• Home »
  • Cable »
  • ఈ ఏడాది చివరికల్లా10 వేల కోట్లు దాటుతున్న భారత పే టీవీ చందాలు

ఈ ఏడాది చివరికల్లా10 వేల కోట్లు దాటుతున్న భారత పే టీవీ చందాలు

ఒకవైపు డిజిటైజేషన్ నత్తనడక నడుస్తున్నదన్న విమర్శలున్నా, పే చానల్స్ ఆదాయాలు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. ప్రకటనల ఆదాయం ఒకవైపు పెరుగుతూ ఉండగా, అంతకంటే ఎక్కువగా  చందాదారులనుంచి వస్తున్న చందాల ఆదాయం కూడా పెరగటం బ్రాడ్ కాస్టర్లకు ఆనందాన్నిస్తోంది. ఇప్పటిదాకా కనెక్షన్ల సంఖ్య ఆశించినంతగా పెరగకపోవటమే తక్కువ ఆదాయానికి కారణమని బ్రాడ్ కాస్తర్లు భావిస్తుండగా, పాకేజీల రూపంలో భారం మోపటం వల్లనే అది సాధ్యమైందని ఎమ్మెస్వోలు వాదిస్తున్నారు.

ఏమైనప్పటికీ ఈ ఏడాది చివరికల్లా భారతదేశంలో పే చానల్స్ చందాల ఆదాయం 10 వేలకోట్ల రూపాయలు దాటుతుందని సింగపూర్ కి చెందిన పరిశోధన, విశ్లేషణా సంస్థ మీడియా పార్ట్నర్స్ ఏషియా వెల్లడించింది.  మొత్తంగా బ్రాడ్ కాస్టర్ల ఆదాయం లో పే చానల్స్ చందాల ఆదాయం 52 శాతం ఉంటుందని, మిగిలిన 48 శాతం ప్రకటనల ఆదాయమని గుర్తించింది. పే చానల్ చందా ఆదాయం నిరుటి ఆదాయం మీద 16 శాతం పెరుగుతున్నట్టు కూడా అంచనావేసింది.

అయితే, బ్రాడ్ కాస్టర్లు ఇదే రకమైన పెరుగుదల కొనసాగించాలంటే బార్క్ చేసిన మార్పులకు అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల రేటింగ్స్ కోసం కార్యక్రమాలలో తగిన మార్పులు చేసుకోవాల్సి ఉంటుందని , చానల్ ధరల విధానంలో కూడా మార్పులు అవసరమని అభిప్రాయపడింది. అదే విధంగా ఒటిటి ని ఆదాయవనరుగా మార్చుకోవటానికి తగిన వ్యూహాలు రూపొందించుకోవాలని సూచించింది. ఇకమీదట వచ్చే రెండు మూడేళ్ళలో పే చానల్ ప్రకటనల ఆదాయం 15శాతం మించి పెరగకపోవచ్చునని ఎం పి ఏ విశ్లేషించింది.

భారతదేశంలో అమలు జరుగుతున్న డిజిటైజేషన్ ప్రక్రియ పే టీవీ పరిశ్రమకు ఎంతో మేలు చేస్తుందని వ్యాఖ్యానిస్తూ, ఇది కేబుల్, డిటిహెచ్ తదితర పే టీవీ వేదికలన్నిటికీ కీలకమైన అవకాశంగా మారుతుందని ఎంపిఏ ఎగ్జిక్యుటివ్ దైరెక్టర్ వివేక్ అన్నారు. మూడో దశ డిజిటైజేషన్ లో  డిజిటల్ కేబుల్ సరైన పాత్ర పోషించిందని, సంప్రదాయ పే టీవీ విధానంలోని లోపాలన్నీ సర్దుకుంటున్నాయని సంస్థ గుర్తించిందని చెప్పారు.

ఒకవైపు రిలయెన్స్ జియో తన పథకాన్ని వెల్లడించాల్సి ఉండగా పట్టణ ప్రాంతాల్లో దాని ప్రభావం గణనీయంగా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బార్క్ రేటింగ్స్ గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించటం వలన మూడు, నాలుగు దశలలో ప్రసార భారతి వారి ఫ్రీడిష్ కు ఆదరణ మరింతగా పెరగటాన్ని కూడా ఈ సంస్థ విశ్లేషించింది. మొత్తంగా చూస్తే భవిష్యత్తులో భారతదేశపు పే టీవీకి ఆశాజనకమైన పరిస్థితులు కనిపిస్తున్నట్టు ఆ నివేదికలో పేర్కొంది.

మొత్తం పే టీవీ చందాదారులు ఇప్పుడున్న 15 కోట్ల 20 లక్షల నుంచి 2025 నాటికి 18 కోట్ల 30 లక్షలకు పెరుగుతారని అంచనా వేసింది. అయితే పే టీవీల నెలసరి ఆదాయం క్రమంగా పెరుగుతుందని, 2025 నాటికి సగటున ఒక్కో కనెక్షన్ నుంచి రూ. 300 వరకు పే టీవీ చందా రూపంలో వసూలవుతుందని ఈ అంచనాలు చెబుతున్నాయి. అయితే, రాను రాను కేబుల్ కనెక్షన్ల ద్వారా వచ్చే పే చానల్ ఆదాయం తగ్గిపోయి డిటిహెచ్ ద్వారా వచ్చే ఆదాయం బ్రాడ్ కాస్టర్లకు పెరిగే అవకాశముందని అంచనా వేసింది.