• Home »
  • Cable »
  • ముందుకు సాగని ఇంటర్ కనెక్ట్ ఒప్పందాలు

ముందుకు సాగని ఇంటర్ కనెక్ట్ ఒప్పందాలు

మూడోదశ డిజిటైజేషన్ జరగాల్సిన పట్టణాలలో అమలుకు తొందరేమీ లేదన్నట్టుగా చానల్ యజమానులు, ఎమ్మెస్వోలు వ్యవహరిస్తున్నారు. అందుకు తాజా ఉదాహరణ ఇంటర్ కనెక్ట్ ఒప్పందాల గడువు తేదీని బేఖాతరు చేయటమే. ఒకసారి చూసీచూడనట్టు వదిలేసిన ప్రభుత్వం గడువు పెంచినా, రెండో సారి కూడా అదే పరిస్థితి ఎదురైంది. ఈ పరిస్థితినంతా గమనిస్తూనే ఉన్నప్పటికీ ఇప్పుడు ఏం చేయాలా అన్నది టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్ ) కి ఏ మాత్రమూ అంతుచిక్కటం లేదు.IBF MSOs

అంతకుముందు సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ ఎమ్మెస్వోలనూ, బ్రాడ్ కాస్టర్లనూ కచ్చితంగా ఇంతర్ కనెక్ట్ ఆఫర్లమీద సంతకాలు చేసుకోవాలని కోరింది. మే 27 న డిజిటైజేషన్ మీద ఏర్పాటైన ఎనిమిదవ టాస్క్ ఫోర్స్ మే 27 న ఈ విషయాన్ని కూలంకషంగా చర్చించింది. ఇంతర్ కనెక్ట్ ఆఫర్ ఒప్పందాలమీద సంతకాలు జరిగే ప్రక్రియ మరీ నిదానంగా ఉండటం పట్ల మంత్రిత్వశాఖ అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు

ఈ విషయంలో పురోగతిని సమీక్షించటానికి ట్రాయ్ అధికారులు ఎమ్మెస్వోలతోను, బ్రాడ్ కాస్టర్లతోనూ జూన్ మొదటి వారంలో విడివిడిగా చర్చలు జరిపారు. ఇంటర్ కనెక్ట్ ఒప్పందాలు ఎందుకు ఆలస్యమవుతున్నాయో రకరకాల కారణాలు చెప్పారు. ఏమైనప్పటికీ, కనీసం 25శాతం ఒప్పందాల మీదనైనా జూన్ ఆఖరునాటికి సంతకాలు పూర్తవుతాయని ట్రాయ్ కి హామీ ఇచ్చారు. ఇంకా తేలాల్సిన విషయాలు అనేకం ఉండటం వలన ఇంటర్ కనెక్ట్ ఒప్పందాల దిశలో అడుగు వేయలేదని చాలామంది బ్రాడ్ కాస్టర్లు చెబుతున్నారు.

నిజానికి ఈ ఏడాది డిసెంబర్ 31 లోగా మూడోదశ పట్టణాలలో అనలాగ్ సిగ్నల్స్ ప్రసారం నిలిచిపోవాల్సి ఉంది.

ఈ మూడో దశలో 3 కోట్ల 87 లక్షల 90 వేల టీవీ ఇళ్ళు డిజిటైజ్ కావాల్సి ఉంది. అంటే, మొత్తం దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 630 జిల్లాల్లో ఉన్న 7709 పట్టణ ప్రాంతాలు ఇందులో ఉన్నాయి. ఇందులో చాలా కీలకమైన విషయమేంటంటే చానల్స్ ఏ ప్రాతిపదికన ఇవ్వాలనే వాణిజ్యపరమైన అంశాలలోనే గొడవ జరుగుతోంది. మొదటి రెండు దశల్లో కంటే చాలా తక్కువ ధరకే ఇవ్వాలని ఎమ్మెస్వోలు అడుగుతున్నారు. వినియోగదారుల ఆర్థిక స్థోమత తక్కువగా ఉంటుందని, అందువల్లనే చానల్స్ తక్కువధరకి ఇవ్వాలని కోరారు.

” మార్కెట్లో ఎమ్మెస్వోలకు సగటున ఒక్కో కనెక్షన్ కి వచ్చే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని ధర నిర్ణయం జరగాలి. పెద్ద మొత్తాల్లో పెట్టుబడి పెట్టింది ఇప్పటికిప్పుడు మేం నష్టాలపాలు కావటానికి కాదు గదా. చానల్ యజమానులు వాళ్ళ అత్యాశను కాస్త పక్కనబెట్టి కనీసం రెండేళ్ళపాటైనా మేం కోలుకోవటానికి వీలుకల్పించాలి. అప్పటికి గాని మార్కెట్లో చందాల సామర్థ్యం ఒక కొలిక్కి రాదు. “ అంటున్నారు హాత్ వే ఎండీ, సీఈవో జగదీశ్ కుమార్.

