీ గా ఉంటారు.

కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం రెవెన్యూ, హోం శాఖల ప్రిన్సిపల్ కార్యదర్శులను, సమాచార- పౌరసంబంధాల శాఖ కార్యదర్శిని, కమిషనర్ ను , వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ ను, దూరదర్శన్ కేంద్రం డైరెక్టర్ ను  సభ్యులుగా నియమించింది. ప్రసారాంశాలమీద పర్యవేక్షణకు  పౌర సమాజం నుంచి నామినేట్ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను రాష్ట్రం పట్టించుకోలేదు.

అదే విధంగా జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీల మీద కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం జిల్లా కలెక్టర్    ఈ కమిటీకి చైర్మన్ గా వ్యవహరిస్తారు. ఎస్పీ, జిల్లా పౌర సంబంధాల అధికారి సభ్యులుగా ఉంటారు. జిల్లాలోని ఒక మహిళా కళాశాల ప్రిన్సిపాల్ ను,  శిశు సంక్షేమం మీద పనిచేసే ఒక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధిని,  మహిళా సంక్షేమం మీద పనిచేసే స్వచ్చంద సంస్థ ప్రతినిధిని,  ఒక విద్యారంగ నిపుణుణ్ణి, ఒక మానసిక విశ్లేషకుణ్ణి, ఒక సామాజిక శాస్త్రవేత్తను సభ్యులుగా కలెక్టర్ నామినేట్ చేస్తారు.

అయితే, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం జిల్లా కమిటీలకు కలెక్టర్ చైర్మన్ గా ఉంటారు. ఎస్పీ, వాణిజ్యపన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ లేదా ఆయన ప్రతినిధి, జిల్లా పౌర సంబంధాల అధికారి సభ్యులుగా ఉంటారు. ఇందులో కూడా పౌర సమాజం నుంచి సభ్యులుగా ఎవరికీ అవకాశం కల్పించలేదు. కేబుల్ టీవీ మీద పన్నుల వసూళ్ళు సక్రమంగా అవుతున్నాయో లేదో చూడటానికో, డిజిటైజేషన్ మీద సమాచారానికీ కమిటీలు వేసినట్టుంది తప్ప ప్రసారాల మీద పర్యవేక్షణకు వేసినట్టు లేదు.

కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలలో రాష్ట్ర, జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీల విధులు స్పష్టంగా పేర్కొంది. ప్రసారమైన కార్యక్రమాల మీద ఫిర్యాదులు స్వీకరించటం, కేబుల్ టీవీ చట్టాన్ని అమలు చేసే అధికారుల చర్యలను సమీక్షించటం, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కానీ, ప్రజల్లో ఏ వర్గాన్నయినా కించపరిచే కార్యక్రమాలు కానీ ప్రసారమయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయటం స్థానిక కేబుల్ ఆపరేటర్ ప్రసారం చేసే కార్యక్రమాలను పరిశీలిస్తూ స్థానిక వార్తల ప్రసారంలో పక్షపాత ధోరణులకు పాల్పడుతున్నట్టు అనిపిస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లటం, కేబుల్ ఆపరేటర్లు చట్టపరంగా ఇవ్వాల్సిన ఛానల్స్ తో పాటు వీలైనన్ని ఎక్కువ ఉచిత ఛానల్స్ ప్రసారం చేసేటట్లు చేయట జిల్లా కమిటీల పని.

జిల్లా స్థాయిలో ఒక ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేసి దానికి తగినంత ప్రాచుర్యం కల్పిస్తారు. రాష్ట్ర స్థాయిలో ఒక వెబ్ సైట్ కూడా ఉంటుంది. ఈ కమిటీ రెండు నెలలకోసారి సమావేశమై ఫిర్యాదులను పరిశీలిస్తుంది. స్వయంగా తమ దృష్టికి వచ్చిన లోపాలను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. ఫిర్యాదులు స్థానిక ప్రచారాల మీద వచ్చిన సందర్భంలో సంబంధిత క్లిప్సింగ్స్ ఇవ్వాల్సిందిగా ఆ ఛానల్స్ ను కోరవచ్చు. కమిటీ సభ్యులు చర్చించి నిబంధనలు ఉల్లంఘన జరిగినట్టు భావిస్తే సంబంధిత కేబుల్ టీవీకి షోకాజ్ నోటీస్ ఇస్తారు. వారి వాదన కూడా విన్న తరువాత తుదినిర్ణయాన్ని రాష్ట్రకమిటీకి తెలియజేస్తారు.

