• Home »
 • Content Code »
 • టీవీ, సినిమా బాలనటీనటుల హక్కుల పరిరక్షణకోసం చట్టం

టీవీ, సినిమా బాలనటీనటుల హక్కుల పరిరక్షణకోసం చట్టం

టీవీ సీరియల్స్, రియాల్టీ షోలూ, ప్రకటనలలో బాల నటీనటులు పెరిగిపోతుండటం మీద ఇటీవలి కాలంలో తీవ్రమైన చర్చోపచర్చలు జరిగాయి. బాల కార్మిక చట్టాలను వీళ్లకు వర్తింపచేయాలని ఒత్తిడి వచ్చింది. దీన్ని తీవ్రంగా పరీశీలించిన ప్రభుత్వం త్వరలోనే ఒక చట్టం తీసుకురావటానికి సిద్ధమైంది. సృజనాత్మకమైన రంగం కాబట్టి నేరుగా బాలకార్మికచట్టాన్ని  ప్రయోగించటం కాకుండా కొన్ని మార్పులతో చట్టం చేయటానికి ముసాయిదా తయారుచేసింది.

నిజానికి టీవీ కార్యక్రమాలలో పిల్లలు పాల్గొనటం, వాళ్ళమీద మానసికమైన వత్తిడి పెరగటం  మీద   విమర్శలు వచ్చినప్పుడు  బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమీషన్  ఈ అంశాన్ని నిశితంగా సమీక్షించి కొన్ని సిఫార్సులు చేసింది. ప్రకటనలలో బాలబాలికల పాత్ర పెరుగుతుండడాన్ని, వారు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవడాన్ని, షూటింగ్ సమయాల్లో తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవటాన్ని, పనిగంటల విషయంలో సరైన నియంత్రణ లేకపోవడాన్ని కమిషన్ గమనించింది. బాలబాలికలు విద్యాపరంగా కూడా నష్టపోవటం, వారి మానసిక ఎదుగుదలకు కూడా ఈ వాతావరణం దోహదం చేయకపోవడం, రియాల్టీ షోస్ లో శారీరకంగానూ, మానసికంగాను తీవ్రమైన ఒత్తిడికి గురవటం లాంటి ఘటనలను కమిషన్ ప్రత్యక్షంగా పరిశీలించింది.

సంచలనం కోసం టీవీ ఛానల్స్ గేమ్ షోస్ నిర్వహిస్తూ వందలాది మంది స్టూడియో ప్రేక్షకుల సమక్షంలోను, కోట్లాదిమంది టీవీ ప్రేక్షకుల సమక్షంలోనూ పిల్లల మీద ప్రతికూల వ్యాఖ్యలు చేయటం, రౌండ్ల వారీగా తొలగిస్తూ మానసిక వేదనకు గురిచేయటం కూడా కమిషన్ గుర్తించింది. 2009 మే 19న జరిగిన ఒక ఘటనలో న్యాయ నిర్ణేతలు బహిరంగంగా చేసిన వ్యాఖ్యలకు తీవ్ర మనస్థాపంతో డిప్రెషన్ కు గురై ఒక అమ్మాయి ఆస్పత్రి పాలయి చనిపోవటం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. అదే విధంగా సీరియల్స్ లో కూడా పిల్లలకు పెద్దవాళ్ల దుస్తులు ధరింపచేసి నోరు తిరగని డైలాగులు వల్లివేయించటం కూడా హింసించటం క్రిందకే వస్తుందని కమిషన్ అభిప్రాయపడింది. చిన్నపిల్లలు ఆ వయసులోనే డబ్బు సంపాదించటం మొదలుపెట్టడంతో తల్లిదండ్రులు కూడా వారిని  ఆ దిశలో మరింతగా ప్రోత్సహించటం సర్వసాధారణంగా మారిందని కమిషన్ వ్యాఖ్యానించింది. సినిమా పరిశ్రమలో కూడా ఇలాంటి ధోరణులు ఉన్నప్పటికీ ఈ అధ్యయనంలో టీవీ పరిశ్రమకు సంబంధించిన వారినే పరిగణనలోకి తీసుకున్నారు.  అయితే, కేంద్రప్రభుత్వం చేయబోయే చట్టంలో మాత్రం రెండింటిలో నటించేవారిని దృష్టిలో పెట్టుకున్నారు.  సినిమా రంగంలో, టీవీ రంగంలో ఉండే భిన్నమైన పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకునే అవసరమైనచోట అందుకు అనుగుణమైన నిబంధనలు ఉండేట్టు చూస్తున్నారు.

