• Home »
  • Cable »
  • ఆంధ్రప్రదేశ్ లో బ్లాకౌట్ మీద టిడిశాట్ లో ఎన్టీవీ ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్ లో బ్లాకౌట్ మీద టిడిశాట్ లో ఎన్టీవీ ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్ లో కేబుల్ ఆపరేటర్లు ఎన్టీవీ ప్రసారాలు నిలిపివేయటం మీద ఆ చానల్ యాజమాన్యం టెలికామ్ డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ అప్పిల్లేట్ ట్రైబ్యునల్ ( టిడిశాట్ ) లో ఫిర్యాదు చేసింది. అధికారపార్టీ సూచనలమేరకే ఆపరేటర్లు మొత్తం 13 జిల్లాలలో చానల్ ప్రసారాలు నిలిపివేయాలనే నిర్ణయం తీసుకున్నారని ఎన్టీవీ తన పిటిషన్ లో ఆరోపించింది.  ఎమ్మెల్సీ ఎన్నికలలో వోటు వేయటానికి ఆర్ ఎస్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు చంద్రబాబునాయుడు హామీ ఇస్తున్న ఫోన్ సంభాషణ ప్రసారం చేసినందుకే ప్రసారాలమీద వేటు వేశారని పేర్కొంది.

ట్రాయ్ నిబంధనలను సైతం పట్టించుకోకుండా చానల్ ప్రసారాలు అర్థాంతరంగా ఆపేసినందున చానల్ తీవ్రంగా నష్టపోతున్నదని చానల్ పునరుద్ధరణకు వీలుగా మధ్యంతర ఉత్తర్వులివ్వాలని ఎన్టీవీ తరఫు న్యాయవాది విభవ్ శ్రీవాస్తవ వాదించారు. అయితే ప్రతివాదులకు నోటీస్ ఇచ్చి వాళ్ళ వాదన విన్న తరువాత మాత్రమే ఎలాంటి ఆదేశాలైన ఐవ్వగలమని టిడిశాట్ స్పష్టం చేసింది. ఈ కేసులో ఎమ్మెస్వోలు రాజరాజేశ్వరి ఎంటర్టైన్మెంట్, ఎసిఎన్ కేబుల్, మాస్టర్ చానల్ కమ్యూనిటీ, సిటి గుంటూరు డిజిటల్, విజయనగరం సిటీ, శ్రీదేవి డిజిటల్ ను ఎన్టీవీ ప్రతివాదులుగా పేర్కొంది. నాలుగో ప్రతివాది అయిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తరఫున ఎపి భవన్ కమిషనర్ అర్జా శ్రీకాంత్ కోర్టు నోటీసు అందుకున్నారు.

గతంలో తెలంగాణ లో టీవీ9, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి చానల్స్ కూడా బ్లాకౌట్ చేయగా టీవీ9 టిడిశాట్ ను ఆశ్రయించింది. ఆ చానల్ ప్రసారాలు పునరుద్ధరించాలని టిడిశాట్ ఆదేశించినప్పటికీ ఎమ్మెస్వోలు పట్టించుకోలేదు. ఆ తరువాత ఆ ఆదేశాలు బేఖాతరు చేసిన ఎమ్మెస్వోల లైసెన్సులు రద్దుచేయాలని సమాచార, ప్రసారశాఖకు టిడిశాట్ సూచించినా ఎలాంటి మార్పూ కనబడలేదు. ఇప్పుడు టిడిశాట్ నిర్ణయం, దాని అమలు తీరు ఎలా ఉంటాయో చూడాలి.