• Home »
  • Legal Issues »
  • విదేశీ ఉపగ్రహాలు వాడుకునే టీవీలకు లైసెన్సులు, లోగో మార్పులు ఉండవా?

విదేశీ ఉపగ్రహాలు వాడుకునే టీవీలకు లైసెన్సులు, లోగో మార్పులు ఉండవా?

బ్రాడ్ కాస్టింగ్ రంగంలో వ్యాపారం చేసుకోవటాన్ని సులభతరం చేయటం ఎలాగో సూచనలివ్వాలంటూ ట్రాయ్ ఈ మధ్యనే ఒక చర్చా పత్రం విడుదల చేసింది. కానీ ప్రభుత్వ  వైఖరి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. చానల్స్ ను ఎలా ఇబ్బంది పెట్టాలా అని ఆలోచిస్తోంది. విదేశీ ఉపగ్రహాలు వాడుకుంటే లైసెన్స్ ఇవ్వబోమని చెబుతోంది. అంతేకాదు, ఏడైనా చానల్ పేరు మార్చుకోవాలన్నా సరే భారత ఉపగ్రహం మాత్రమే వాడుకోవాలన షరతు పెడుతోంది.

పేరు, లోగో మార్పు కోసం దాదాపు 50 దరఖాస్తులు పెండింగ్ లో ఉండగా మరో 100 దరఖాస్తులు కొత్త లైసెన్సులకోసం పెట్టుకున్నవి.  ఒకప్పుడు భారత ఉపగ్రహాలే వాడాలన్న షరతు పెట్టినా తగినన్ని ఉపగ్రహాలు లేకపోవటంతో ఆ నిబంధనను ప్రభుత్వమే తొలగించింది. కానీ ఇప్పుడు ట్రాన్స్ పాండర్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇప్పటికిప్పుడు మారటానికి లైసెన్సులను, లోగోమార్పు దరఖాస్తులను అడ్డం పెట్టుకొని బెదరింపులకు దిగుతోంది.

మధ్య ప్రదేశ్ కు చెందిన ఒక శాటిలైట్ చానల్ యాజమాన్య సంస్థ తన చానల్ పేరు మార్పు కోసం దరఖాస్తు చేసుకుంటే అంతరిక్ష శాఖ అనుమతించలేదంటూ సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఈ నెలలోనే ఆ చానల్ కు లేఖ రాసింది. విదేశీ ఉపగ్రహం ద్వారా అప్ లింక్ చేయటమే అందుకు కారణంగా పేర్కొంది.

ఈ చానల్ తాను వాడుకునే ఉపగ్రహంపేరు ఇంటెల్ శాట్ ( ఐఎస్)- 17 గా తెలియజేయటంతో అంతరిక్షశాఖ ఆ దరఖాస్తును పక్కన బెట్టింది. గత నవంబర్ లో ఒకసారి, డిసెంబర్ లో ఇంకోసారి రెండువిడతలు దరఖాస్తు చేసుకున్నా ఫలితం కనబడలేదు. నిజానికి ఆ చానల్ కు ఈ ఏడాది చివరిదాకా లైసెన్స్ ఉన్నప్పటికీ పేరు మార్పుకు అనుమతి ఇవ్వలేదు.

పేరు మార్పు దరఖాస్తుల మీద నిర్ణయం ఆలస్యం అవుతుండటంతో చానల్స్ రెండేసి లోగోలతో దర్శనమిస్తున్నాయి. ఖోజ్ ఇండియా పేరు మారకపోవటంతో తెలుగు న్యూస్ చానల్  ఎపి 24X7 రెండు లోగోలతో ప్రసారమవుతోంది. అదే విధంగా కన్నడలో ఫోకస్ టీవీ గా పేరు మార్పు కోరుతూ దరఖాస్తు చేసుకున్న భాస్కర్ న్యూస్ సైతం రెండు లోగోలతో కొనసాగవలసి వస్తోంది.