• Home »
  • Broadband »
  • ‘డిజిటల్ ఇండియా’ నినాదంతో సరికొత్త ఆవిష్కరణల వేదికగా ‘కన్వర్జెన్స్ ఇండియా’

‘డిజిటల్ ఇండియా’ నినాదంతో సరికొత్త ఆవిష్కరణల వేదికగా ‘కన్వర్జెన్స్ ఇండియా’

ఢిల్లీలో ఏటా జరిగే  కన్వర్జెన్స్ ఇండియా ఎక్స్ పో ఈ సారి  డిజిటల్ ఇండియా, మేకిన్ ఇండియా నినాదాలకు ప్రతిరూపంగా నిలిచింది. టీవీ సేవలు మొదలు వై ఫై దాకా వివిధ విభాగాలలో తాజా ఆవిష్కరణలకు ఈ ప్రదర్శన ఒక వేదికైంది. దక్షిణాసియాలోనే అతిపెద్దదిగా పరిగణించే ఈ బ్రాడ్ కాస్ట్, డిజిటల్ మీడియా ఎక్స్ పో లో  29 దేశాలకు చెందిన 434 మంది ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. ఈ ఏడాది జనవరి 20-22 తేదీలలో జరిగిన  ప్రదర్శన ప్రధానంగా ఐపిటివి, బ్రాడ్ బాండ్, ఆప్టికల్ ఫైబర్ విభాగాలకు చెందిన అత్యాధునిక సాంకేతిక పురోగతికి అద్దం పట్టింది.

డిజిటల్ విప్లవం మధ్యలో ఉన్న భారతదేశంలో ప్రభుత్వం ప్రకటించిన విధానాల కారణంగా ఆర్థిక, వ్యూహాత్మక రంగాలలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వినియోగం పెరిగి ఉత్పాదకత అధికమైందని ప్రారంభోత్సవ కార్యక్రమంలో వక్తలు అభిప్రాయపడ్డారు. వందకోట్లకు పైగా మొబైల్ కనెక్షన్లున్న భారతదేశంలో మొబైల్ బ్రాడ్ బాండ్ తో డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందుతుందన్నారు. ఇంటర్నెట్ ను వాడుకోవటం ద్వారా కోట్లాది మంది భారతీయులు లబ్ధి పొందబోతున్నారని, ప్రభుత్వపు డిజిటల్ ఇండియా లక్ష్యం నెరవేరబోతున్నదని అభిప్రాయపడ్డారు.

ఈ ప్రదర్శనలో బెంగళూరుకు చెందిన లుకప్ మీడియా ప్రదర్శించిన పోర్టబుల్ సెట్ టాప్ బాక్స్ ఒక ప్రత్యేక ఆకర్షణ అయింది. లీనియర్, నాన్-లీనియర్ టీవీ, బ్రాడ్ కాస్టింగ్ సర్వీసులను ఒకే పరికరంలోకి ఎలా ఇమడ్చవచ్చునో అది చాటి చెప్పింది. నాన్ లీనియర్ టీవీ అంటే, ఒక చానల్ లో వారం క్రితం ప్రసారమైన కార్యక్రమాన్నైనా సరే మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడగలిగే అవకాశమివ్వగలిగేది. ఈ కంపెనీ వందకోట్ల రూపాయల విలువచేసే సెట్ టాప్ బాక్సుల  ఉత్పత్తికి ఆర్డర్స్ సంపాదించుకుంది. ఈ సెట్ టాప్ బాక్సులు బెంగళూరుతోబాటు హైదరాబాద్, పూణె లో కూడా అందుబాటులోకి వచ్చాయి.
ప్రభుత్వ ఆధ్వర్యంలోని  సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ ( సి-డాట్ ) రూపొందించిన విధానంలో ఆప్టికల్ ఫైబర్ కేవలం ఆవరణ వరకు వచ్చి ఆగిపోకుండా డెస్క్ వరకు వచ్చే వీలుంది. ఈ సొల్యూషన్ కి ఫైబర్ టు ద డెస్క్ అని పేరుపెట్టారు. నిజానికి ఇది జి-పాన్ టెక్నాలజీకి పొడిగింపులాంటిదే. దీనిని ఆప్టికల్ నెట్ వర్క్ టెర్మినల్ మీద డిజైన్ చేశారు. డెస్క్ మీద ఎక్కడైనా ఇది అమర్చవచ్చు. డెస్క్ దగ్గర పనిచేసుకునేవారు 1 గిగాబైట్ డేటా తీసుకోవటానికి, రూటానికి వీలుంటుంది.

నెట్ వర్కింగ్ సొల్యూషన్స్ అందించే  డిజిసోల్ అనేక రూటర్లు, స్విచ్ లు, నిఘా పరికరాలు ప్రదర్శించింది. డి లింక్ లాంటి రూటర్లతో పోటీ పడే ఈ సంస్థ రూపొందించిన ఎడిఎస్ ఎల్ రూటర్ 300 ఎంబిపిఎస్ దాకా వైర్ లెస్ లాన్ స్పీడ్ ఇవ్వగలుగుతుంది. ఇది యుఆర్ ఎల్ బ్లాకింగ్ ను, ఫైర్ వాల్ ను సపోర్ట్ చేయగలుగుతుంది. పైగా దీనికి 4జి/3జి డాంగిల్ పెట్టుకోవటానికి యుఎస్ బి 2.0 పోర్ట్ కూడా ఉంది. దీని వైర్ లెస్ రేంజ్ బూస్టర్ 300 ఎంబిపిఎస్ వైర్ లెస్ రిపీటర్ ని అందిస్తుంది. దీనివలన వైర్ లెస్ పరిధి పెరుగుతుంది.

