• Home »
  • Cable »
  • డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్స్ కు హోంశాఖ క్లియరెన్స్ నుంచి మినహాయింపు

డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్స్ కు హోంశాఖ క్లియరెన్స్ నుంచి మినహాయింపు

డిజిటల్ ఎమ్మెస్వోలుగా సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ నుంచి లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే ఎమ్మెస్వోలకు ఇక మీదట హోం మంత్రిత్వశాఖ నుంచి క్లియరెన్స్ అవసరం లేదు. ఇప్పటివరకు శాటిలైట్ చానల్స్  లైసెన్సులకు అమలు చేస్తున్న సెక్యూరిటీ క్లియరెన్స్ విధానాన్ని ఇటీవలే  కేబుల్ డిజిటైజేషన్ లో భాగంగా డిజిటల్ ఎమ్మెస్వో దరఖాస్తుదారులకూ వర్తింపజేశారు. ఆచరణలో ఎదురవుతున్న ఇబ్బందులు, హోం శాఖ పనిభారం లాంటి కారణాలతో ఇప్పుడు ఆ క్లియరెన్స్ నిబంధననే తొలగించారు.

అనలాగ్ వ్యవస్థలో  ఎమ్మెస్వోగా  ఉన్నప్పటికీ డిజిటల్ ఎమ్మెస్వోగా మళ్ళీ లైసెన్స్ పొందాల్సిందేనని ట్రాయ్ నిబంధనలు నిర్దేశించగా సమాచార, ప్రసార శాఖ దరఖాస్తులు పరిశీలించి లైసెన్సులు మంజూరు చేస్తూ వస్తోంది. అందులో భాగంగా ప్రతిదరఖాస్తునూ హోం మంత్రిత్వశాఖకు పంపటం, జాతీయ భద్రకు భంగం కలగనివ్వరన్న క్లియరెన్స్ వచ్చిన తరువాతనే లైసెన్స్ ఇవ్వటం ఒక విధానంగా పెట్టుకున్నారు. అంతకు ముందు  ఇచ్చిన తాత్కాలిక లైసెన్సుల మీద సైతం హోం శాఖ దర్యాప్తు చేసి క్లియరెన్స్ ఇవ్వాల్సి వచ్చింది.

అయితే, ఈ ప్రక్రియలో అసాధారణ జాప్యం జరుగుతున్నదన్న విమర్శలు వచ్చాయి. అటు శాటిలైట్ చానల్ దరఖాస్తు కంపెనీల డైరెక్టర్ల విషయంలోనూ ఇదే తరహా విచారణ జరగాల్సి రావటం, ఇటు ఎమ్మెస్వోలకూ అదే వర్తింపజేయటం వలన హోం మంత్రిత్వశాఖలో విపరీతమైన పనిభారం పెరిగింది. దీంతో డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్స్  రావాలంటే దాదాపు ఆరు నెలల సమయం పట్టటం మొదలైంది.

డిజిటైజేషన్ ను వేగవంతం చేయాలని ఒకవైపు ట్రాయ్, మరో వైపు సమాచార, ప్రసార శాఖ హడావిడి చేస్తున్నా, లైసెన్స్ రాకుండా రంగంలోకి  దిగలేమంటూ ఎమ్మెస్వోలు చేతులెత్తేశారు.  అంతకుముందు తాత్కాలిక లైసెన్సులు పొందిన కల్ కేబుల్ ( కళానిధి మారన్  సంస్థ ), డెన్ సైతం హోం శాఖ నిరాకరణ ఫలితంగా చిక్కుల్లో పడటంతో తాత్కాలిక లైసెన్స్ మీద అనుమానాలు కూడా మొదలయ్యాయి.

అదే సమయంలో ప్రభుత్వం కొంత మినహాయింపు ఇస్తూ హోం శాఖ క్లియరెన్స్ రావటానికి ముందే లైసెన్సులు ఇచ్చేస్తామని, అయితే హోం శాఖ అభ్యంతరం చెబితే ఉపసంహరించుకుంటామని, అందుకు ఇష్టమైనవాళ్ళు అఫిడవిట్ ఇస్తే లైసెన్స్ మంజొరు చేస్తామని ప్రకటించింది. కొంత మంది అందుకు ఒప్పుకొని తీసుకున్నారు కూడా.

అయితే, ఇప్పుడు ఎట్టకేలకు ఒక నిర్ణయం తీసుకుంది. హోం శాఖ క్లియరెన్స్ లే కపోయినా, ఎమ్మెస్వోలకు లైసెన్స్ ఇస్తామని చెబుతోంది. దీనివలన దరఖాస్తు చేసుకున్న రెండు నెలలలోపే లైసెన్స్ వస్తుంది. ఇప్పటివరకూ హోం శాఖ క్లియరెన్స్ రాలేదంటూ ఆలస్యం చేస్తూ వచ్చిన సమాచార, ప్రసార శాఖకు ఇప్పుడు ఇంకెలాంటి సాకులూ ఉండవు. దరఖాస్తు సక్రమంగా ఉంటే చాలు.