• Home »
  • Cable »
  • స్వదేశీ సెట్ టాప్ బాక్సులకు ప్రాధాన్యం: పార్లమెంటరీ కమిటీ సూచన

స్వదేశీ సెట్ టాప్ బాక్సులకు ప్రాధాన్యం: పార్లమెంటరీ కమిటీ సూచన

విదేశీ సెట్ టాప్ బాక్సులమీద ఆధారపడే పరిస్థితి పోవాలంటే స్వదేశీ సెట్ టాప్ బాక్సుల వాడకాన్ని ప్రోత్సహించాలని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు సిఫార్సు చేసింది. భారతీయ కండిషనల్ యాక్సెస్ సిస్టమ్ (ఐకాస్) పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే స్వదేశీ సెట్ టాప్ బాక్సుల వాడకం కూడా బాగా పుంజుకుంటుందని కమిటీ అభిప్రాయపడింది.

నిజానికి భారతెయ కండిషనల యాక్సెస్ సిస్టమ్ ను బెంగళూరుకు చెందిన బైడిజైన్ అనే సంస్థ రూపొందించింది. దానికి ప్రభుత్వ సహకారం ఉంది. మూడేళ్ళపాటు విదేశీ సంస్థలకు అమ్మకూడదనే నిబంధన కూడా విధించింది. ప్రస్తుతానికి 80 మంది ఎమ్మెస్వోలు తమ పరిధిలోని 3 లక్షల సెట్ టాప్ బాక్సులకు దీన్ని అమర్చారు. దూరదర్శన్ కూడా తన డిటిహెచ్ వేదిక అయిన ఫ్రీడిష్ లో ఎంపెగ్ 4 బాక్సులకోసం ఐ కాస్ నే ఎంచుకుంది. పరిశ్రమ అంచనాల ప్రకారం సమీప భవిష్యత్తులో కోటి నుంచి కోటిన్నర బాక్సులకు డిమాండ్ ఉంటుందని కమిటీ గుర్తు చేసింది.

ఇప్పటివరకు అమర్చిన బాక్సుల సంఖ్య  11 కోట్లు ఉండగా వాటిలో స్వదేశీ బాక్సులు 20% మించవని కూడా అంచనావేశారు. అయితే పూర్తి అవసరాలకు తగినంత తయారీ సామర్థ్యం తమకున్నదనేది స్వదేశీ తయారీదారుల వాదన. విదేశీ సెట్ టాప్ బాక్సుల వాడకాన్ని నిరుత్సాహపరచేలా వాటి దిగుమతులమీద సుంకాన్ని 5% నుంచి 10% కి పెంచటాన్నిపార్లమెంటరీ కమిటీ అభినందించింది. అదే సమయంలో స్వదేశీ తయారీదారులకు అనుకూలంగా వాటి విడిభాగాల దిగుమతులపై పన్ను తొలగించటాన్ని కూడా అభినందించింది.