• Home »
  • National Channels »
  • ఎన్డీటీవీ – మెర్సిడెజ్ బెంజ్ ఉమ్మడి ప్రపంచ యాత్ర

ఎన్డీటీవీ – మెర్సిడెజ్ బెంజ్ ఉమ్మడి ప్రపంచ యాత్ర

ఎన్డీటీవీ గ్రూప్, మెర్సిడెజ్ బెంజ్  ఒక చరిత్రాత్మకమైన సాహసయాత్రకు సిద్ధమయ్యాయి. ఈ యాత్రను చిత్రీకరించి, విశేషాలను ఆ తరువాత ప్రసారం చేస్తారు. ఎన్డీటీవీ చొరవతో చేపట్టిన ఈ కార్యక్రమంలో భారతదేశంలో తయారైన మెర్సిడెజ్ బెంజ్ జిఎల్ఎ 200 సిడిఐ పాల్గొంటుంది. పూణెలోని చకాన్ యూనిట్ లో తయారయ్యే ఈ కారు జులై మధ్యలో బయటికి రాగానే యాత్ర మొదలవుతుంది.

గ్రేట్ ఓవర్ లాండ్ అడ్వెంచర్ పేరుతో చేపడుతున్న ఈ యాత్రలో దాదాపు 50 వేల కిలోమీటర్లు ప్రయాణం సాగుతుంది. మొత్తం ఆరు ఖండాలలోని 17 దేశాలగుండా ఈ కారు ప్రయాణిస్తుంది. ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఆస్ట్రేలియా ఖండాలలో ఆరునెలలపాటు ఈ యాత్ర పూర్తిచేసుకొని మళ్ళీ పూణె చేరుకుంటుంది.

భద్రతకు, విలాసానికి, సౌకర్యానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచే మెర్సిడెజ్  ప్రపంచయాత్రలో కఠోర పరీక్షలు ఎదుర్కొని నిలుస్తుందని మెర్సిడెజ్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో ఎబెరార్డ్ కెర్న్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. భారత్ లో మెర్సిడెజ్ బ్రాండ్ కు పెరుగుతున్న ఆదరణకు తగినట్టుగా దీన్ని తీర్చిదిద్దామంటున్నారు.

ఎన్డీటీవీ ఈ యాత్రను చిత్రీకరించి 26 ఎపిసోడ్స్ గా ప్రసారం చేస్తుంది. ప్రతి ఎపిసోడ లోనూ ప్రేక్షకులు తామే ప్రయాణిస్తున్న అనుభూతి పొందుతారని, స్థానికులతో కలిసి తింటూ ఆసక్తికరమైన ప్రదేశాల గుండా వెళుతూ దారిలో చిక్కుబడి పోయి సొంతగా దారికనుక్కునే ప్రయత్నాలు చేయటం ఆసక్తిని పెంచుతాయని ఎన్డీటీవీ భావిస్తోంది. ఈ బృందం ప్రయాణిస్తున్నప్పుడు ఆయా ప్రదేశాలలో జరిగే స్థానిక వేడుకలను కూడా చిత్రీకరించటం ద్వారా టూరిజం అనుభవాన్ని సైతం పంచటానికి ఎన్డీటీవీ సిద్ధమవుతోందని ఎన్డీటీవీ గ్రూప్ ఎడిటర్ సిద్ధార్థ్ వినాయక్ చెప్పారు..