• Home »
  • Cable »
  • కోల్ కతాలో ఆపరేటర్లు ఏకమై ఎమ్మెస్వోగా అవతరణ

కోల్ కతాలో ఆపరేటర్లు ఏకమై ఎమ్మెస్వోగా అవతరణ

కోల్ కతా నగరంలో నలుగురు కేబుల్ ఆపరేటర్లు ఏకమై స్వయంగా ఒక ఎమ్మెస్వోగా అవతరించారు. బెంగాల్ బ్రాడ్ బాండ్ అండ్ కేబుల్ టీవీ సర్వీసెస్ పేరుతో ఏర్పాటైన ఈ సంస్థ కేబుల్ టీవీ సేవలతోబాటు బ్రాడ్ బాండ్ కూడా అందిస్తుంది.  నాలుగోదశలో ఇంకా అవకాశం ఉన్న విషయాన్ని గ్రహించిన ఈ ఆపరేటర్లు  పెద్ద ఎమ్మెస్వోలకు దీటుగా కార్యకలాపాలు నిర్వహించటానికి సిద్ధమయ్యారు.  వాళ్ళకు ప్రధానంగా సిటి నెట్ వర్క్స్, హాత్ వే, జిటిపిఎల్, మంథన్ లాంటి సంస్థలనుంచి పోటీ ఉంది.

డిజిటైజేషన్ తరువాత తమ వ్యాపారం బాగా దెబ్బతిన్నదని,మ్మెస్వోలు స్థానిక ఆపరేటర్లను పిండుకు తింటున్నారని, మరోవైపు డిటిహెచ్ తమ వ్యపారాన్ని మింగేస్తూ వస్తున్నదని అందుకే సొంతగా డిజిటల్ సర్వీసులు ప్రారంభించి తమ వ్యాపారాన్ని కాపాడుకుంటున్నామని దీని కార్యాలాపాలు నిర్వహించే మృణాల్ చటర్జీ చెబుతున్నారు. ఈ కొత్త ఎమ్మెస్వో ప్రధానంగా కోల్ కత, ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, బుర్ద్వాన్, బీర్భూమ్, నదియా, ముర్శీదాబాద్ మార్కెట్లలో తన కార్యకలాపాలు నిర్వహిస్తుంది.

మరింత మంది కేబుల్ ఆపరేటర్లు తన పరిధిలోకి వస్తారని కూడా సంస్థ భావిస్తోంది. ఇప్పటికే చాలామంది ఒప్పందాలకు ముందుకొస్తున్నట్టు చెబుతున్నారు. సెట్ టాప్ బాక్సుల ధరను సబ్సిడీ కింద ఇవ్వజూపటం కూడా దీని పట్ల ఆకర్షితులు కావటానికి కారణమవుతోంది. ఎస్ డి బాక్స్ ను రూ. 600 కు, హెచ్ డి బాక్స్ ను రూ. 1250 కి ఇస్తున్నారు.  ప్రాథమిక పాకేజ్ కింద పన్నులతో సహా రూ. 280 నెలసరి చందా నిర్ణయించగా ప్రీమియం పాక్ కింద పన్నులతో సహా రూ. 380 చందా నిర్ణయించారు. 50 హెచ్ డి చానల్స్ కావాల్సినవారు అదనంగా రూ. 150 చెల్లించాల్సి ఉంటుంది.