అయితే, మరోవైపున చానల్ యజమానులు మాత్రం ససేమిరా అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మెత్తబడేలా లేరు. ధరలు తగ్గించుకోవటానికి ఒప్పుకోవటం లేదు. పైగా కారేజ్ ఫీజు తగ్గిమ్చుకోవలసిందిగా ఎమ్మెస్వోలనే అడుగుతున్నారు. “ క్యారేజు ఫీజులో మూడు, నాలుగు దశల వాటా 25 శాతం మాత్రమే. మొదటి రెండు దశల్లోనే చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటిది మూడు, నాలుగుదశల్లో ఎలా పెరుగుతుంది ? మేమెలా ఒప్పుకుంటాం? “ అని ఒక పంపినీ సంస్థ ఎగ్జిక్యుటివ్ వాదిస్తున్నారు.

ఇంతకీ ఇంటర్ కనెక్ట్ ఒప్పందాలకు ఎక్కడ బ్రేక్ పడినట్టు ?

సిగ్నల్స్ తీసుకోవాలనుకుంటున్న ఎమ్మెస్వోల కోసం చానల్ యజమానులు తమ పే చానల్ వివరాలను, నమూనా ఒప్పందం పత్రాలను వాళ్ళ వెబ్ సైట్ లో పెట్టారు. అది చూశాక చాలామంది ఎమ్మెస్వోలు స్పందించి వినతులు పంపుకున్నారు. మూడోదశ డిజిటైజేషన్ ప్రాంతాల్లో సిగ్నల్స్ కోసం ఇచ్చే దరఖాస్తులో ఎమ్మెస్వోలు పేరు, చిరునామా, సర్వీస్ టాక్స్ రిజిస్ట్రేషన్ నెంబర్, ఎంటర్టైన్మెంట్ టాక్స్ తోబాటు వాళ్లు చందా కట్టాలను కుంటున్న చానల్స్ జాబితా ఇవ్వాల్సి ఉంటుంది.

అదే సమయంలో మూడో దశ ప్రాంతాలకు సంబంధించిన నిర్దిష్టమైన సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అంటే, కార్యకలాపాలు నిర్వహించదలచుకుంటున్న ప్రాంతాలు, అనలాగ్ స్విచాఫ్ చేస్తున్న తేదీ, అమర్చిన సెట్ టాప్ బాక్సులు, అమర్చటానికి నిర్దేశించుకున్న ప్రణాళిక లాంటి వివరాలు పొందుపరచాలి. అంతటితో ఆగకుండా కాపీరైట్ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి పెండింగ్ లో ఉన్న సివిల్/క్రిమినల్/పోలీస్ కేసుల సమాచారం, చీటింగ్ లేదా నెగోషియబుల్ ఇన్ స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద నమోదైన కేసుల వివరాలు కూడా కోరుతున్నారు

 

ఎమెస్వోలు ఈ వివరాలన్నీ సమర్పించారు. అన్నీ ఇచ్చినప్పటికీ బ్రాడ్ కాస్టర్లు వాళ్ళ వాణిజ్య ప్రతిపాదనతో ముందుకు రాలేదన్నది ఎమ్మెస్వోల ఫిర్యాదు. వాళ్ళ ఆఫర్ కోసమే ఎదురుచూస్తున్నట్టు చెబుతున్నారు. అయితే, ఒక పంపిణీ సంస్థ అధికారి చెబుతున్న మాటలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఎమ్మెస్వోలు ఇచ్చిన సమాచారం సమగ్రంగా లేదని, అందువల్లనే వాణిజ్యపరమైన నియమనిబంధనలు కొలిక్కి రాలేదని అంటున్నారు. దీనివల్లనే ఒప్పందాలమీద సంతకాలు ఆలస్యమయ్యాయన్నది వాళ్ళ ఆరోపణ. ఎన్ని సెట్ టాప్ బాక్సులు పెడదామనుకుంటున్నారు లాంటి వివరాలు ఎమ్మెస్వోలనుంచి రావటం లేదని అంటున్నారు. వాళ్ళు ఏ మార్కెట్లలో ప్రవేశపెడుతున్నారని అడిగితే పెద్ద పెద్ద జాబితాలు పంపుతున్నారన్నదికూడా ఒక ఆరోపణ.

ఏమైనప్పటికీ, వచ్చే నెలనుంచి ఇంటర్ కనెక్ట్ ఒప్పందాలు పుంజుకోవచ్చునని అధికారులు భావిస్తున్నారు. అన్నీ గాడిలో పడటానికి నెలరోజులు పట్టవచ్చుననేది వాళ్ళ అంచనా. చర్చలు సాగుతున్నప్పటికీ ఇంకా ఫలవంతం కాలేదంటున్నారు. ట్రాయ్ విధించిన మొదటి గడువు ఏప్రిల్ 30 కాగా, ఆ తరువాత జూన్ 21 గా నిర్ణయించారు. కానీ ఫలితం కనబడలేదు. ఎమ్మెస్వోలు 15 రోజుల్లోగా బ్రాడ్ కాస్టర్లను సంప్రదించాలని, బ్రాడ్ కాస్టర్లు ఎమ్మెస్వోల విజ్ఞప్తికి అ తరువాత 15 రోజుల్లోగా స్పందించాలని ట్రాయ్ స్పష్టం చేసింది.