• Home »
  • Entertainment »
  • రేపటినుంచి ప్రో కబడ్డీ లీగ్ : మా మూవీస్ లో ప్రసారం

రేపటినుంచి ప్రో కబడ్డీ లీగ్ : మా మూవీస్ లో ప్రసారం

స్టార్ ఇండియా ఇప్పుడు  రెండో సీజన్ ప్రో కబడ్డీ లీగ్ తో సిద్ధమైంది. 5 భాషల్లో 8 చానల్స్ లో ప్రత్యక్ష ప్రసారం చేయటానికి ఏర్పాట్లు చేసింది. రేపటినుంచి జరిగే ఈ ప్రతిష్ఠాత్మకమైన పోటీలకు పది మంది స్పాన్సర్లు వచ్చినట్టు స్టార్ ఇండియా వెల్లడించింది. ప్రసార విస్తరణ పెరగటంతోబాటు ఆటగాళ్ళ సంఖ్య కూడా 14 నుంచి 25 కు పెరిగింది. పైగా, ఇక నుంచి ఏడాదికి రెండు సార్లు ఈ టోర్నెమెంట్ నిర్వహించాలని స్తార్ భావిస్తోంది.  ఈ సారి  టోర్నమెంట్ 2016 జనవరిలో జరపటానికి ఏర్పాట్లు చేస్తోంది.

మొదటి సీజన్ లోనే మొత్తం ప్రేక్షకుల సంఖ్య 40 కోట్లకు చేరుకోగా  ఈ సారి కనీసం 60 కోట్ల మందిని చేరుకోవాలని భావిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ కు గట్టి పోటీ ఇవ్వగల ఇరాన్ నుంచి కూడా ఈసారి కొంతమంది ఆటగాళ్ళు చేరారు. మొదటిసారిగా తెలుగు ప్రేక్షకులకు కూడా తెలుగు వ్యాఖ్యానంతో మా మూవీస్ ద్వారా ఈ ప్రసారాలు అందుబాటులోకి వస్తున్నాయి. అదే విధంగా ఈ ప్రసారాలు 109 దేశాలకు అందుబాటులోకి వస్తున్నట్టు కూడా స్టార్ ఇండియా ప్రకటించింది.

స్టార్ స్పోర్ట్స్ ఈ సారి కూడా టైటిల్ స్పాన్సర్ గా ఉంది. మరో పదిమంది కో స్పాన్సర్లుగా వచ్చారు. అందులో టివిఎస్, విఐపి ఫ్రెంజీ, బజాజ్ ఎలక్ట్రికల్స్, థంప్స్ అప్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫ్లిప్ కార్ట్, భారత అణు విద్యుత్ సంస్థ, మహీంద్రా జీతో, రేడియో మిర్చి ఉన్నాయి. మొదటి సంవత్సరం స్పాన్సర్లను వెతుక్కుంటూ వెళ్ళిన స్టార్ గ్రూప్ దగ్గర ఇప్పుడు స్పాన్సర్లే క్యూ కట్టటం ప్రో కబడ్డీ లీగ్ విజయానికి సంకేతం. ఈ విజయం కారణంగానే త్వరలో మహిళల కబడ్డీ లీగ్ పోటీలమీద కూడా స్టార్ ఆలోచిస్తోంది.