• Home »
  • MIB/Licencing »
  • సన్ కేసులో రాజ్ నాథ్ కి పిఎంవో మద్దతు

సన్ కేసులో రాజ్ నాథ్ కి పిఎంవో మద్దతు

సన్ నెట్ వర్క్ చానల్స్ కు లైసెన్సులు రాకుండా సెక్యూరిటీ క్లియరెన్స్ నిలిపివేసిన ఘట్టం మరింత జటిలంగా తయారైంది. హోం శాఖ సూచనమీద దూకుడుగా స్పందించటానికి వెనుకాడిన సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ అటార్నీ జనరలొ సలహా కోరగా ఆయన హోంశాఖ సూచనపాటించటం తగదనే సూచించటం తెలిసిందే. అయితే, అటార్నీ జనరల్ సూచనను పాటించాలన్న నిబంధన లేకపోయినా, ఘర్షణ వాతావరణానికి తెరతీయటం ఇష్టంలేని సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది.

ఇలా ఉండగా, తాజాగా ప్రధాని కార్యాలయం కూడా హోం శాఖ సిఫార్సులే సమర్థిస్తున్నట్టు తెలుస్తోంది. పైగా. కల్ కేబుల్స్ విషయంలోనూ మద్రాస్ హైకోర్టు మారన్ కు ఊరటనివ్వటంమీద అప్పీల్ పిటిషన్ వేయాలని నిర్ణయించింది. ప్రధాని ప్రిన్సిపల్ కార్యదర్శి నృపేంద్ర మిశ్రా ఒక సమావేశం ఏర్పాటు చేసి సన్ టీవీ వ్యవహారం మీద సుదీర్ఘ సమాలోచనలు జరపటం కూడా మారన్ వ్యతిరేక సంకేతాలనిస్తోంది. ఈ సమావేశంలో హోం శాఖ కార్యదర్శి ఎల్ సి గోయల్, సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ కార్యదర్శి బిమల్ జుల్కా, న్యాయ మంత్రిత్వశాఖ అకార్యదర్శి పికె మల్హోత్రా పాల్గొన్నారు. అటార్నీ జనరల్ ఇచ్చిన అభిప్రాయం మీదనే ప్రధానంగా చర్చ సాగినట్టు తెలుస్తోంది.

అయితే సమాచార, ప్రసారాల శాఖామంత్రి అరుణ్ జైట్లీ విదేశ పర్యటన ముగించుకొని వచ్చిన తరువాత ఈ కీలకమైన అంశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశముందని భావిస్తున్నారు.

.