• Home »
  • Cable »
  • గుజరాత్ లో ‘స్టార్’ ధరలకు నిరసనగా ప్రసారాల నిలిపివేత

గుజరాత్ లో ‘స్టార్’ ధరలకు నిరసనగా ప్రసారాల నిలిపివేత

స్టార్ ఇండియా తన చానల్స్ కు ఎక్కువ ధర నిర్ణయించటానికి నిరసనగా అహమ్మదాబాద్ కేబుల్ ఆపరేటర్స్ వెల్ఫేర్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ (ACOWCT) ప్రసారాలు నిలిపివేసింది. దీంతో దాదాపు 12 లక్షలమంది వినియోగదారులు కేబుల్ టీవీ ప్రసారాలకు దూరమయ్యారు. స్టార్ ఇండియా చానల్స్  ధరలు ఒకేసారి 80 శాతం పెంచటం వలన  వినియోగదారులమీద భారం పడటాన్ని నిరసిస్తున్నామని కేబుల్ ఆపరేటర్లు చెబుతున్నారు. ఎమ్మెస్వోలు ఒప్పుకున్నా, ఆపరేటర్లు మాత్రం ప్రేక్షకుల పక్కన నిలబడి నిరసన తెలియజేయటం గమనార్హం.

అయితే, స్టార్ ఇండియా మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తోంది. అందరు చందాదారులకూ అందుబాటులో ఉండే ధరలు మాత్రమే నిర్ణయించామంటోంది.  “ మేం చాలామంది ఎమ్మెస్వోలతో ఇంటర్ కనెక్ట్ ఒప్పందాలు చేసుకున్నాం. ఎక్కడా ఎలాంటి ఇబ్బందీ రాలేదు. ఎలాంటి వ్యతిరేకతా వెల్లడి కాలేదు. రకరకాల పాకేజీలు ప్రకటించినమీదటే ఎమ్మెస్వోలు ఒప్పందాలమీద సంతకాలు చేశారు. ఇందులో బలవంతమేమీలేదు. అయితే, కొంతమంది ఆపరేటర్లు అ లా కార్టే పద్ధతిలో తీసుకోవటం వలన కాస్త ఎక్కువ  ధర అనిపించి ఉండవచ్చునే తప్ప  భారం మోపటం మా లక్ష్యం కాదు” అని స్టార్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలియజేశారు.

ఇలా ఉండగా కేబుల్ ఆపరేటర్ల నిరసన ప్రభావం వడోదర, సూరత్, రాజ్ కోట్ తదితర ప్రాంతాల్లోనూ కనిపించినట్టు తెలుస్తోంది. గతంలో కూడా ఒకసారి గుజరాత్ కేబుల్ ఆపరేటర్లకు స్టార్ స్పోర్ట్స్ ధర విషయంలో వివాదం ఏర్పడి ప్రసారాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో సచిన్ టెండూల్కర్ ఆఖరి టెస్ట్ మాచ్ ఆడుతూ ఉండటంతో కేబుల్ ప్రేక్షకులకు స్టార్ స్పోర్ట్స్ వైఖరిమీద తీవ్ర ఆగ్రహం కలిగింది. ఇప్పుడు ధరలు మరింత పెంచటాన్ని ఆపరేటర్లు ప్రజల దృష్టికి తీసుకురావటంలో సఫలమయ్యారు.