కమిషన్ చేసిన సిఫార్సులు ఇలా ఉన్నాయి.

 1. పిల్లల వయసు, వారి మానసిక పరిణతికి మించిన పాత్రలు ధరించకూడదు.
 2. పిల్లలు పొగత్రాగుతున్నట్లు, ఆల్కహాల్ సేవిస్తున్నట్లు లేదా మరేదైనా సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నట్టు చూపించకూడదు.
 3. పిల్లలను నగ్నంగా చూపించకూడదు.
 4. మోసానికి గురైన పిల్లలను చూపించాల్సి వచ్చినప్పుడు కూడా చాలా సున్నితంగా వ్యవహరించాలి. వాళ్ల సంక్షేమానికి నష్టం కలిగించే రీతిలో చిత్రీకరణ సాగకూడదు.
 5. పిల్లల చేత వాళ్ల వయసుకు మించిన సంభాషణలు పలికించకూడదు.
 6. శారీరకంగా గానీ, మానసికంగా గానీ హింసను ప్రేరేపించే ఘట్టాలలో పిల్లలను నటింపచేయకూడదు.
 7. రియాల్టీ షోస్ పోటీ పద్ధతిలో నడపకూడదు.
 8. కార్యక్రమాల్లో ఎవరినీ అవహేళన చేయటం గానీ, అవమాన పరచటం గానీ, నిరుత్సాహ పరచటం గానీ, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగా గానీ చేయకూడదు.
 9. పిల్లల మానసిక సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని వారి ప్రతిభను అంచనా వేయాలే తప్ప, న్యాయ నిర్ణేతలు అసంబద్ధమైన వ్యాఖ్యలు చేయకూడదు.
 10. కార్యక్రమ స్వభావాన్ని వ్రాత పూర్వకంగా ముందుగా పిల్లలకు, వారి తల్లిదండ్రులకు తెలియజేసిన తర్వాతనే ఒప్పందంపై సంతకాలు తీసుకోవాలి.
 11. పిల్లలు తమ వయసును బట్టి షూటింగ్ లో గడిపే సమయాన్ని నిర్ధారించాలి. తక్కువ వయసు ఉన్నవాళ్లు తక్కువ సమయం గడిపేందుకు ఈ నియమం ఉపయోగపడుతుంది.
 12. ఒక రోజు ఒక కార్యక్రమానికి మించి షూటింగ్ లో పాల్గొనకూడదు. వీలైనంత వరకూ ఆదివారాల్లో మాత్రమే కార్యక్రమాల్లో పాల్గొనేలా చూడటం ద్వారా స్కూల్ మిస్సవకుండా చూడవచ్చు
 13. ఇటీవలే భారత ప్రభుత్వం రూపొందించిన విద్యాహక్కు చట్టం అనుగుణంగా రూపొందించిన సూత్రం ఇది.
 14. పిల్లలు గంటకొకసారి విరామం తీసుకుంటూ ఒక షిఫ్ట్ లో మాత్రమే పాల్గొనాలి.
 15. తల్లిపాలు, టీకాలు లాంటి ప్రకటనలు తప్ప మూడు నెలలలోపు పిల్లలను ప్రకటనలలో చూపకూడదు.
 16. ఆరు నెలల లోపు పిల్లలు షూటింగ్ లో పాల్గొనాల్సి వస్తే తప్పనిసరిగా తల్లి వెంట ఉండాలి.
 17. షూటింగ్ జరిపే సమయాల్లో పిల్లల తరపున తల్లిదండ్రుల్లో ఒకరు గానీ, బాగా తెలిసిన వ్యక్తులు గానీ ఒకరు తప్పనిసరిగా ఉండాలి.
 18. ఏడాదిలోపు పిల్లలయితే నర్సు కూడా వెంట ఉండటం తప్పనిసరి. ఆరేళ్లు దాటిన పిల్లలయితే తల్లిదండ్రుల్లో ఒకరు ఉండాలి.
 19. కనీసం ముగ్గురు పిల్లలకు ఒకరు చొప్పున ఒక సూపర్ వైజర్ ను ఛానల్ నియమించాల్సి ఉంటుంది.
 20. పిల్లలను ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు వీలుగా ఛానల్ ఆ సూపర్ వైజర్ కు ఇంకే పని చెప్పకూడదు.
 21. ప్రమాదకరమైన లైటింగ్ కు, రియాక్షన్ కనిపించే మేకప్ సామాగ్రికి పిల్లలను దూరంగా ఉంచాలి.
