• Home »
  • Cable »
  • డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్సు కోసం ఇప్పుడూ దరఖాస్తు చేసుకోవచ్చు

డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్సు కోసం ఇప్పుడూ దరఖాస్తు చేసుకోవచ్చు

మూడో దశ డిజిటైజేషన్ గడువు దగ్గరపడుతుండగా ప్రభుత్వం వీలైనంతవరకూ ఎలాంటి అవరోధాలూ లేకుండా చూడాలని నిర్ణయించుకుంది. హోం మంత్రిత్వశాఖ నుంచి సెక్యూరిటీ క్లియరెన్స్ రాకపోయినా తాత్కాలిక ప్రాతిపదికన లైసెన్సులు జారీచేయాలని నిర్ణయించుకోవటం కూడా అందులో భాగమే. అదే విధంగా ఇప్పటివరకూ డిజిటల్ ఎమ్మెస్వోగా దరఖాస్తు చేసుకోని వారుకూడా ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చునని ప్రకటించింది.

నిజానికి డిసెంబర్ లోనే గడువు తేదీ పూర్తవుతున్నప్పుడు ప్రభుత్వం ఫిబ్రవరి 6 వరకు డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్సుల దరఖాస్తులకు గడువు పొడిగించింది. చాలామంది ఆ గడువులోగా దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఆ తరువాత మారిన పరిస్థితుల నేపథ్యంలో మరికొందరు దరఖాస్తు చేసుకోవాలనే అభిప్రాయానికొచ్చారు. అలాంటివారికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఎలాగూ సెక్యూరిటీక్లియరెన్స్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి పూర్తిగా నింపిన దరఖాస్తుదారులకు వెంటనే లైసెన్స్ వచ్చే అవకాశముంది.

హిందుజా వారి గ్రాంట్ హిట్స్ రంగంలో దిగిన తరువాత స్వతంత్ర ఎమ్మెస్వోలు చాలామందికి తమ వ్యాపారం మీద నమ్మకం పెరిగింది. సుదూరప్రాంతంలో ఉన్న పెద్ద ఎమ్మెస్వో నుంచి సిగ్నల్స్ అందుకుంటూ అతడి మీద ఆధారపడి వ్యాపారం చేసుకోక తప్పదని భావించిన వారికి గ్రాంట్ హిట్స్ ఆశాదీపంగా కనబడింది. అయితే, ఎమ్మెస్వో లైసెన్స్ ఉన్నవాళ్ళు మాత్రమే హిట్స్ నుంచి లబ్ధిపొందే అవకాశం ఉన్నదని, వాళ్ళు మాత్రమే పే చానల్స్ తో ఒప్పందాలు చేసుకోగలరని తెలియటంతో చాలామంది డీలా పడ్డారు.

ఇప్పుడు ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించటంతో స్వతంత్ర ఎమ్మెస్వోలు చాలామందికి ఆశలు చిగురించాయి. భారీ మొత్తంలో బ్రాడ్ బాండ్ ఖర్చులు భరిస్తూ సిగ్నల్స్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండదని, గ్రాంట్ హిట్స్ ద్వారా సేవలందుకుంటూ వ్యాపారాన్ని కాపాడుకోవచ్చునని నిర్థారించుకున్నారు. దీంతో ఇప్పుడు మరింతమంది తాజాగా డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్సులకోసం దరఖాస్తు చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి.