• Home »
  • Cable »
  • చానల్స్ తో ఒప్పందాల సమస్యలుంటే 24 లోగా చెప్పండి: MSOలకు ట్రాయ్ సూచన

చానల్స్ తో ఒప్పందాల సమస్యలుంటే 24 లోగా చెప్పండి: MSOలకు ట్రాయ్ సూచన

మూడో దశ డిజిటైజేషన్ కు గడువు దగ్గర పడుతున్న కొద్దీ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అన్ని సమస్యల పరిష్కారం వేగంగా జరిగిపోవాలని ప్రయత్నిస్తోంది. ఎమ్మెస్వోలకు, పే చానల్ బ్రాడ్ కాస్టర్లకూ మధ్య జరగాల్సిన ఇంటర్ కనెక్ట్ ఒప్పందాల విషయంలో గట్టిగా పట్టుబడుతోంది. పే చానల్స్ నుంచి తగిన సహకారం లేకపోయినా, ఇబ్బందులకు గురిచేస్తున్నా, ఈ నెల 24 లోగా తమకు తెలియజేయాలని కూడా ట్రాయ్ సూచించింది.

ఒక ప్రామాణిక ఒప్పందాన్ని ట్రాయ్ ఇప్పటికే తన వెబ్ సైట్ లోపెట్టింది. ఎమ్మెస్వో నుంచి దరఖాస్తు అందిన 60 రోజుల్లోగా ఒప్పందం మీద సంతకాలు జరగాలని ట్రాయ్ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. నిబంధనల చట్రం, ఇంటర్ కనెక్షన్ ఒప్పందాలు, సేవల నాణ్యత, వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం, చందా వివరాలు లాంటి అంశాలమీద ఇప్పటికే ట్రాయ్ నోటిఫికేషన్లు జారీచేసింది. లైసెన్స్ పొందిన ఎమ్మెస్వోలు డిజిటల్ ప్రసారాలు అందించటానికి బ్రాడ్ కాస్టర్లతో ఇంటర్ కనెక్ట్ ఒప్పందాలు చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రతి పే చానల్ నిర్వాహకుడూ ఎమ్మెస్వోతో కుదుర్చుకున్న ఇంటర్ కనెక్ట్ ఒప్పందం లేదా ఇరుపక్షాలకూ ఆమోదయోగ్యమైన విధంగా సిగ్నల్స్ అందజేయాలి, ఎమ్మెస్వో నుంచి అభ్యర్థన వచ్చిన 60 రోజుల్లోగా ఒప్పందానికి సిద్ధంకావాలి. ఒకవేళ బ్రాడ్ కాస్టర్ కి ఏదైనా అభ్యంతరం ఉంటే ఆ విషయాన్ని లిఖిత పూర్వకంగా ఆ గడువులోగా దరఖాస్తుదారునికి ( ఎమ్మెస్వోకి ) తెలియజేయాలి. ఒకవేళ దరఖాస్తు చేసుకున్నప్పటికీ గడువులోగా ఒప్పందం కుదరకపోయినా, బ్రాడ్ కాస్టర్ ఎలాంటి కారణమూ చెప్పకపోయినా లాంటి బ్రాడ్ కాస్టర్ మీద ట్రాయ్ చట్టం ప్రకారం చర్య తీసుకోవటానికి వీలుగా ఎమ్మెస్వోలు ఈ నెల 24 లోగా ఫిర్యాదు చేయాలని ట్రాయ్ సూచించింది.

మూడోదశ డిజిటైజేషన్ గడువు డిసెంబర్ తో ముగుస్తున్నందువల్ల ఎమ్మెస్వోలు వీలైనంత త్వరగా పే చానల్స్ సిగ్నల్స్ కోసం బ్రాడ్ కాస్టర్లకు లిఖితపూర్వకంగా దరఖాస్తు చేసుకోవాలని ట్రాయ్ సూచించింది. ఎమ్మెస్వోలకు, బ్రాడ్ కాస్టర్లకు మధ్య సకాలంలో ఒప్పందాలు జరిగేలా ప్రామాణిక ఒప్పందం నమూనా వెబ్ సైట్ లో పెట్టటం సహా అనేక చర్యలు తీసుకున్నట్టు ట్రాయ్  చెప్పుకుంది.