• Home »
  • Content Code »
  • పేలుళ్ళ వార్తలు భారత్ లా రాయకండి : టీవీ చానల్స్ కు పాక్ సూచన

పేలుళ్ళ వార్తలు భారత్ లా రాయకండి : టీవీ చానల్స్ కు పాక్ సూచన

భారత మీడియాలో వాణిజ్యపరమైన ఆసక్తే తప్ప సున్నితత్వం లోపించిందన్నది పాకిస్తాన్ అభిప్రాయం. లాహోర్, ఇస్లామాబాద్, కరాచీ ఘటనలమీద వార్తలు రాయటంలో సంయమనం పాటిస్తూ దేశ ప్రయోజనాలు కాపాడాలని అక్కడి ఎలక్ట్రానిక్ మీడియాకు సూచిస్తూ భారతదేశ ఎలక్ట్రానిక్ మీడియా అనుసరించే విధానం జోలికి పోవద్దని చెప్పింది. పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ తన పత్రికాప్రకటనలో ఈ మేరకు సూచించింది. ఇస్లామాబాద్ కార్యాలయం నుంచి మీడియా, పౌర సంబంధాల జనరల్ మేనేజర్ ఫక్రుద్దిన్ ముఘల్ పేరుతో ఈ రోజు ఈ ప్రకటన విడుదలైంది.

 

 

Pak letter

 

“ లాహోర్, ఇస్లామాబాద్, కరాచీ ఘటనల నేపథ్యంలో మీడియా అత్యంత బాధ్యతతో వృత్తినిబద్ధతతో వ్యవహరించాలని కోరుకుంటున్నాం. ఈ దశలో ఏ మాత్రం బాధ్యతారాహిత్యం, అత్యుత్సాహం ప్రదర్శించినా అది జాతీయ కార్యాచరణ ప్రణాళిక అమలును త్రిశంకు స్వర్గంలోకి నెట్టేస్తుంది. బ్రసెల్స్ దాడి విషయంలో అంతర్జాతీయ మీడియా అనుసరించిన విధానాన్ని పాకిస్తాన్ మీడియా అనుసరించాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప సున్నితత్వం లోపించి, వాణిజ్యావసరాలే పరమావధిగా ఉండే భారతమీడియా అడుగుజాడల్లో నడవకూడదు. పాకిస్తానీ ప్రైవేట్ చానల్స్  దేశం పట్ల అంకితభావం ప్రదర్శిస్తూ, జాతి ఆత్మ స్థైర్యాన్ని పెంపొందించాలే తప్ప రేటింగ్స్ కోసం పరుగులు తీస్తూ ప్రసారాలు సాగిస్తే పాకిస్తాన్ లో అనిశ్చిత వాతావరణమున్నట్టు దేశ విదేశాల్లోని ప్రేక్షకులకు సంకేతాలు అందుతాయి. “ అంటూ ఆ పత్రికాప్రకటన సాగింది.