• Home »
  • DTH »
  • రిలయెన్స్ బిగ్ బకాయిల చెల్లింపుకు సిద్ధమైన పాంటెల్ టెక్నాలజీస్

రిలయెన్స్ బిగ్ బకాయిల చెల్లింపుకు సిద్ధమైన పాంటెల్ టెక్నాలజీస్

రిలయెన్స్ కమ్యూనికేషన్స్ సంస్థకు చెందిన డిటిహెచ్ వేదిక రిలయెన్స్ బిగ్ టీవీని కొనుగోలు చేసేలా ఒప్పందం కుదుర్చుకున్న పాంటెల్ టెక్నాలజీస్ సంస్థ రిలయెన్స్ వారి బకాయిలు చెల్లించేందుకు సిద్ధమైంది. ఇండియా కాస్ట్ మీడియా డిస్ట్రిబ్యూషన్, సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ డిస్ట్రిబ్యూషన్ ఇండియా, సినిమా 24X7 ల ఆధ్వర్యంలోని  బ్రాడ్ కాస్టర్లకు రిలయెన్స్ బిగ్ బకాయి పడగా ఇరుపక్షాలకూ ఆమోదయోగ్యంగా ఉండే చెల్లింపులతో సెటిల్ చేసుకోవటానికి పాంటెల్ ఒప్పుకుంది.

అయితే, ఈవిషయంలో కోర్టుదాకా వెళ్ళి రిలయెన్స్ సంస్థ బకాయి పడ్దందుకు గాని ఆ సంస్థను దివాలా దారుగా ప్రకటించాల్సిందిగా సమ్ టీవీ నెట్ వర్క్ కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరుసగా సెటిల్మెంట్లకు పాంటెల్ ప్రయత్నిస్తోంది. అయితే, సన్ టీవీ నెట్ వర్క్ తో మొదలైన చర్చలు మాత్రం ఇంకా ఒక కొలికి రాలేదు. స్టార్ ఇండియా, జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్, డిస్కవరీ కమ్యూనికేషన్స్ లాంటి పెద్ద సంస్థలతో కూడా చర్చలు ఆశించినంతగా పురోగతి సాధించలేదు.

చర్చల పురోగతి మీద, డిటిహెచ్ లైసెన్స్ పునరుద్ధరణకు చేపడుతున్న చర్యలమీద  జనవరి 16న పాంటెల్ సంస్థ టెలికామ్ డిస్ప్యూట్స్ సెటిల్మెంట్స్ అండ్ అప్పెల్లేట్ ట్రైబ్యునల్ (టిడిశాట్) ఎదుటఒక అఫిడవిట్ దాఖలు చేసింది. బకాయిల చెల్లింపులకు తీసుకుంటున్న చర్యలను సైతం ఈ అఫిడవిట్ లో పొందుపరచింది.

రిలయెన్స్ బిగ్ టీవీలో 99.995వాటాలు కొనుగోలు చేసేందుకు 2017 నవంబర్ 27న పాంటెల్ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. అందుకు అనుగుణంగానే డిటిహెచ్ లైసెన్స్ పునరుద్ధరణ కోరుతూ 10 కోట్ల రూపాయల బాంక్ గ్యారెంటీ సమర్పించినట్టు కూడా టిడిశాట్ కు తెలియజేసింది. మూడు సంస్థలతో సెటిల్మెంట్ పూర్తి కాగా మిగిలిన నాలుగు సంస్థలతో చర్చల్లో పురోగతి కనబడుతున్నట్టు పేర్కొంది. ఈ సంస్థల తరఫు న్యాయవాదులు సైతం చర్చలు సాగుతున్న విషయాన్ని ధ్రువీకరించారు.

రిలయెన్స్ బిగ్ టీవీ మొత్తం వంద కోట్ల రూపాయలకు పైగా బ్రాడ్ కాస్టర్లకు బకాయి పడింది.  సన్ నెట్ వర్క్ ఒక్కటే 30 కోట్ల రూపాయల బకాయిలున్నట్టు కోర్టుకు తెలియజేసింది. స్టార్ ఇండియా బకాయిలు సుమారు 22 కోట్లు ఉండగా ఇండియా కాస్ట్ మీడియాకు 15 కోట్ల మేరకు, డిస్కవరీ కి 7.5 కోట్లు బకాయి పడ్డట్టు కోర్టుకు తెలియజేశాయి.

రిలయెన్స్ బిగ్ టీవీ బకాయిల చెల్లింపుకు ఒప్పుకుంటూనే తాము ఆ సంస్థ కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు పాంటెల్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. కనీసం మరో పది రోజుల సమయమిస్తే సెటిల్మెంట్ చర్చలు వేగవంతం చేసి పూర్తి చేస్తామని కూడా కోర్టును కోరారు. తగిన మొత్తం చెల్లించని పక్షంలో నిబంధనల ప్రకారం చానల్స్ సిగ్నల్స్ నిలిపివేయాల్సి ఉంటుందని స్టార్ తరఫు న్యాయవాది చెప్పగా మళ్ళీ విచారణ జరిగేదాకా నిలుపుదల చేయవద్దని టిడిశాట్ ఆదేశించింది.