 22. పిల్లలు షూటింగ్ లో పాల్గొనే సందర్భంలో యూనిట్ సభ్యులకు అంటువ్యాధులేవీ లేవు అనే ధృవీకరణ పత్రం పొందాలి.
 23. షూటింగ్ సమయంలో పిల్లలకు పౌష్టికాహారం, నీరు తదితర పానీయాలు తగినంత సకాలంలో అందించాలి
 24. ప్రొడక్షన్ సెట్ లో పిల్లల వయసుకు తగినట్టుగా వారి విశ్రాంతికి, వినోదానికి తగిన ఏర్పాట్లు చేయాలి.
 25. పిల్లలు డ్రెస్ మార్చుకోటానికి తగిన గదులు ఏర్పాటుచేయాలి.
 26. పిల్లల్లో నిరాశ, నిస్పృహలు చోటు చేసుకోకుండా తగిన మానసిక తోడ్పాటు ఇవ్వాలి. వారి తల్లిదండ్రులకు తగిన కౌన్సెలింగ్ ఇవ్వాలి.
 27. సెట్ రూపకల్పనలో పిల్లల మానసిక, శారీరక సామర్థ్యాలను వారి భద్రతను దృష్టిలో ఉంచుకోవాలి.
 28. పిల్లలతో చేసే అన్ని రియాల్టీ షోస్ లో సెట్ లో ఒక చైల్డ్ సైకాలజిస్ట్ ఉండటం తప్పనిసరి.
 29. విద్యాహక్కు చట్టంలో పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా పిల్లల విద్యాఅవసరాలను తీరుస్తున్నట్టు తల్లిదండ్రుల నుంచి ధృవీకరణ పత్రం తీసుకున్న తరువాతనే షూటింగ్ కు అనుమతించాలి.
 30. అందులో పిల్లల పుట్టిన తేదీ, ఆరోగ్య పరిస్థితి, కార్యక్రమంలో పాల్గొనే తేదీలు, తల్లిదండ్రుల పేర్లు, వారి వృత్తి, పాఠశాల పేరు, తరగతి, స్కూల్లో ఉండాల్సిన సమయం, సెట్ మీద కానీ, ఇంటి దగ్గర కానీ లేదా దూరవిద్య ద్వారా శిక్షణ పొందుతుంటే ఆ వివరాలు పొందుపరచాలి.
 31. మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ, కార్మిక ఉపాధి శాఖ, సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ తరచూ టీవీ కార్యక్రమాల్లో బాలల హక్కుల పరిరక్షణను సమీక్షిస్తూ ఉండాలి.
 32. 18 ఏళ్లలోపు పిల్లలకు బ్యాంకు ఖాతా తెరిచే అవకాశం ఉండదు కనుక వాళ్ల చెల్లింపులు ఫిక్స్ డ్ డిపాజిట్ లేదా బాండ్ రూపంలో చెల్లించాలి. అయితే తల్లిదండ్రులకు ఇవ్వాల్సి వచ్చినప్పుడు కూడా 50 శాతం మాత్రమే వారికి చెల్లించి మిగిలినది ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలి.
 33. వార్తలలో పిల్లల ఇంటర్వ్యూలు ప్రసారం చేయాల్సి వస్తే వారి తల్లిదండ్రుల అనుమతి తీసుకోవటం తప్పనిసరి. పిల్లలను వారి సామర్థ్యానికి మించిన అంశాల మీద వ్యాఖ్యానించమని కోరకూడదు.
 34. పిల్లలు ఒక కార్యక్రమంలో పాల్గొనటం వలన భవిష్యత్ లో కలిగే నష్టాలు ఏమైనా ఉంటే ముందుగానే తెలియజేయాలి.

ఈ సిఫార్సులలో అధికభాగాన్ని ప్రభుత్వం కూడా పరిగణనలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సిఫార్సులకు చట్టబద్ధత లేకపోతే వాటి అమలులో ఇబ్బందులెదురవుతాయి కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు  చట్టం చేయటానికి సిద్దమైంది. మరో రెండు నెలల్లో దీనికి చట్టబద్ధత వస్తుందని భావిస్తున్నారు.