• Home »
  • Entertainment »
  • కొలిక్కిరాని పే టీవీ చందాల కేసు, ట్రాయ్ అత్యుత్సాహం : 4న సుప్రీం విచారణ

కొలిక్కిరాని పే టీవీ చందాల కేసు, ట్రాయ్ అత్యుత్సాహం : 4న సుప్రీం విచారణ

పే చానల్స్ ప్రేక్షకుల నుంచి వసూలు చేసే చందాలను 27.5% పెంచుకునేందుకు అవకాశం కల్పించే వ్యవహారం కొద్ది నెలలుగా వివాదాస్పదంగా మారి కోర్టు కెక్కింది. చందాదారుల మీద విపరీతమైన భారం మోపటం మొత్తం కేబుల్ వ్యాపారానికే గొడ్డలిపెట్టుగా మారుతుందని ఆపరేటర్లు, ఎమ్మెస్వోలు భావిస్తుండగా, ఖర్చులు పెరిగాయి కాబట్టి పెంపు సమంజసమని చానల్స్ వాదిస్తున్నాయి. అయితే, ప్రకటనల ఆదాయం గణనీయంగా పెరిగింది కాబట్టి చందాలు పెంచనవసరం లేదనేది కేబుల్ పరిశ్రమ వాదన. ఏమైనప్పటికీ , ఈ వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది.

ట్రాయ్ ఈ చందాల పెంపునకు అనుమతించటానికి కారణం ఏడేళ్ళుగా పెంచలేదని చెప్పింది. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, ఇంత భారీగా పెంచిన తరువాత కూడా ఇకముందు ఎప్పటికప్పుడు పెంచుకోవటానికి కూడా పే చానల్స్ కు ట్రాయ్ అవకాశమిచ్చింది. టోకు ధరల సూచి ఆధారంగా పెంచుకోవచ్చునని చెప్పింది. టోకు ధరల సూచి వలన నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల ఏ మేరకు ఉన్నదీ తెలుస్తుంది. ఉద్యోగులకు, కార్మికులకు జీతాలు పెంచటానికి ఈ సూచీని ఆధారంగా చేసుకోవటం తెలిసిందే.

అయితే, టీవీ చానల్స్ ఖర్చులు పెరగటానికి, నిత్యావసర వస్తువుల ధరలు పెరగటానికి సంబంధమేమిటో ట్రాయ్ వివరించలేకపోయింది. టీవీ కార్యక్రమాల తయారీకి అయ్యే ఖర్చులకూ, నిత్యావసరాలకూ సంబంధం లేదు. పైగా టోకు ధరల సూచీ ఆధారంగా చానల్స్ ఏవీ ఉద్యోగుల జీతభత్యాలు పెంచటం లేదు. ఇదే విషయాన్ని టిడిశాట్ దృష్టికి తెస్తూ ట్రాయ్ ఉత్తర్వులు రద్దుచేయాలని కేబుల్ ఆపరేటర్లు, ఎమ్మెస్వోలు టిడి శాట్ ని ఆశ్రయించారు.

టెలికామ్ డిస్ప్యూట్స్ సెటిల్మెంట్స్ అండ్ అప్ప్పిల్లేట్ ట్రైబ్యునల్  (టిడిశాట్) ఈ వ్యవహారాన్ని పరిశీలించి ట్రాయ్ ఏక పక్షంగా, హేతుబద్ధత కానరాని విధానాన్ని అవలంబించినట్టు అభిప్రాయపడింది. ట్రాయ్ ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేసింది. ట్రాయ్ ఆదేశాలు సమంజసంగా లేవని టిడిశాట్ అభిప్రాయపడింది.  హేతుబద్ధమైన విధానాన్ని సూచించవలసిందిగా కూడా ట్రాయ్ ని కోరింది.

