• Home »
  • Cable »
  • అనలాగ్ సిగ్నల్స్ మీద ఎమ్మెస్వోల గుర్రు

అనలాగ్ సిగ్నల్స్ మీద ఎమ్మెస్వోల గుర్రు

మూడో దశ అమలు గడువు మీద దేశవ్యాప్తంగా ఆరు హైకోర్టులు ఇచ్చిన స్టే ఉత్తర్వులమీద కొంతమంది ఎమ్మెస్వోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనలాగ్ సిగ్నల్స్ ఆపేసి డిజిటల్ సిగ్నల్స్ కు మారిపోగా కొంతమంది అనలాగ్ సిగ్నల్స్ కొనసాగించగలుగుతున్నారని, మళ్ళీ అనలాగ్ ఇవ్వటం తమకు సాధ్యం కాదని అంటున్నారు. అనలాగ్ సిగ్నల్స్ ఇస్తున్నవారిలో చాలామంది పైరసీకి పాల్పడినవారేనని కూడా ఉత్తరాంచల్, ఝార్ఖండ్ ప్రాంతంలోని ఎమ్మెస్వోలు ఆరోపిస్తున్నారు. అందుకే హైకోర్టులలో కేవియెట్ పిటిషన్లు దాఖలు చేసేందుకు సమాయత్తమవుతున్నారు.

కొంతమంది సెట్ టాప్ బాక్సుల కొరతను సాకుగా చూపి స్టే తెచ్చుకొని అనలాగ్ సిగ్నల్స్ కొనసాగించటం వలన నిజాయితీగా డిజిటైజ్ చేసినవాళ్ళు నష్టపోతున్నారని ఆ ఎమ్మెస్వోలు వాదిస్తున్నారు. అందుకే ఉత్తరాంచల్, ఝార్ఖండ్ రాష్ట్రాలలో ఆపరేటర్లు హైకోర్టుకు వెళతారని ఊహించి కేవియెట్ వేయబోతున్నట్టు ఎమ్మెస్వో అలయెన్స్ సంస్థ వెల్లడించింది. దీంతో ఎవరికి వాళ్ళే తమ తమ వ్యూహాలతో ముందుకు సాగుతుండటంతో ఈ మూడో దశ డిజిటైజేషన్ వ్యవహారం ఎలా ఒక కొలిక్కి వస్తుందో వేచి చూడాల్సిందేనని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.