• Home »
  • Cable TV »
  • అక్టోబర్ 20 నుంచి ముంబైలో 3 రోజుల బ్రాడ్ కాస్ట్ ఇండియా ప్రదర్శన

అక్టోబర్ 20 నుంచి ముంబైలో 3 రోజుల బ్రాడ్ కాస్ట్ ఇండియా ప్రదర్శన

ఏటా జరిగే ముంబై బ్రాడ్ కాస్ట్ ఇండియా ప్రదర్శన ఈ సంవత్సరం అక్టోబర్20 నుంచి 22 వరకు మూడు రోజుల పాటు జరుగుతుందని సాయికామ్ ట్రేడ్ ఫెయిర్స్ అండ్ ఎగ్జిబిషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రకటించింది. గోరెగావ్ లోని  ముంబయ్ ఎగ్జిబిషన్ సెంటర్ లో ఈ ప్రదర్శన జరుగుతుంది. ఇందులో భాగంగానే రెండు రోజులపాటు సదస్సు కూడా జరుగుతుంది. సమకాలీన ధోరణులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, కొత్త ఉత్పత్తులు, పరిశ్రమ ఎదుర్కుంటున్న సవాళ్ళు తదితర అంశాలమీద ఈ సదస్సు చర్చిస్తుంది.

వరుసగా 26 ఏళ్లుగా జరుగుతున్న ఈ ప్రదర్శనకు ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు హాజరవుతూ తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి. ఈ సారి కూడా బ్లాక్ మాజిక్ డిజైన్, పానాసోనిక్, సోనీ, ఎవిడ్, రెడ్ డిజిటల్, కానన్, డాటావీడియో, రాస్ వీడియో, ఆన్ ఎయిర్ ఏషియా, గ్రాస్ వాలీ, ప్లే బాక్స్, కెనరా లైటింగ్, హిటాచీ , మోనార్క్, ఇకెగామీ, యమహా తదితర సంస్థలు పాల్గొంటున్నాయి. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని సందర్శకులకు పరిచయం చేయబోతున్నాయి.

బ్రాడ్ కాస్ట్ ఇండియా ప్రదర్శనకు అనేక కంపెనీలు, కార్పొరేట్లు, పరిశ్రమలో పేరుమోసిన ప్రముఖులు, వృత్తినిపుణులు, సాంకేతిక నిపుణులు, అమ్మకం దారులు, కొనుగోలుదారులు హాజరవటం, వ్యాపార లావాదేవీలకు పునాది వేసుకోవటం ఆనవాయితీ. నిరుడు దాదాపు 20 వేల మంది ఈ ప్రదర్శనకు హాజరుకాగా 35 దేశాలకు చెందిన 580 మంది తమ ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు. ఈ సంవత్సరం ఈ సంఖ్య మరింత పెరగవచ్చునని నిర్వాహకులు భావిస్తున్నారు.