• Home »
  • Cable »
  • ఎమ్మెస్వో లైసెన్స్ దరఖాస్తుల్లో సగానికి పైగా పెండింగ్

ఎమ్మెస్వో లైసెన్స్ దరఖాస్తుల్లో సగానికి పైగా పెండింగ్

డిజిటల్ ఎమ్మెస్వోగా అనుమతి కోసం 1158 మంది దరఖాస్తు చేసుకోగా అందులో ఇప్పటివరకు 553 మందికే లైసెన్సులు మంజూరు చేసినట్టు సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ లోక్ సభకు తెలియజేశారు. అంటే, 605 దరఖాస్తులు వివిధ దశలలో పెండింగ్ లో ఉన్నాయన్నారు. నిజానికి అలా ఆలస్యం జరుగుతూ ఉండటం వల్లనే తాత్కాలిక లైసెన్సుల జారీకి మంత్రిత్వశాఖ మొగ్గు చూపిందని సభకు తెలిపారు.
ఎమ్మెస్వో లైసెన్సుల జారీకి మొదట్లో హోం శాఖ క్లియరెన్స్ అవసరమని భావించటంతో క్లియరెన్స్ లో చాలా ఆలస్యం జరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో ప్రభుత్వం నిబంధనలలో మార్పులు తెస్తూ, హోం శాఖ క్లియరెన్స్ రాకముందే లైసెన్స్ కావాలంటే ఒక అఫిడవిట్ ఇచ్చి తాత్కాలిక లైసెన్స్ తీసుకునే అవకాశం కల్పించింది. ఆ తరువాత అసలు హోం శాఖ్ అక్లియరెన్స్ తో అవసరమే లేదని చెప్పినప్పటికీ ఇంకా ఆ నిబంధన ఆచరణలోకి రాలేదు.
ఇప్పటివరకు మంజూరైన 553 లైసెన్సులలో 230 శాశ్వత లైసెన్సులు కాగా, 323 తాత్కాలిక లైసెన్సులు. మరో 27 ఎమ్మెస్వో లైసెన్సులను రద్దు చేసినట్టు కూడా మంత్రి వెల్లడించారు. అలా రద్దయిన ఎమ్మెస్వోలలో సన్ గ్రూప్ కి చెందిన కల్ కేబుల్స్, డిజి కేబుల్ నెట్ వర్క్ ఇండియా లాంటి పెద్ద సంస్థలు కూడా ఉండటం విశేషం. ఏమైనప్పటికీ మూడో దశ డిజిటైజేషన్ సజావుగా సాగుతున్నదని మంత్రి చెప్పారు.