• Home »
  • BARC »
  • ప్రొ కబడ్డీ హాట్రిక్ విజయం: ఆదాయం రూ.60 కోట్లు, 36% పెరిగిన ప్రేక్షకాదరణ

ప్రొ కబడ్డీ హాట్రిక్ విజయం: ఆదాయం రూ.60 కోట్లు, 36% పెరిగిన ప్రేక్షకాదరణ

స్టార్ స్పోర్ట్స్ ప్రొ కబడ్డీ లీగ్ మూడో విడత మరీ ఆలస్యం చేయకుండా వచ్చేసింది. విజయాన్నీ నమోదు చేసుకోవటంతో హాట్రిక్ సాధించినట్టయింది. జట్ల విషయంలోగాని, ఫార్మాట్ లో గాని ఎలాంటి మార్పూ లేదు. కాకపోతే, బాగా ప్రాచుర్యం పొంది జనం అంచనాలు పెరిగిపోవటంతో ఆ అంచనాలకు తగినట్టుగా టోర్నమెంట్ నిర్వహించటం ఒక్కటే స్టార్ ఇండియా మీద ఉన్న బాధ్యత. అందులో ఎలాంటి లోపమూ కనబడనివ్వదు కాబట్టే స్టార్ ఈ విజయాన్ని సొంతం చేసుకోగలిగింది.

ఆరు సంస్థలను అసోసియేట్ స్పాన్సర్లుగా తీసుకోవటం కూడా  స్టార్ ఆర్థిక విజయానికి కారణమయ్యాయి. బజాజ్, టీవీ ఎస్, ఫ్లిప్ కార్ట్, స్టేట్ బాంక్ ఆఫ్ ఇండియా, గియోనీ, ఐడియా అసోసియేట్ స్పాన్సర్లు కాగాఫెయిర్ అండ్ లవ్లీ, నిస్సిన్, మౌంటేన్ డ్యూ భాగస్వాములుగా వచ్చి చేరాయి. ప్రకటనల రూపంలో వచ్చిన ఆదాయం గతంలో కంటే 20 శాతం పెరిగి ఇప్పుడు దాదాపు రూ. 60 కోట్లకు చేరటం విశేషం. స్టార్ వ్యూహ రచనకు ఇది అద్దం పడుతుంది.

పెద్ద పెద్ద సంస్థలకు మాత్రమే అమ్మటం ద్వారా ఎక్కువ లాభం పొందటం కనిపిస్తుంది.

 

నిజానికి ఈ 20 శాతం పెరుగుదలకు ప్రేక్షకాదరణనూ ముడిపెట్టవచ్చు. బార్క్ గణాంకాల ప్రకారం ప్రేక్షకాదరణలో 36 శాతం పెరుగుదల నమోదైంది. అందువలన 20 శాతం ఆదాయం పెరగటంలో ఆశ్చర్యమేమీ లేదని, స్పాన్సర్లకు తమ పెట్టుబడికి మించిన ప్రతిఫలం లభించినట్టేనని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లోనూ, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇంత వేగంగా ప్రేక్షకులను పెంచుకోగలిగిన ఆట మరొకటి లేదని స్టార్ ఇండియా సీఈవో ఉదయశంకర్ చెబుతున్నారు.