• Home »
  • Top Stories »
  • ’ మా మూవీస్ ’ లో ప్రో కబడ్డీ లీగ్

’ మా మూవీస్ ’ లో ప్రో కబడ్డీ లీగ్

మా టీవీ నెట్ వర్క్ ఈ మధ్యనే స్టార్ టీవీ పరం కావటంతో ఈ సారి ప్రో కబడ్డీ లీగ్ పోటీలను తెలుగు లోనూ ప్రసారం చేయాలని స్టార్ ఇండియా నిర్ణయించుకుంది. ఈ మధ్యనే క్రికెట్ ప్రసారాలను తెలుగు మినహా దక్షిణాది భాషలన్నిటిలోనూ అందించిన స్టార్ ఇప్పుడు కొత్తగా తన అమ్ములపొదిలో చేరిన మా టీవీని కూడా వాడుకోవాలని నిర్ణయించింది. మెయిన్ చానల్ ’ మా టీవీ ’ ప్రసారాలకు అంతరాయం కలగకుండా మా మూవీస్ లో కబడ్డీ పోటీలు ప్రత్యక్షప్రసారం చేస్తుంది. కామెంటరీ కూడా తెలుగులోనే ఉంటుంది.

వచ్చే నెల 18 న ప్రారంభమయ్యే స్టార్ స్పోర్ట్స్ ప్రో కబడ్డీ లీగ్ రెండో సీజన్ ను ఇంగ్లీష్, హిందీ, తెలుగు, కన్నడ, మరాఠీ భాషల్లో సన్ నెట్ వర్క్ చానల్స్ ద్వారా అందించాలని నిర్ణయించినట్టు స్టార్ వెల్లడించింది. ఇంగ్లీష్ కామెంటరీ స్టార్ స్పోర్ట్స్2 లోను, స్టార్ స్పోర్ట్స్ హెచ్ డి2 లోనూ ప్రసారం చేస్తూ హిందీ ఫీడ్ ను స్టార్ స్పోర్ట్స్ 3 లోనూ స్టార్ స్పోర్ట్స్ హెచ్ డి 3 లోనూ అందిస్తారు. కన్నడ ప్రేక్షకుల కోసం సువర్ణ ప్లస్ లోనూ, తెలుగు ప్రేక్షకుల కోసం మా మూవీస్ లోనూ ప్రసారమవుతుంది. అయితే, మరాఠీలో మాత్రం స్టార్ ప్రవాహ్ లో ఆదివారం మాత్రమే కబడ్డీ పోటీల ప్రత్యక్ష ప్రసారాలు అందుతాయి

మొదటి సీజన్ లో వచ్చిన స్పందన అద్భుతంగా ఉండటంతో కబడ్డీ ప్రధాన స్రవంతిలో చేరిందన్న నమ్మకం కలిగిందని స్టార్ ఇండియా ఒక ప్రకటనలో తెలియజేసింది. పల్లెప్రజలతో బాటు పట్టణ ప్రజలుసైతం కబడ్డీని ఆస్వాదించగలుగు తున్నట్టు తేలిందని పేర్కొంది. అందుకే రెండో సీజన్ ను ప్రేక్షకులకు మరింత దగ్గరగా తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నామని, భారతదేశంలో బహుళ క్రీడా సంస్కృతిని పెంపొందించాలన్న తమ లక్ష్యంలో ఇది కూడా భాగమని స్టార్ ఇండియా వెల్లడించింది. దేశంలో క్రికెట్ తరువాత అత్యధికులు చూసే క్రీడగా కబడ్డీ నమోదైనట్టు రేటింగ్స్ సమాచారం తెలియజేస్తోంది.