• Home »
  • International Channels »
  • నేషనల్ జాగ్రఫిక్ చానల్ నెట్ వర్క్ కు 9 సహా 16 కొత్త లైసెన్సులు జారీ

నేషనల్ జాగ్రఫిక్ చానల్ నెట్ వర్క్ కు 9 సహా 16 కొత్త లైసెన్సులు జారీ

ఇప్పటిదాక భారతదేశంలో డౌన్ లింక్ చేసుకోవటానికి మాత్రమే లైసెన్స్ పొందగలిగిన నేషనల్ జాగ్రఫిక్ నెట్ వర్క్ ఇప్పుడు తన నెట్ వర్క్ పరిధిలోని 9 చానల్స్ కు అప్ లింకింగ్ లైసెన్స్ కూడా పొందింది. సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ తాజాగా జారీచెసిన 16 కొత్త లైసెన్సులలో 9 ఫాక్స్ ఇంటర్నేషనల్ చానల్స్ గ్రూపుకు చెందిన ఎన్ జి సి నెట్ వర్క్ కి చెందినవే కావటం విశేషం.

మిగిలిన 9 లైసెన్సులలో జీ నెట్ వర్క్ కు రెండు ( వెరియా లివింగ్, జీ కేఫ్ ), స్టార్ ఇండియా గ్రూపుకు చెందిన ఏషియానెట్ హెచ్ డి చానల్ ప్రారంభించటానికి వీలుగా ఏషియానెట్ హెచ్ డి కి ఒక లైసెన్స్ వచ్చాయి. అదే విధంగా మీడియా వరల్డ్ వైడ్ సంస్థ మరాఠీలో సంగీత్ మరాఠీ పేరుతో ఒక మ్యూజిక్ చానల్ ప్రారంభించటానికి లైసెన్స్ సంపాదించుకుంది.

ఎ ఎం టెలివిజన్ సంస్థ రెంగోనీ పేరుతో అస్సామీ లో ఒక ఎంటర్టైన్మెంట్ చానల్ ప్రారంభించటానికి. అదేవిధంగా సబ్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ మీడియా సంస్థ సెవెన్ సిస్టర్ రెయిన్ బో పేరుతో ఒక జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్ ప్రారంభించటానికి, ఆస్ట్రేలియన్ బ్రాడ్ కాస్ట్ కార్పొరేషన్ వారి కాబ్ శాట్ చానల్ కు డౌన్ లింకింగ్ లైసెన్స్ లభించాయి. దీంతో ఇప్పటివరకు లైసెన్స్ పొందిన చానల్స్ సంఖ్య 827 కు చేరింది. ఇందులో 400 చానల్స్ న్యూస్ విభాగంలో లైసెన్స్ పొందగా, 427 చానల్స్ నాన్-న్యూస్ విభాగంలో లైసెన్స్ పొందాయి. ఈ మొత్తంలో భారతదేశం నుంచి అప్ లింకింగ్ అనుమతి పొందినవి 712 చానల్స్.

నేషనల్ జాగ్రఫిక్ చానల్ గ్రూప్ తరఫున లైసెన్స్ పొందిన చానల్స్ జాబితాలో నేషనల్ జాగ్రఫిక్, ఫాక్స్ లైఫ్, ఫాక్స్ లైఫ్ హెచ్ డి, బేబీ టీవీ హెచ్ డి, నాట్ జియో వైల్డ్, నాట్ జియో పీపుల్ హెచ్ డి, నాట్ జియో మ్యూజిక్ హెచ్ డి, నేషనల్ జాగ్రఫిక్ హెచ్ డి ఉన్నాయి. ఇప్పటివరకు ఈ చానల్స్ కు కేవలం డౌన్ లింకింగ్ కి మాత్రమే అనుమతి ఉండటంతో హాంకాంగ్ నుంచి అప్ లింకింగ్ అవుతూ వచ్చాయి.