2007 నుంచి నెట్ వర్కింగ్ వ్యాపారంలో ఉన్న చైనా కంపెనీ ఐపి-కామ్ ఇప్పుడు స్మార్ట్ వై ఫై కాన్సెప్ట్ తో భారత్ లో ప్రత్యేకత చాటుకోవటానికి సిద్ధమైంది. సిస్కో, ఎరిక్సన్ లాంటి పెద్ద కంపెనీల కంటే చాలా చౌకగా సొల్యూషన్స్ ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. భారత్ లో చిన్న, మధ్య తరహా వ్యాపారాలతోబాటు స్కూళ్ళు, కాలేజీలు, ఆస్పత్రులలో వై ఫై మీద దృష్టిపెడుతున్నట్టు ఆ సంస్థ చెబుతోంది.

ఈ ఎక్స్ పో లో పాల్గొన్న సంస్థలలో అప్పియర్ టీవీ, సిస్కో సిస్టమ్స్, ఎలిమెంటల్ టెక్నాలజీస్, ఎరిక్సన్, నాగ్రా, రివర్ సిలికా, శాన్ డిస్క్ ఇండియా, టెలినార్ ఉన్నాయి. ఇవన్నీ కన్వర్జెన్స్ ఇండియా వేదికగా అతమ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించాయి. ఈ ప్రదర్శనతోబాటే అనేక అంశాలమీద సదస్సులు కూడా జరిగాయి.ప్రభుత్వ అధికారులు, పరిశ్రమ ప్రముఖులు, టెక్నోక్రాట్స్, విద్యావేత్తలు, మీడియా నిపుణులు ఈ సదస్సులలో పాల్గొని ప్రసంగించారు. వీరిలో ట్రాయ్ చైర్మన్ ఆర్ ఎస్ శర్మ, బ్రాడ్ కామ్ ఇండియా ఎండీ రాజివ్ కపూర్, సిస్కో ఇండియా ఎండి సంజయ్ కౌల్, టెలినార్ ఇండియా సీఈవో శరద్ మెహ్రోత్రా, భారతి ఇన్ఫ్రాటెల్ ఎండీమ్ సీఈవీ దేవేందర్ సింఘ్ రావల్ తదితరులున్నారు.

ఎగ్జిబిషన్స్ ఇండియా గ్రూప్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ ప్రదర్శనకు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్ మెంట్, కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మంత్రిత్వశాఖ సహకారం అందించాయి.

ఢిల్లీలో జరిగిన మూడు రోజుల కన్వర్జెన్స్ ఇండియా ప్రదర్శనకు వేలాది మంది కేబుల్ రంగానికి చెందినవారు హాజరు కాగా తెలంగాణ ఎమ్మెస్వోల సమాఖ్య అధ్యక్షుడు అందరిలోనూ ప్రత్యేక ఆకర్షణగా తయారయ్యారు. దేశమంతటా కేబుల్ టీవీ డిజిటైజేషన్ జరుగుతూ గడువు దగ్గరపడేకొద్దీ ఎమ్మెస్వోలు, ఆపరేటర్లతోబాటు వినియోగదారులు కూడా  ఆందోళన చెందుతున్న సమయంలో ప్రభుత్వ మొండి వైఖరిని ప్రశ్నిస్తూ హైకోర్టుకు వెళ్ళి స్టే తీసుకురావటమే అందుకు కారణం. ఆయన తెచ్చిన స్టే ఫలితంగా మరిన్ని రాష్ట్రాల హైకోర్టులు కూడా అదే వైఖరి అనుసరించటంతో రెండు నెలలపాటు అనలాగ్ సిగ్నల్స్ కొనసాగే అవకాశం లభించింది. అందుకే ఆయన దేశవ్యాప్తంగా హీరో అయ్యారు. దేశం నలుమూలల నుంచి తరలి వచ్చిన ఎమ్మెస్వోలు, కేబుల్ ఆపరేటర్లు ఆయనను కలిసి ప్రత్యేకంగా అభినందించటం కనిపించింది. అఖిల భారత కేబుల్ ఆపరేటర్ల సమాఖ్య అధ్యక్షురాలు రూప్ శర్మ ఈ సందర్భంగా సుభాష్ రెడ్డిని కలిసి అభినందించటంతోబాటు భవిష్యత్ వ్యూహాలు, కార్యకలాపాల మీద చర్చలు జరిపారు. కేబుల్ పరిశ్రమ కోసం జాతీయ స్థాయిలో తీసుకోవలసిన చర్యలు, చేపట్టాల్సిన కార్యాచరణ గురించి, ఎమ్మెస్వోలకూ, ఆపరేటర్లకూ మధ్య ఉండాల్సిన సత్సంబంధాల గురించి కూడా సమగ్రంగా చర్చించారు. పే టీవీ  బ్రాడ్ కాస్టర్ల ధనదాహాన్ని అడ్డుకోవటానికి ఉమ్మడిగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా అభిప్రాయపడ్దారు.