• Home »
  • Cable »
  • కర్నూలు కేబుల్ లో పీస్ టీవీ ప్రసారం: ఫిర్యాదు పరిశీలిస్తున్నామన్న వెంకయ్య

కర్నూలు కేబుల్ లో పీస్ టీవీ ప్రసారం: ఫిర్యాదు పరిశీలిస్తున్నామన్న వెంకయ్య

కర్నూలు, ఔరంగాబాద్ జిల్లాల్లో పీస్ టీవీ ప్రసారాలు కేబుల్ టీవీ ద్వారా అందినట్టు ఫిర్యాదులు వచ్చాయని, ఈ విషయాన్ని ఆయా జిల్లా అధికారులతో దర్యాప్తు జరిపిస్తున్నామని సమాచార, ప్రసార శాఖామంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ మేరకు రాజ్యసభకు లిఖితపూర్వకంగా తెలియజేశారు.

జకీర్ నాయక్ కు చెందిన ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ నడిపే పీస్ టీవీ కి భారతదేశంలో డౌన్ లింకింగ్ కు అనుమతి లేకపోయినా చాలా చోట్ల ఆ ప్రసారాలు వస్తున్నట్టు తెలిసిన కేంద్రం అలాంటి కేబుల్ టీవీ ఆపరేటర్లమీద కఠిన చర్యలుంటాయని తీవ్రంగా హెచ్చరించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో అందిన ఫిర్యాదులను ఆయా జిల్లాల అధికారులకు పంపుతూ కేబుల్ టీవీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కర్నూలు, ఔరంగాబాద్ జిల్లాల నుంచి అందిన ఫిర్యాదులమీద కూడా కలెక్టర్లకు అదే రకమైన ఆదేశాలు జారీ అయ్యాయి.