 

 

అదనపు ఆదాయం రాదని తేలటంతో టిడిశాట్ ఆదేశాలను పే  టీవీ చానల్స్ సుప్రీంకోర్టులో సవాలు చేశాయి. ఖర్చులు పెరిగాయని, ఏడేళ్ళుగా చందాలు పెరగలేదు కాబట్టి పెంచుకోవటానికి అనుమతించాలని సుప్రీంకోర్టును కోరాయి. టిడిశాట్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టి వేయట ద్వారా ట్రాయ్ ఆదేశాలు అమలయ్యేలా చూడాలని సుప్రీంకోర్టుకు పే చానల్స్ విజ్ఞప్తి చేశాయి. దీంతో ఈ వ్యవహారాన్ని తేల్చాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు మీద పడింది.

ఒక వైపు విచారణ కొనసాగుతుడగా ట్రాయ్ ఒక ఆకస్మిక నిర్ణయం తీసుకొని మరోమారు వార్తల్లోకెక్కింది. జులై 23న అకస్మాత్తుగా యాభై నాలుగు మంది బ్రాడ్ కాస్టర్లను తమ చందా ధరలు తగ్గించుకోవాలని కోరింది. ఇలా మార్చిన చందా ధరల జాబితాను పది రోజుల్లోగా ట్రాయ్ కి అందజేయాలని కూడా కోరింది. దాదాపు రెండు నెలలుగా  చైర్మన్ లేకుండానే నెట్టుకొస్తున్న ట్రాయ్ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఒక వైపు సుప్ర్రీం కోర్టులో కేసు ఉండగానే ఇలా కోరటం ఏమిటో అర్థం కాలేదు.

అప్పటివరకూ ట్రాయ్ ని మెచ్చుకున్న పే చానల్ యజమానులు దిగ్భ్రాంతి చెందారు. వెంటనే ఈ విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో ట్రాయ్ ఆదేశాలు నిలిపివేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. పే చానల్ యజమానులు పెంచిన చందాలు ఉపసంహరించుకుంటూ తాజాగా చందారేట్లను పది రోజుల్లో  తనకు సమర్పించాలంటూ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్ ) ఆ ముందు రోజు ఇచ్చిన ఆదేశాలను బుట్ట దాఖలు చేయాల్సి వచ్చింది. ఆగస్టులో మళ్ళీ విచారణ జరిగేవరకూ పెంచిన 27.5 శాతం చందారేట్లను ఉపసంహరించుకోనక్కర్లేదని చెబుతూ సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. గతంలో ట్రాయ్ ఇచ్చిన పెంపుదల ఆదేశాల మీద స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు ఇప్పుడు పెంపుదల నిలిపివేసిన ట్రాయ్ ఆదేశాలమీద కూడా స్టే ఇవ్వటం గమనార్హం.

డిజిటైజేషన్ లో భాగంగ చానల్ యాజమాన్యాలకూ, ఎమ్మెస్వోలకూ మధ్య జరగాల్సిన రిఫరెన్స్ ఇంటర్ కనెక్ట్ ఆఫర్ లకు సైతం ఈ తీర్పుతో సంబంధం ఉందని భావిస్తున్నారు. తీర్పు వెలువడిన తరువాతనే పే చానల్స్ ధరలు నిర్థారణ అవుతాయని జీ గ్రూప్ విస్పష్టంగా ప్రకటించింది. అందుకే ఆర్ ఐ ఓ ఒప్పందాలు ఇంకా ఖరారు చేయలేదని చెబుతోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇవ్వబోయే తీర్పు చాలా కీలకంగా మారబోతోంది.

ఇలా ఉండగా జెమినీ గ్రూప్ చానల్స్ ఈ కేసు విచారణలో ఉండగానే 27.5% పెంపును అమలు చేయటం మొదలుపెట్టింది. రెండు దశలలో పెంచుకోవటానికి ట్రాయ్ అనుమతించిన వెంటనే మొదటి దశ పెంపు అమలు చేయ్తటమే కాకుండా, టిడిశాట్ కొట్టువేసిన తరువాత కూడా రెండో దశ కొనసాగిస్తూ ఇన్వాయిస్ లు జారీచేయటం పట్ల తెలంగాణ  ఎమ్మెస్వోల సమాఖ్య అధ్యక్షుడు సుభాష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.  మొదటి దశ చెల్లింపులకు రిఫండ్ ఇమ్మని కోరలేదని, కనీసం రెండో దశ వసూళ్ళు నిలిపివేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.