• Home »
  • International Channels »
  • న్యూస్ చానల్స్ లో టి20 వరల్డ్ కప్ మాచ్ ప్రసార పరిమితి రోజుకు 5 ½ నిమిషాలే

న్యూస్ చానల్స్ లో టి20 వరల్డ్ కప్ మాచ్ ప్రసార పరిమితి రోజుకు 5 ½ నిమిషాలే

ఐసిసి వరల్డ్ ట్వంటీ20 పోటీల ప్రసార దృశ్యాలు న్యూస్ చానల్స్ లో రోజుకు ఐదున్నర నిమిషాలకు మించి ప్రసారం చేయకూడదని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ( ఐసిసి) స్పష్టం చేసింది. భారతదేశమంతటా వేరు వేరు ప్రదేశాలలో మార్చి 8 నుంచి ఏప్రిల్ 3 వరకు జరిగే పోటీల ఫుటేజ్ ని  న్యూస్ చానల్స్ ప్రసారం చేయటం మీద ఐసిసి మార్గదర్శకాలు విడుదల చేసింది. ఒక గంటలో రెండు సార్లకు మించి ఆ దృశ్యలు ప్రసారం చేయకూదదని కూడా స్పష్టం చేసింది.

ఒక దృశ్యాన్ని స్టార్ స్పోర్ట్స్ ప్రత్యక్షప్రసారం చేయటం పూర్తయి అరగంట గడిచే దాకా న్యూస్ చానల్స్ ఆ దృశ్యాన్ని ప్రసారం చేయకూడదు. ఒకవేళ ఏదైనా ప్రత్యేక సందర్భం ఉన్నప్పుడు మాత్రం మామూలు వార్తా ప్రసారంలో బ్రేకింగ్ న్యూస్ లాగా ఇవ్వవచ్చునని, అయితే అది 15 సెకెన్లకు మించరాదని ఆ నియమావళిలో పేర్కొంది. హాట్రిక్, లేదా100 వికెట్లు పూర్తిచేయటం, లేదా మరేదైనా మైలురాయిని చేరుకోవటం లాంటి సందర్భాలకు ఈ మినహాయింపునిస్తూ 15 సెకెన్ల వ్యవధిని పరిమితిగా విధించారు.

అయితే ఒక అరగంటలో ఒకసారి మాత్రమే ఆ బ్రేకింగ్ న్యూస్ వీడియో  ప్రదర్శించటానికి అనుమతిస్తారు. సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ డౌన్ లింకింగ్ మార్గదర్శకాల ప్రకారం న్యూస్ అండ్ కరెంట్ ఎఫైర్స్ చానల్స్ గా లైసెన్స్ ఉన్న చానల్స్ కు మాత్రమే ఈ అవకాశం ఇస్తున్నట్టు కూడా ఐసిసి పేర్కొంది.  అదే సమయంలో ఈ ఫుటేజ్ ఆధారంగా కార్యక్రమాలు, డాక్యుమెంటరీలు, ఇంటర్వ్యూలు రూపొందించటం అనుమతించబోమని స్పష్టం చేసింది. ఆట వీడియో ఆధారంగా స్టుడియో ఆధారిత కార్యక్రమాలు రూపొందించకూడదని కూడా పేర్కొంది.