• Home »
  • BARC »
  • బార్క్ జాప్యం వల్లనే డిడి రేటింగ్స్ దెబ్బతింటున్నాయ్: ప్రసారభారతి ఆవేదన

బార్క్ జాప్యం వల్లనే డిడి రేటింగ్స్ దెబ్బతింటున్నాయ్: ప్రసారభారతి ఆవేదన

ప్రేక్షకాదరణ లెక్కింపు చేపడుతున్న బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ( బార్క్ ) అసాధారణ జాప్యం వల్లనే గ్రామీణ ప్రేక్షకుల టీవీ ఆదరణ లెక్కలోకి రావటం లేదని, దీనివలన డిడి చానల్స్ తీవ్రంగా నష్టపోతున్నాయని ప్రసారభారతి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితం అవుతున్న బార్క్ గ్రామీణ భారతాన్ని పట్టించుకోకుండా నిరాశకు గురిచేస్తోందని ప్రసారభారతి అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి బార్క్ ఏర్పడినప్పుడు సగానికి సగం శాంపిల్స్ గ్రామీణ ప్రాంతాలనుంచి తీస్తామని చెప్పుకున్న విషయం తెలిసిందే. అయితే, కొంత కాలంగా బార్క్ త్వరలోనే గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తామని ప్రకటనలు చేస్తున్నదే తప్ప ఆచరణలో ఇంకా అమలు చేయలేదు. మొదట జులై లో ఇస్తామని చెప్పి ఆ తరువాత సెప్టెంబర్ కు వాయిదావేశారు. సెప్టెంబర్ నుంచి ఇవ్వాల్సిన గ్రామీణ ప్రేక్షకుల డేటా ఇంకో నెలగడిచినా వాయిదాలమీద వాయిదా పడుతూనే ఉంది.

గతంలో టామ్ రేటింగ్స్ ఇస్తున్నప్పుడు దాని కచ్చితత్వం మీద అనేక అనుమానాలుండేయని, అందుకే దాని స్థానంలో బార్క్ వచ్చినా వివక్ష కొనసాగుతూ ఉండటం దురదృష్టకరమన్నారు. ఇప్పటికీ గ్రామీణ ప్రేక్షకులను పట్టించుకోకుండా ఇచ్చే డేటా కు విశ్వసనీయత ఎలా వస్తుందని ప్రసార భారతి అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ అంశాలన్నీ ప్రస్తావిస్తూ ప్రసార భారతి సీఎవో జవహర్ సర్కార్ బార్క్ సీఈవో పార్థో దాస్ గుప్తా కు తీవ్ర పదజాలంతో లేఖ్ రాశారు.

బార్క్ అనుసరిస్తున్న వైఖరి వల్ల దూరదర్శన్ ఆదాయానికి పెద్ద ఎత్తున గండిపడుతున్నదని. పైగా గ్రామీణ ప్రేక్షకుల ఆదరణకు సంబంధించిన సమాచారం అందించే విధంగానే తాము బార్క్ తో ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారాయన. లాభాపేక్షలేని ప్రసార భారతి తనకు అందాల్సిన కనీస వాటా కూడా అందకపోవటం వలన నష్టపోతున్న విషయాన్ని జవహర్ సర్కార్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇప్పటిదాకా ఎంతో ఓపికగా ఎదురుచూశామని సర్కార్ ఆ లేఖలో రాశారు. నిజానికి బార్క్ ఏర్పాట్లు చేసుకోవటానికి ఆరు నెల సమయం సరిపోతుందని కూడా వ్యాఖ్యానించారు.