ఐబిఎన్7 చర్చలో ముష్టిఘాతాలు

తనకు తాను దేవతగా ప్రకటించుకుని వివాదాస్పదురాలిగా మారిన రాధే మా వ్యవహారం ఐబిఎన్7 టీవీ చర్చలో ముష్టిఘాతాలకు దారితీసింది. చర్చ తారస్థాయిలో ఉండగా అందులో పాల్గొంటున్నవారు కొట్టుకోవటంతో అంతా రసాభాసగా మారింది. ఆజ్ కీ ముద్దా పేరుతో సాగే కార్యక్రమంలో పాల్గొన్న హిందూ మహాసభకు చెందిన ఓమ్ జీ , జ్యోతిష్కురాలు రాఖీ బాయ్ వాదోపవాదాలు శ్రుతిమించటంతో ఈ ఘటన జరిగింది.

రాధే మా న్ ఎలా విమర్శిస్తారంటూ ఓమ్ జీ ఈ చర్చలో రాఖీబాయ్ ని నిలదీశారు.తప్పుదిద్దుకోవాలని ఆమెను కోరారు. అయితే, రాఖీబాయ్ నిరసన తెలియజేయటంతో తాను అన్నది అదే చర్చలో పాల్గొంటున్న దీపా శర్మ గురించి అని వివరణ ఇచ్చారు. దీపాశర్మ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆరోపణలు, ఆమె మీద ఉన్న క్రిమినల్ కేసులను ఓమ్ జీ ప్రస్తావించటంతో ఆమె లేచి వెనుకవైపునుంచి వచ్చారు. వీపు మీద తట్టి “ తమీజ్ సే బాత్ కరియే” అంటూ హెచ్చరించటంతోబాటు చెంపమీద కొట్టారు.

వెంటనే ఓమ్ జీ కూడా “తు క్యా మారేగీ ?” అంటూ తిరిగి ఆమె చెంపమీద కొట్టారు. ప్రత్యక్ష ప్రసారం కావటంతో ఇదంతా ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు. బాధ్యతాయుతమైన వారినే చర్చా కార్యక్రమాలకు ఆహ్వానిస్తామని, వాళ్ళు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారనే నమ్ముతామని పేర్కొంటూ, ఈ ఘటనపట్ల ఐబిఎన్7 విచారం వ్యక్తం చేసింది. ఆ ఇద్దరి ప్రవర్తనకు ఖండించింది.