• Home »
  • Entertainment »
  • చానల్స్ లైసెన్సుల రద్దును టిడిశాట్ లో సవాలు చేసిన పాజిటివ్ టెలివిజన్

చానల్స్ లైసెన్సుల రద్దును టిడిశాట్ లో సవాలు చేసిన పాజిటివ్ టెలివిజన్

పాజిటివ్ టెలివిజన్ సంస్థ ఆధ్వర్యంలో నడిచే నాలుగు చానల్స్ కు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ లైసెన్స్ రద్దు చేయటాన్ని ఆ సంస్థ టెలికాం డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ అప్పెల్లేట్ టైబ్యునల్ ( టిడిశాట్) లో సవాలు చేసింది. హోం శాఖ సెక్యూరిటీ క్లియరెన్స్ ను ఉపసంహరించుకోవటంతో సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఫోకస్ న్యూస్, ఫోకస్ బంగ్లా, ఫోకస్ హర్యానా, ఫోకస్ ఒడిశా చానల్స్ లైసెన్సులను రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో వీటి ప్రసారాలు ప్రస్తుతం నిలిచిపోయి ఉన్నాయి.

నిరుడు ఈ సంస్థ అధ్వర్యంలోని ఫోకస్ ఎన్ ఇ, ఫోకస్ హై ఫై మూతపడ్డాయి. దీనికి జిందాల్ స్టీల్ చైర్మన్, కాంగ్రెస్ నాయకుడు అయిన నవీన్ జిందాల్ అధిపతి. అయితే, సెక్యూరిటీ క్లియరెన్స్ ను ఎందుకు ఉపసంహరించుకున్నదీ కారణాలు చెప్పలేదన్నది ప్రధాన అభ్యంతరం. దేశానికి ముప్పు వాటిల్లే పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే సెక్యూరిటీ క్లియరెన్స్ ఉపసంహరించుకోవాలని సన్ టీవీ కేసులో అటార్నీ జనరల్ చెప్పటాన్ని ఈ సందర్భంగా పాజిటివ్ టెలివిజన్ ఉదహరించింది.

టిడిశాట్ ముందు ఈ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు అసలు ట్రైబ్యునల్ కు విచారించే హక్కు ఉన్నదా అని హోం మంత్రిత్వశాఖ ప్రశ్నించింది. మరో వైపు ఇంకో ప్రతివాది అయిన సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ప్రతినిధులెవరూ హాజరుకాలేదు. 18 లోగా దాని తరఫున కూడా సమాధానం దాఖలు చేయాలని హోంశాఖ తరఫున హాజరైన రాజీవ్ శర్మనే టిడిశాట్ ఆదేశించింది.