శాటిలైట్ ఛానల్స్ కు సంబంధించిన కార్యక్రమాల మీద ఫిర్యాదులు వస్తే వాటికి తమ సిఫార్సులను జోడిస్తూ రాష్ట్ర కమిటీకి పంపిస్తారు. ఉల్లంఘనలకు పాల్పడినట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తే ఉల్లంఘన తీవ్రతను బట్టి ఆ ఛానల్ కు ఒక సలహా ఇవ్వటం లేదా హెచ్చరించటం లేదా క్షమాపణ కోరుతూ నిర్దిష్టమైన రోజుల పాటు స్క్రోల్ నడపవలసిందిగా ఆదేశించటం లేదా కొంతకాలం పాటు ప్రసారాలు నిలిపివేయటం వంటి చర్యలు తీసుకోవచ్చు. అయితే జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీలు కేబుల్ టీవీ కార్యక్రమాల మీద మాత్రమే చర్యలు తీసుకోగలవు. శాటిలైట్ ఛానల్స్ విషయంలో సిఫార్సులకు మాత్రమే పరిమితం కావాలి.

ఈ కమిటీలకు నామినేట్ అయిన సభ్యుల పదవీకాలం రెండు సంవత్సరాలు ఉంటుంది. రెండో విడత నామినేట్ కావటానికి వారు అనర్హులు. ఏదైనా ఖాళీ ఏర్పడితే ఆ ఖాళీలో నామినేట్ అయిన వ్యక్తి రెండేళ్ల పాటు పదవిలో ఉంటారు. ఈ కమిటీ కనీసం ఏడాదికోసారి సమావేశం అయి రాష్ట్ర స్థాయి నివేదికను తయారుచేసి సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖకు ఏటా డిసెంబర్ 31లోగా పంపుతుంది.

జిల్లా కమిటీల ఏర్పాటును పర్యవేక్షించటం, అవి క్రమం తప్పకుండా సమావేశాలు జరుపుతున్నట్టు నిర్ధారించు కోవటం రాష్ట్ర కమిటీ విధి. జిల్లా కమిటీలు వివిధ సందర్భాల్లో తీసుకున్న నిర్ణయాలను సమీక్షించటం, అవసరమైన సూచనలు ఇవ్వటం కూడా రాష్ట్ర స్థాయి కమిటీలో ఉంటుంది. జిల్లా స్థాయి కమిటీ నుంచి వచ్చిన ఫిర్యాదులనున పరిశీలించి కేంద్ర సమాచార ప్రసారాల శాఖ కార్యదర్శికి పంపించటం రాష్ట్ర స్థాయి ఛానల్స్ మీద చర్యలు తీసుకోవటం, జాతీయ స్థాయి ఛానల్స్ మీద చర్యలకు సిఫార్సులు తీసుకోవటం రాష్ట్ర కమిటీ విధివిధానాల్లో ముఖ్యమైనది.

మానిటరింగ్ కమిటీల ఏర్పాటు మీద సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు పంపుతూనే ఉంది. 19 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రమే కమిటీలు ఏర్పాటు చేశాయి. మంత్రిత్వశాఖ ఎప్పటికప్పుడు ఆ రాష్ట్రాల జాబితాను వెబ్ సైట్ లో పెడుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ సహా చాలా రాష్ట్రాలు ఇప్పటికీ పట్టించుకోలేదు. తెలంగాణ స్పందించింది గాని కమిటీల ఏర్పాటు సమగ్రంగా లేదు.

ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోల ప్రకారమైతే కేబుల్ టీవీ ప్రసారాలమీద, శాటిలైట్ చానల్స్ మీద  ప్రభుత్వమే ఫిర్యాదు చేసే అవకాశం వస్తుంది. అధికారులే నిర్ణయం తీసుకోవటానికి వీలుంది. అందువలన ప్రభుత్వం తనకు ఇష్టం లేని చానల్స్ మీద, ఎమ్మెస్వోల మీద ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవటానికి, కక్ష సాధింపుకు మార్గం సుగమమైనట్టే. ఇది ఎమ్మెస్వోల నుంచి పన్నులు సక్రమంగా రాబట్టుకోవటానికో, డిజిటైజేషన్ ను పర్యవేక్షించటానికో పనికొచ్చే కమిటీలు మాత్రమే గాని కేంద్రప్రభుత్వం చెప్పినట్టుగా  ప్రజల ఫిర్యాదులను సమీక్షించి సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు పంపటానికి మాత్రం పనికొచ్చేవి కావు.

– తోట భావనారాయణ